China: రెండేళ్ల నష్టం రూ.6 లక్షల కోట్లు.. వెల్లడించిన ఎవర్‌గ్రాండే..!

రియల్‌ఎస్టేట్‌ దిగ్గజం ఎవర్‌గ్రాండే తొలిసారి తన నష్టాలను బహిర్గతం చేసింది. రెండేళ్లలో రూ.6లక్షల కోట్లకు పైగా నష్టం మూటగట్టుకొన్నట్లు వెల్లడించింది.

Published : 18 Jul 2023 10:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా (China) రియల్‌ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే (Evergrande) గత రెండేళ్లలో భారీ నష్టాలను చవిచూసింది. ఈ కాలంలో దాదాపు 81 బిలియన్‌ డాలర్ల (రూ.6 లక్షల కోట్లు) నష్టం వచ్చింది. మార్కెట్లో ట్రేడింగ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు వీలుగా ఈ కంపెనీ విడుదల చేసిన ఫలితాల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఈ కంపెనీ చైనా చరిత్రలోనే అతిపెద్ద రుణ పునర్‌వ్యవస్థీకరణ పూర్తి చేస్తోంది.

ఈ కంపెనీ లెక్కల ప్రకారం 2022లో 14.8 బిలియన్‌ డాలర్ల నష్టం రాగా.. మిగిలిన నష్టం 2021లో వచ్చినట్లు హాంగ్‌సెంగ్‌ ఎక్స్‌ఛేంజికి వెల్లడించింది. ఈ ఫలితాలతో చైనాలో గృహ సంక్షోభం కారణంగా ఎవర్‌గ్రాండే భారీగా దెబ్బతిన్నట్లు తేలేంది. చైనా ప్రభుత్వం గృహ రుణాలపై కఠిన నిబంధనలు విధించడంతో ఈ కంపెనీ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నిబంధనల ప్రకారం పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ విచ్చలవిడిగా రుణాలు తీసుకోకుండా 2020లో కళ్లెం వేసింది. రుణ దాతలు ముఖ్యంగా బ్యాంక్‌ సూచించిన త్రీరెడ్‌ లైన్స్‌ (మూడు నిబంధనలు) దృష్టిలో పెట్టుకొని రుణాలు ఇవ్వాలని పేర్కొంది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీలకు మరుసటి ఏడాది రుణాన్ని పెంచుకొనేందుకు అనుమతి లభిస్తుంది. ఈ సంస్థ ఆదాయం దాదాపు సగానికి పడిపోయింది. ఫలితంగా 2021లో 1.2 బిలియన్‌ డాలర్ల అంతర్జాతీయ రుణాల చెల్లింపులు చేయలేకపోయింది. 

విమాన ఇంజిన్లకు మరమ్మతులు ఇక్కడే

పలు కారణాలతో తమకు నష్టాలు వచ్చాయని సంస్థ తాజాగా ఫైలింగ్‌లో పేర్కొంది. పలు ప్రాజెక్టులు, ఆస్తుల విలువ పడిపోవడం, రుణాలు ప్రియం కావడం వంటి కారణాలతో ఈ నష్టాలు వచ్చినట్లు వివరించింది. ఒకప్పుడు చైనాలో అత్యధిక ప్రీమియంతో ఈ కంపెనీ షేర్లు ట్రేడ్‌ అయ్యేవి. కానీ, గతేడాది మార్చిలో ఈ షేర్ల ట్రేడింగ్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ కంపెనీపై దాదాపు 300 బిలియన్ డాలర్ల రుణాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని