Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Dec 2023 13:05 IST

1. కేసీఆర్‌ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని తెలిపారు. ‘‘బాత్‌రూమ్‌లో జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలి’’ అని హెల్త్‌ బులెటిన్‌లో వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ప్రజాదర్బార్‌’ ప్రారంభం.. అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్‌

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. క్యూలైన్లలో ఉన్న ప్రజల నుంచి వినతిపత్రాలను సీఎం స్వీకరించి పరిశీలించారు. వారి సమస్యలను రేవంత్‌ అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..

దేశంలో ఉల్లి ధరలు (Onion Prices) మళ్లీ మండిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల (Onion Exports)పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (DGFT) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు ‘భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI)’ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. దీంతో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగనుంది. కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఐదోసారి. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన (RBI Monetary Policy) కమిటీ సమావేశ నిర్ణయాలను శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విదేశాల్లో 403 మంది భారత విద్యార్థుల మృతి.. అత్యధికంగా కెనడాలోనే

హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం.. ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో (foreign countries) చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది భారతీయ విద్యార్థులు (Indian students) అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 2018 నుంచి ఇప్పటివరకు 400 మందికి పైనే విద్యార్థులు విదేశాల్లో మృతిచెందినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఇందులో అత్యధిక మరణాలు కెనడా (Canada)లోనే చోటుచేసుకున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలు

రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) మరోసారి భారత ప్రధాని మోదీ(Modi)పై ప్రశంసలు కురిపించారు. భారత ప్రజల ప్రయోజనాల కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటారని  కొనియాడారు. రష్యా, భారత్ మధ్య లోతైన బంధాలకు ఆయన విధానాలే గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన హిందీలో మాట్లాడటం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నేను వెళ్తున్నానని.. ఇప్పుడు జగన్‌ హడావుడిగా బయల్దేరారు: చంద్రబాబు

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని..  అందుకే ఇప్పుడు సీఎం జగన్ హడావుడిగా బయల్దేరారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెనాలికి వెళ్తూ మార్గమధ్యంలో ఆగారు. రేవేంద్రపాడు వద్ద రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుట వారు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మహువా మొయిత్రాపై ఆరోపణలు.. లోక్‌సభ ముందుకు ఎథిక్స్‌ కమిటీ నివేదిక

ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ (TMC) ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై పార్లమెంటు నైతిక విలువల కమిటీ రూపొందించిన నివేదిక లోక్‌సభ (Lok sabha) ముందుకు వచ్చింది. ఈ నివేదికను భాజపా ఎంపీ, ఎథిక్స్‌ కమిటీ (Ethics Committee) ఛైర్మన్‌ విజయ్‌ సోన్కర్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోదీజీతో మా నాన్న.. కంగారేస్తోంది: స్మృతి ఇరానీ పోస్టు వైరల్‌

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani) సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆమె చేసే పోస్టుల్లో చమత్కారం కనిపిస్తుంది. తాజాగా ఆమె తండ్రి అజయ్‌ కుమార్‌ మల్హోత్రా.. ప్రధాని మోదీ (Modi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి భేటీని ఆమె పేరెంట్‌-టీచర్ మీటింగ్‌ (PTM)తో పోల్చారు. ‘మన బాస్‌, మన తల్లిదండ్రులు ఒక దగ్గర కూర్చున్నారంటే కంగారొచ్చేస్తుంది. వారిద్దరూ కలిసి మనపై పోటీ పడి ఫిర్యాదులు చెప్పకూడదని ప్రార్థించుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్‌ తీరు..

ఇజ్రాయెల్‌ దళాల వద్ద బందీలుగా ఉన్న గాజా (Gaza) పురుషుల పరిస్థితి దయనీయంగా ఉందని ‘ది యూరో-మెడిటేరియన్‌ హ్యూమన్‌రైట్స్‌ మానిటర్‌’ సంస్థ ఆరోపించింది. గాజాలోని డజన్ల కొద్దీ పురుషులను ఇజ్రాయెల్‌ దళాలు బంధించి వేధిస్తున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతోపాటు పలువురు పురుషులకు కళ్లకు గంతలు కట్టి లోదుస్తులపై తరలిస్తున్నట్లు ఉన్న ఫొటోలను పోస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని