China Foreign Minister: చైనా విదేశాంగ మంత్రి ఎక్కడ..? నెల రోజులుగా కనిపించని కిన్ గాంగ్‌

చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ (Qin Gang) గత నెల రోజులుగా బయటకు కన్పించట్లేదు. దీంతో బీజింగ్‌ సర్కారు అణచివేతలో భాగంగానే ఆయన అదృశ్యమయ్యారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Published : 18 Jul 2023 10:36 IST

బీజింగ్‌: చైనా (China) ప్రభుత్వాన్ని ధిక్కరించిన వ్యాపార, టెక్‌ వర్గాలపై డ్రాగన్‌ అణచివేత కారణంగా గతంలో పలువురు ప్రముఖులు నెలల తరబడి అదృశ్యం కావడం తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. అలాంటిది ఇప్పుడు సొంత ప్రభుత్వంలోని మంత్రే కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ (Foreign Minister Qin Gang) గత మూడు వారాలకు పైగా ప్రజా జీవితంలో కన్పించట్లేదు. ఆయన అదృశ్యంపై బీజింగ్‌ సర్కారు కూడా సరైన కారణాలు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

కిన్‌ గాంగ్‌ (Qin Gang) గతేడాది డిసెంబరులోనే విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాకు చైనా (China) రాయబారిగా ఉన్న ఆయనకు.. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్వయంగా పదోన్నతి కల్పించినట్లు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా కిన్‌ గాంగ్‌ అధికారిక కార్యక్రమాల్లో కన్పించట్లేదు. చివరిసారిగా ఈ ఏడాది జూన్‌ 25న బీజింగ్‌లో జరిగిన సమావేశంలో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

చైనా రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం.. రెండేళ్ల నష్టం రూ.6 లక్షల కోట్లు!

ఇటీవల జరిగిన అసియాన్‌ సమావేశానికి గాంగ్‌ హాజరుకాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని అప్పట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాంగ్‌ స్థానంలో చైనా కీలక దౌత్యవేత్త వాంగ్‌ యీనే విదేశాంగ శాఖ బాధ్యతలను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతవారం జరిగిన అసియాన్‌ సదస్సుకు వాంగ్‌ యీనే హాజరయ్యారు. అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ ఆయనే భేటీ అయ్యారు.

పెళ్లి చేసుకుంటున్నారా..?

కిన్‌ గాంగ్‌ (Qin Gang) అదృశ్యంపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పడం గమనార్హం. మరోవైపు గాంగ్ గురించి ఆన్‌లైన్‌లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా పౌరురాలైన టీవీ జర్నలిస్టు ఫు షియోటియాన్‌తో గాంగ్‌ ప్రేమలో ఉన్నట్లు చైనీస్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఓ మీడియా సంస్థలో ఆమె పనిచేస్తోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని, ఆ పనుల్లోనే ఆయన బిజీగా ఉన్నారని సదరు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వదంతులపై చైనా ప్రభుత్వం స్పందించలేదు.

కాగా.. చైనాలో గతంలోనూ కొందరు ప్రభుత్వ అధికారులు ప్రజా జీవితం నుంచి కన్పించకుండా పోయారు. అవినీతికి సంబంధించిన కేసుల్లో వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఆ తర్వాత వెల్లడైంది. అయితే, కిన్‌ గాంగ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయా? లేదా? అన్నది తెలియరాలేదు. అయితే విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు ఆయన అమెరికన్లపై ప్రశంసలు కురిపించడం అప్పట్లో వైరల్‌ అయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని