Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 May 2023 17:07 IST

1. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చు: ఈటల

తన సేవలు ఎక్కడ అవసరమైతే పార్టీ అక్కడ ఉపయోగించుకుంటోందని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అప్పుడైనా.. ఇప్పుడైనా పదవి కావాలని అడిగే వ్యక్తిని కాదని చెప్పారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చన్న ఈటల.. బండి సంజయ్‌ తన శక్తిమేరకు పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో బుధవారం ఈటల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘కోడికత్తి’ తరహాలో అవినాష్‌రెడ్డి డ్రామా: భాజపా నేత సత్యకుమార్‌

నాలుగేళ్లలో సీఎం జగన్‌ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. విచారణ ఎల్లుండికి వాయిదా

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ నిబంధనల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘మేం రావట్లేదు’: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై విపక్షాల సంయుక్త ప్రకటన

పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దీనిపై మొదలైన రాజకీయ రగడ మరోస్థాయికి చేరింది. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్షపార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ మొండెం లేని తల ఓ నర్సుది.. మలక్‌పేట కేసులో కీలక పురోగతి

నగరంలోని మలక్‌పేట వద్ద మూసీ సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మొండెంలేని తలను ఓ నర్సుదిగా గుర్తించారు. ఆరు రోజుల క్రితం మలక్‌పేటలోని మూసీ పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్‌ కవరులో మొండెంలేని తల కనిపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ధోనీ ఏది తాకినా.. అదంతా బంగారమైపోతుంది: సురేశ్ రైనా

కీలకమైన ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఛాంపియన్‌ గేమ్‌ను ఆడింది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ను (GT vs CSK) ఓడించిన చెన్నై ఐపీఎల్ 2023 సీజన్‌ (IPL 2023) ఫైనల్‌కు చేరింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) నాయకత్వంలోని సీఎస్‌కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్‌ స్టేజ్‌ను ముగించింది. అయితే, ప్రస్తుత సీజన్‌ తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ చేతిలోనే ఓడిపోయి టోర్నీని ఆరంభించిన చెన్నై తాజాగా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రపంచ కుబేరుడి సంపదలో.. ఒక్కరోజే రూ.90వేల కోట్లు ఆవిరి

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి సంపన్నుల (Billionaires) ఆస్తుల విలువ ఒక్కోసారి తీవ్ర ఒడిదొడుకులకు లోనవడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault) సంపదలో ఒక్కరోజే అత్యధికంగా 11 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.90వేల కోట్లు) తుడిచి పెట్టుకుపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొత్త పార్లమెంట్‌లో రాజదండం.. దాని చరిత్ర తెలుసా..?

ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం(New Parliament Building) సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) ఒక బంగారు రాజదండాన్ని(Sceptre) స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) బుధవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బైడెన్‌ను చంపాలని.. 6 నెలలు ప్లాన్‌ చేసి..: సాయివర్షిత్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

అమెరికా (USA) అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) వద్ద ఓ యువకుడు ట్రక్కుతో దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో నిందితుడైన తెలుగు సంతతి వ్యక్తి 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ (Kandula Sai Varshith)ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధ్యక్షుడు జో బైడెన్‌ (President Joe Biden)ను హత్య చేయాలనే లక్ష్యంతో నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి యత్నించినట్లు తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం’: ఆ ఘటనలపై మోదీ హెచ్చరిక

ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian PM Anthony Albanese), మోదీ బుధవారం పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మధ్యకాలంలో ఆ దేశంలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతోన్న దాడులు వారి మధ్య చర్చకు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని