Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Mar 2024 17:08 IST

1.  ‘కాళేశ్వరం’ నిర్మాణాలపై 4 నెలల్లో నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాలపై ఏర్పాటు చేసిన కమిటీ 4 నెలల్లో రిపోర్టు ఇవ్వనుంది. వీటిపై అధ్యయనానికి డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఇటీవల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పవన్‌ కల్యాణ్‌ను కలిసిన చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే

చిత్తూరు వైకాపా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదివారం హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. చిత్తూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా ఇటీవల విజయానందరెడ్డిని వైకాపా అధిష్ఠానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్‌తో సమావేశమై చర్చించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. పరిచయం లేని మహిళను అలా పిలవడం లైంగిక వేధింపే: కలకత్తా హైకోర్టు

పరిచయం లేని మహిళను ‘డార్లింగ్’ అని పిలవడం లైంగిక వేధింపేనని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) స్పష్టం చేసింది. అలా పిలిచిన వ్యక్తులను 354ఏ, 509 సెక్షన్ల కింద నేరస్థులుగా పరిగణించవచ్చని తెలిపింది. ఈ మేరకు పోర్టు బ్లెయిర్‌లోని హైకోర్టు బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జై సేన్‌గుప్తా తీర్పు వెలువరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. వరుసగా రెండోసారి

పాకిస్థాన్‌ (Pakistan) ప్రధాన మంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ (Shehbaz Sharif) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)ల తరఫున అభ్యర్థిగా ఉన్న షెహబాజ్‌.. జాతీయ అసెంబ్లీలో ఆదివారం నిర్వహించిన ఓటింగ్‌లో మొత్తం 336 ఓట్లకుగానూ 201 ఓట్లు సాధించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బాధ్యతలు చేపట్టిన 3 వారాల్లోనే.. తిరుపతి ఎస్పీ బదిలీ

తిరుపతి ఎస్పీ మలికా గార్గ్‌ బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు నమ్మొద్దు: మంత్రి కోమటిరెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నల్గొండ జిల్లాలో తొలుత 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో ఆయన పర్యటించారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతో పాటు గృహజ్యోతి లబ్ధిదారులతో మాట్లాడారు. బైక్‌పై తిరుగుతూ అభివృద్ధి పనులను పరిశీలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దేశంలో డ్రగ్స్‌ ప్రధాన సమస్యగా మారింది: సందీప్‌ శాండిల్య

దేశంలో డ్రగ్స్‌ ప్రధాన సమస్యగా మారిందని టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య అన్నారు. హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో మాదకద్రవ్యాల నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒంటరితనం అనుభవించేవారు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని సూచించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’ రికార్డు.. వాచ్‌ టైం ఎంతంటే!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమా ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). సినీ రంగంలోనే కాదు, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఫిబ్రవరి 16న  ‘జీ5’ వేదికగా ఓటీటీలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్‌మెన్‌ గోపిరెడ్డి (30) మృతి చెందాడు. బాపట్ల మండలం ఈతేరు- చుందూరుపల్లి రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. బాపట్లలోని ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి 2018లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం మాచర్ల ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తాము లేకపోతే గెలవడం కష్టమనే వారికి ఇదొక హెచ్చరిక: సునీల్ గావస్కర్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను (IND vs ENG) భారత్ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఎక్కువగా యువకులతో కూడిన టీమ్‌ఇండియా బలమైన ఇంగ్లిష్‌ జట్టును సునాయాసంగా ఓడించడం విశేషం. సీనియర్లు విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా, రహానె, కేఎల్ రాహుల్ (తొలి టెస్టు మినహా) లేనప్పటికీ భారత్ గెలిచింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని