Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Dec 2022 17:16 IST

1. రూ.100 కోట్లతో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి: సీఎం కేసీఆర్‌

నినాదాలు తప్ప ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ దేశానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. జగిత్యాల పట్టణంలోని మోతెలో ఏర్పాటు చేసిన తెరాస భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం చేతగాని విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రం రూ.3లక్షల కోట్లు నష్టపోయిందని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బీసీలను వెన్నెముక గల కులాలుగా మార్చే బాధ్యత నాది: సీఎం జగన్

వైకాపా మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాములను చేశామని చెప్పారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ సభలో ఆయన మాట్లాడారు. బీసీలను వెన్నెముక గల కులాలుగా మార్చే బాధ్యత తనదని జగన్‌ చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీలో కాషాయ కోటను బద్దలుకొట్టిన కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD Elections)లో 15 ఏళ్ల భాజపా (BJP) పాలనను ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) ఊడ్చేసింది. బుధవారం వెలువడిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. ఆప్‌ 134 స్థానాలకు కైవసం చేసుకుంది. దీంతో మేయర్‌ సీటు ఆమ్ ఆద్మీ వశమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దిల్లీ ‘స్థానికం’.. ఆమ్‌ఆద్మీకి ఎందుకంత ప్రత్యేకం..?

దిల్లీ (Delhi) మున్సిపల్ కార్పొరేషన్ (MCD)‌.. దేశ రాజధానిలోని పాలనా యంత్రాంగంలో కేవలం ఓ విభాగం మాత్రమే. కానీ ఇప్పుడు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న స్థానిక సంస్థ ఇది. అందుక్కారణం.. ఈ మున్సిపల్‌ కార్పొరేషన్‌(అంతకుముందు మూడు కార్పొరేషన్లుగా ఉండగా.. ఈ ఏడాది వీటిని విలీనం చేసి ఎంసీడీగా పునరుద్ధరించారు) ఆ మూడు కార్పోరేషన్లలో 15ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భాజపా (BJP)ను ఓడించి.. ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) జయకేతనం ఎగురవేయడమే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రం సహకారం.. ప్రధాని మోదీ ఆశీర్వాదం అవసరం: కేజ్రీవాల్‌

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(MCD)లో ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల ఆప్‌(AAP) జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) హర్షం వ్యక్తంచేశారు. తమ పార్టీకి ఘన విజయం అందించిన దిల్లీవాసులకు కృతజ్ఞతలు చెప్పారు. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(Muncipal corporation of Delhi) నిర్వహించే బాధ్యతను ‘మీ కొడుకు, సోదరుడి’కి అప్పగించినందుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 2022 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్‌..!

ఫిఫా ప్రపంచకప్‌(fifa world cup 2022  ) రౌండ్‌-16లో భాగంగా జరిగిన నాకౌట్‌ మ్యాచ్‌లో గోల్స్‌ వర్షం కురిసింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఆటగాళ్లు 6 గోల్స్‌తో ప్రత్యర్థి స్విట్జర్లాండ్‌ను  హడలెత్తించారు. ఈ మ్యాచ్‌కు ఓ విశేషం ఉంది. 2022 ప్రపంచకప్‌లో తొలిసారి హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదయ్యాయి. పోర్చుగల్‌కు చెందిన 21 ఏళ్ల ఆటగాడు గోంకాలో రామోస్‌(Goncalo Ramos) 17, 51, 67 నిమిషాల్లో గోల్స్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గోల్డ్‌ ఏటీఎం నుంచి బంగారం ఎలా తీసుకోవాలి?

భౌతిక బంగారాన్ని (Gold) కొనుగోలు చేసేందుకు దుకాణాలకే వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇకపై ఏటీఎం నుంచి కూడా తీసుకోవచ్చు. ఏటీఎం నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకున్నంత సులువుగా.. బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్‌ సిక్కా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇటీవలే హైదరాబాద్‌లోని బేగంపేటలో గోల్డ్‌ ఏటీఎంను (Gold ATM) ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే మొట్టమొదటి రియల్‌ టైమ్‌ గోల్డ్‌ డిస్పెన్సింగ్‌  మెషిన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నోట్ల రద్దుపై రికార్డులు సమర్పించండి.. కేంద్రం, ఆర్‌బీఐకి సుప్రీం ఆదేశాలు

ఆరేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు (denomination)ను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ ముగించింది. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ 2016లో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ RBI)ను ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్లపై తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రష్యా వైమానిక స్థావరంపై దాడులకు మా సహకారంలేదు: అమెరికా

రష్యా (Russia)వ్యూహాత్మక బాంబర్లను నిలిపిన కుర్స్క్‌ ప్రాంతం సహా మూడు వైమానిక స్థావరాలపై దాడులు చేసేలా ఉక్రెయిన్‌(Ukraine)కు తాము సహకరించలేదని అమెరికా వెల్లడించింది. ఆ దేశ విదేశీ వ్యవహారాలశాఖా మంత్రి ఆంటోనీ బ్లింకన్‌( Antony Blinken) ఈ విషయాన్ని వివరించారు. తమ వైమానిక స్థావరాలపై డ్రోన్‌ దాడి కీవ్ పనే అని రష్యా (Russia)ఆరోపించిన కొద్దిసేపటికే వెంటనే అమెరికా ప్రతిస్పందన రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? పెరిగిన EMI ఇక చెల్లించాల్సిందేనా?

ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి రెపోరేటును (Repo rate) 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లతో పెంపును మొదలు పెట్టిన ఆర్‌బీఐ.. విడతల వారీగా 2.25 శాతం మేర వడ్డీని పెంచింది. అక్టోబర్‌ వరకు పెంచిన 190 బేసిస్‌ పాయింట్ల వడ్డీని ఇప్పటికే రుణ సంస్థలకు రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. తాజా పెంపు నేపథ్యంలో వడ్డీని మరోసారి సవరించనున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని