Opposition Meet: విపక్ష కూటమి పగ్గాలు.. సోనియా గాంధీకేనా?

Opposition Meet: విపక్షాల భేటీలో కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియా గాంధీకి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై నేటి సాయంత్రం ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.

Published : 18 Jul 2023 10:02 IST

బెంగళూరు: వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. బెంగళూరు వేదికగా సోమవారం మొదలైన విపక్షాల భేటీ (Opposition Meet) మంగళవారం కూడా కొనసాగనుంది. నిన్న రాత్రి జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ (Congress) మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. కాగా.. విపక్షాల కూటమిలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ (Sonia Gandhi)కి కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కలిసే పోరాడతాం.. కమలదళంపై విపక్షాల ‘దండు’యాత్ర

కనీస ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా విపక్ష నేతలు తొలిరోజు సమాలోచనలు జరిపారు. మంగళవారం జరిగే సమావేశంలో ప్రతిపక్షాల కూటమికి పేరును నిర్ణయించనున్నారు. అనంతరం విపక్షాల ఫ్రంట్‌ (Opposition Front) అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక కన్వీనర్‌గా బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ (Nitish Kumar) పేరు వినిపిస్తోంది. నేటి భేటీ అనంతరం దీనిపై నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపక్షాల భేటీ కొనసాగనుంది.

శరద్‌ పవార్‌ ఎటో..

విపక్ష కూటమిలోని భాగస్వామ్య పక్షాల సమన్వయం, కనీస ఉమ్మడి ప్రణాళిక ఖరారులో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ  వ్యవస్థాపకుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar) సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్‌సీపీలో చీలిక నేపథ్యంలో సొంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆయన తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న చీలిక వర్గం నేత అజిత్‌ పవార్‌ మరోసారి శరద్‌ పవార్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. శరద్‌ పవార్‌ నేడు ఎన్డీయే సమావేశానికి హాజరవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో విపక్షాల భేటీకి ఆయన రాకపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని