Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 18 Apr 2024 16:59 IST

1.పెద్ద కోటల్లో ఉండే జగన్‌.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల

వైఎస్ఆర్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైకాపా.. ఆ హామీని మరిచిందని విమర్శించారు. ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తామన్నారని.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. లెదర్ పార్కు హామీని సైతం మరిచారని ఆరోపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్‌

సీఎం జగన్‌పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపర్చారు. సీఎంపై రాయి విసిరింది అతనేనని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. ‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్‌ చౌహాన్

అంతరిక్షం కూడా యుద్ధాలకు వేదికగా మారిందని తాను విశ్వసిస్తున్నట్లు భారత త్రివిధ దళాల అధిపతి (CDS) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. గగనతల, సముద్ర, భూ భాగాలపై దీని ప్రభావం తప్పక ఉంటుందన్నారు. దిల్లీలో మూడు రోజుల పాటు జరగనున్న ఇండియన్‌ డిఫెన్స్‌ స్పేస్‌ సింపోజియమ్‌-24 కార్యక్రమంలో వీడియో ద్వారా ప్రసంగం చేసిన ఆయన.. ‘అంతరిక్ష దౌత్యం’ అనేది త్వరలోనే వాస్తవరూపం దాలుస్తుందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. షర్మిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. బెయిల్‌ కోసం.. కేజ్రీవాల్‌ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi excise scam case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు. అయితే, ఆరోగ్య కారణాలు చూపించి ఈ కేసులో బెయిల్‌ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) తాజాగా ఆరోపించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రామేశ్వరం కెఫే కేసులో నిందితులను పట్టించిన తప్పుడు ఐడీ..!

కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తే.. గుర్తింపు కార్డుల ఆధారంగా పట్టుకోవడం చాలా తేలిక. అదే సెకెండ్‌ హ్యాండ్‌.. థర్డ్‌ హ్యాండ్‌ ఫోన్లు అయితే గుర్తించడం కష్టం.. ఇక వాడేసిన సిమ్‌లు వినియోగిస్తే గుర్తించేదెవరు..? ఇది రామేశ్వరం కెఫే కేసు (Rameshwaram cafe blast case)లో ఉగ్రవాదుల ఐడియా. కానీ, చివరికి వారు సమర్పించిన తప్పుడు ఐడీనే పోలీసులకు బలమైన క్లూను ఇచ్చింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. రూ.27 అధిక వసూలు.. ఉబర్‌ ఇండియాకు రూ.28,000 జరిమానా

 ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ ఇండియాకు ఇటీవల ‘జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌- చండీగఢ్‌’ రూ.28,000 జరిమానా విధించింది. ఓ ప్రయాణికుడి నుంచి క్యాబ్‌ డ్రైవర్‌ రూ.27 అదనంగా తీసుకోవడమే దీనికి కారణం. అదనంగా తీసుకున్న రూ.27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్‌గార్గ్‌కు రూ.5,000 పరిహారం, రూ.3,000 ఖర్చుల కింద చెల్లించాలని ఉబర్‌ ఇండియాను కమిషన్‌ ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. టీ-సాట్‌ ప్రత్యేక తరగతులు

తెలంగాణలో డీఎస్సీ (TS DSC 2024) పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ పరీక్షలపై అవగాహన కల్పించేలా టీ-సాట్‌ నెట్‌వర్క్‌ ప్రత్యేకంగా లైవ్‌ తరగతులు నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 18 నుంచి 9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు నిపుణ ఛానల్‌లో వివిధ సబ్జెక్టులపై అవగాహన తరగతులు కొనసాగుతాయని టీ-శాట్‌ సీఈవో బి.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఏపీ, తెలంగాణకు సాగర్‌ నీటి విడుదలపై కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 12న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా బోర్డు ఉత్తర్వులు ఇచ్చింది. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు

చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు