Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 22 Aug 2023 13:01 IST

1. 28న దిల్లీకి తెదేపా అధినేత చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈనెల 28న దిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అక్రమ ఓట్ల తొలగింపు వ్యవహారంపై.. దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. ఓట్ల తొలగింపులో ‘ఊరూరా ఉరవకొండ’ లాంటి ఘటనలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. వైకాపా సానుభూతిపరుల దొంగ ఓట్లు చేర్చడం.. తెదేపా అనుకూల ఓట్లు తొలగించడంపై ఫిర్యాదు చేయనున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భక్తుల లగేజీ విధానంలో తితిదే కొత్త మార్పులు

శ్రీవారి భక్తుల సౌలభ్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) లగేజీ విధానంలో అధునాతన మార్పులు తీసుకొని వచ్చింది. లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు తితిదే సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దింది. లగేజీ సెంటర్‌కు బాలాజీ బ్యాగేజ్‌ సెంటర్‌గా నామకరణం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కదిరి వైకాపాలో వర్గ విభేదాలు.. విహారయాత్రకు మున్సిపల్‌ కౌన్సిలర్లు

అనంతపురం జిల్లా కదిరి వైకాపాలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మార్పు కోరుతూ అధికార పార్టీ కౌన్సిలర్లు విహారయాత్రకు వెళ్లారు. 16 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు కేరళలోని మున్నార్‌కు బయల్దేరారు. ముందస్తు ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్లకు ఛైర్‌పర్సన్‌ను మార్చాలని వారంతా డిమాండ్‌ చేస్తున్నారు. విహారయాత్రకు బయల్దేరిన కౌన్సిలర్లంతా ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వర్గీయులు కావడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాంగ్రెస్‌ టికెట్‌కు ఎమ్మెల్యే రేఖా నాయక్‌ దరఖాస్తు

భారాసకు చెందిన ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రేఖానాయక్‌ పీఏ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో రేఖానాయక్‌ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నన్ను ఇబ్బంది పెడితే నేనూ ఇబ్బంది పెడతా: మైనంపల్లి

భారాస టికెట్ల కేటాయింపుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మరోసారి స్పందించారు. సోమవారం తాను పార్టీ గురించి మాట్లాడలేదని.. తన వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించానని చెప్పారు. తిరుమలలో మరోసారి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ వెళ్లాక తన కార్యాచరణ వెల్లడిస్తానని మైనంపల్లి తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత కౌంటర్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భారాస ప్రకటించిన టికెట్లపై తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా 2 సార్లు మోసం చేసింది. మీ రాజకీయ అభద్రతను మహిళా ప్రాతినిధ్యానికి ముడి పెట్టొద్దు’’ అంటూ కవిత మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉల్లి ధరల పెరుగుదల.. మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

పెరుగుతున్న ఉల్లి ధరల (Onion Price)ను కట్టడి చేసి, దేశీయంగా సరఫరాను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. దాంతోపాటు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) ఆధ్వర్యంలో దిల్లీలో కిలో ఉల్లిని రూ.25కే సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఉల్లి ధరలో ఎలాంటి మార్పులేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బ్రిక్స్‌లో బలమైన సహకారంపై చర్చిస్తాం: మోదీ

బ్రిక్స్‌(BRICS) సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఈ సారి బ్రిక్స్‌ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పసిఫిక్‌లో టెన్షన్‌.. మరో 48 గంటల్లో సముద్రంలోకి అణు జలాలు..!

జపాన్‌(Japan)లో సునామీ కారణంగా దెబ్బతిన్న ఫుకుషిమా(Fukushima) అణు రియాక్టర్‌లో పేరుకుపోయిన వ్యర్థ జలాలను మరో 48 గంటల్లో పసిఫిక్‌ మహా సముద్రంలోకి విడుదల చేయడం మొదలు పెట్టనున్నారు. ఈ విషయాన్ని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే జపాన్‌ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గురువారం నన్ను అరెస్టు చేస్తారు: ట్రంప్‌

అమెరికా (USA) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)నకు ఎన్నికల ముందు అరెస్టు భయం వెంటాడుతోంది. తాజాగా ఆయన జార్జియాలో ఎదుర్కొంటున్న ‘ఎన్నికల ఫలితాల్లో జోక్యం’ ఆరోపణలపై లొంగిపోవాల్సి ఉంది. ఇప్పటికే ఆయన స్వయంగా ఫుల్టన్‌ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయి రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్‌ తీసుకొనేందుకు అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని