Gautam Adani: హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితం: అదానీ

అదానీ గ్రూప్‌ వాటాదారులతో ఆ సంస్థ అధినేత గౌతమ్‌ అదానీ ప్రసంగించారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక పూర్తిగా దురుద్దేశపూరితమని, ఆ కమిటీ నివేదికతో షేర్‌హోల్డర్లలో విశ్వాసం పెరిగిందని అన్నారు.

Updated : 18 Jul 2023 11:45 IST

ముంబయి: అదానీ గ్రూప్‌ (Adani group) సంస్థలపై అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) ఇచ్చిన నివేదిక సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మరోసారి స్పందించారు. అది పూర్తిగా దురుద్దేశపూరిత నివేదిక అని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే నిరాధార ఆరోపణలు చేశారని పునరుద్ఘాటించారు.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వార్షిక సమావేశం (ఏజీఎం)లో షేర్‌ హోల్డర్లను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. ‘‘భారత చరిత్రలోనే అతిపెద్ద ఫాలో ఆన్‌ పబ్లిక్ ఆఫరింగ్‌ (ఎఫ్‌పీవో)ను ప్రారంభించేందుకు మేం సిద్ధపడుతున్న వేళ.. హిండెన్‌బర్గ్‌ ఈ నివేదికను ప్రచురించింది. తప్పుడు సమాచారం, అసత్య ఆరోపణలతో ఆ నివేదికను రూపొందించారు. అందులో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు 2004 నుంచి 2015 మధ్య జరిగినవే. అవన్నీ సంబంధిత అధికారులు అప్పటికే పరిష్కరించిన అంశాలు. మా ప్రతిష్ఠను దెబ్బతీయడం, మా స్టాక్ ధరలను తగ్గించి లాభాలను ఆర్జించాలన్న లక్ష్యంతోనే ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం అది’’ అని గౌతమ్‌ అదానీ మండిపడ్డారు.

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం.. రెండేళ్ల నష్టం రూ.6 లక్షల కోట్లు..!

తమ కంపెనీ ఎలాంటి నిబంధల ఉల్లంఘలనకు పాల్పడలేదని నిపుణుల కమిటీ గుర్తించిందని గౌతమ్‌ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. ఆ కమిటీ నివేదికతో వాటాదారుల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఇక, కృత్రిమ మేధ అన్ని రంగాలను విపరీతంగా ప్రభావితం చేస్తోందని తెలిపారు.

మోసపూరిత లావాదేవీలు, స్టాక్‌ ధరల తారుమారు వంటి అవకతవకలకు అదానీ గ్రూప్‌ పాల్పడిందంటూ గతంలో హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన తర్వాత అదానీ గ్రూప్‌ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోవైపు, నివేదిక ఎఫెక్ట్‌తో ఎఫ్‌పీఓను అర్ధంతరంగా ఉపసంహరించుకుంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారి డబ్బులను తిరిగిచ్చేసింది.

అయితే, ఈ నివేదికపై ఈ ఏడాది మే నెలలో నిపుణల కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ‘అవకతవలకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలూ కనిపించలేదని.. నియంత్రణపరమైన వైఫల్యం కూడా లేద’ని పేర్కొంది. ఈ నివేదికను సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) పరిశీలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు