PM Modi : ‘మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం’: ఆ ఘటనలపై మోదీ హెచ్చరిక

ఆస్ట్రేలియా(Australia) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi)..ఆ దేశ ప్రధాని అల్బనీస్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. అలాగే రెండు దేశాల సంబంధాలను క్రికెట్‌తో ముడిపెడుతూ సరదాగా స్పందించారు. 

Updated : 24 May 2023 15:16 IST

దిల్లీ: ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian PM Anthony Albanese), మోదీ బుధవారం పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మధ్యకాలంలో ఆ దేశంలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతోన్న దాడులు వారి మధ్య చర్చకు వచ్చాయి.

‘ఆస్టేలియా(Australia)లో ప్రార్థనాస్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాల గురించి అల్బనీస్‌, నేను గతంలో చర్చించాం. ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం. అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్‌ మరోసారి హామీ ఇచ్చారు’ అని మోదీ వెల్లడించారు. ఇక ఈ ఇద్దరు నేతలు పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చించారు.

అలాగే ఇరువురు నేతలు తరచూ సమావేశం కావడంపై మోదీ స్పందించారు. ‘గత ఏడాది కాలంలో మేం ఆరుసార్లు భేటీ అయ్యాం. ఇది రెండు దేశాల మధ్య బలమైన బంధాన్ని ప్రతిబింబిస్తోంది. అలాగే క్రికెట్ భాషలో చెప్పాలంటే .. రెండు దేశాల సంబంధాలు టీ 20 మోడ్‌లోకి ప్రవేశించాయి’ అని మోదీ(Modi) సరదాగా వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ(PM Modi)కి విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా సిడ్నీలోని అడ్మిరాలిటీ హౌస్‌ వద్ద గార్డ్‌ ఆఫ్ హానర్ లభించింది. ఇక మంగళవారం మోదీ ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సందర్భంగా మోదీ ఈజ్ ద బాస్‌ అంటూ అల్బనీస్‌ పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ రోజుతో మోదీ పర్యటన ముగియనుంది.

అల్బనీస్‌కు మోదీ ఆహ్వానం..

ఈ ఏడాది భారత్‌లో జరిగే క్రికెట్ వరల్డ్‌ కప్‌ను వీక్షించేందుకు అల్బనీస్‌, ఆస్ట్రేలియా క్రికెట్‌ అభిమానులను మోదీ ఆహ్వానించారు. అదే సమయంలో వైభవంగా జరిగే దీపావళి వేడుకలను చూడొచ్చని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని