Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 24 Feb 2024 09:03 IST

1. ఇంటింటికీ నోటీసులు

ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. పన్ను బకాయిదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆమేరకు 19లక్షల నోటీసులను ముద్రించి ఇంటింటికీ అందజేయాలని కేంద్ర కార్యాలయం టెండరు ప్రక్రియను చేపట్టింది. పౌరులు ప్రస్తుతం చెల్లిస్తోన్న ఆస్తిపన్ను విలువను, నిర్మాణాన్ని పరిశీలించడంపై రెవెన్యూ విభాగం దృష్టిపెట్టింది. పూర్తి కథనం

2. ఇల్లు చల్లచల్లగా...

వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు.. భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లచల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. పూర్తి కథనం

3. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ముగిసినట్లే!

దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ ఇంటి నుంచి పని (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) విధానానికి స్వస్తి పలకాలని చూస్తున్నాయి. ‘ఇంటి నుంచి పని’ వల్ల ఉత్పాదకత ఏమీ తగ్గలేదని కొవిడ్‌ సమయంలో పేర్కొన్న కంపెనీలే, ఇప్పుడు మాత్రం కంపెనీకి వచ్చి, బృందంగా పనిచేస్తేనే వినూత్నత, ఉత్పాదకత పెరుగుతాయని అంటున్నాయి. అసలే నియామకాలు తగ్గడంతో పాటు విదేశాల్లో భారీ సంఖ్యలో లేఆఫ్‌లు అమలవుతున్న తరుణంలో, ఇక్కడి ఉద్యోగులు కంపెనీల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. పూర్తి కథనం

4. స్మార్ట్‌వాచీలతో ఒత్తిడి మాయం

జేబులో సెల్‌ఫోన్‌లాగే.. చేతికి స్మార్ట్‌వాచీ ఈ కాలం కుర్రకారుకి కామన్‌ అవుతోంది. ఈ గ్యాడ్జెట్లు.. మనం ఎంత దూరం నడిచాం? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందీ..? ఒంట్లో ఎన్ని కేలరీలు కరిగాయో.. చెప్పడమేకాదు.. ఒత్తిడినీ దూరం చేస్తాయంటోంది ఓ తాజా అధ్యయనం. ఎలాగంటే.. స్మార్ట్‌వాచీలు, రిస్ట్‌బ్యాండ్‌లు ధరించేవాళ్లలో మానసిక ఒత్తిడి తాలూకు లక్షణాలు కనిపించగానే అవి యూజర్లను అప్రమత్తం చేస్తాయి. పూర్తి కథనం

5. బూడిద తింటున్నాం.. తాగుతున్నాం.. చనిపోతున్నాం

బూడిద తింటూ, తాగుతూ వివిధ రకాల వ్యాధుల బారినపడి చనిపోతున్న వారి కుటుంబ సభ్యులకు ఎన్టీటీపీఎస్‌ యాజమాన్యం ఏం సమాధానం చెబుతుందని ‘కాలుష్య నియంత్రణ పోరాట సమితి’ సభ్యులు ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం ఎ.కాలనీలోని ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లోని ఓ కార్యక్రమానికి శుక్రవారం వచ్చిన ఎన్టీటీపీఎస్‌ ముఖ్య ఇంజినీర్‌ నవీన్‌గౌతమ్‌ను కాలుష్య నియంత్రణ పోరాట సమితి సభ్యులు కలిసి నిలదీశారు. పూర్తి కథనం

6. ప్రతి దానికీ పైసల లెక్కనే!

ఠాణా పెద్దగా బాధ్యతలు నిర్వహించిన ఓ పోలీసు ఉన్నతాధికారిపై తీసుకున్న చర్య ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. ఉమ్మడి జిల్లా పరిధిలో పని చేసిన ఈయనపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు.. ఆయన వ్యవహార శైలిపై వచ్చిన ఫిర్యాదులతోపాటు నిఘా వర్గాల సమాచారంతో విచారణ చేపట్టి ఇటీవల చర్యలు తీసుకున్నారు. పూర్తి కథనం

7. ఇంటర్‌ బోర్డు వింతలు ఇన్నిన్ని కాదయా!

జగన్‌ ప్రభుత్వంలో వైకాపా నాయకులతోపాటు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నచ్చిన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనే చందంగా మాట వినని కళాశాల యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడానికి యత్నించారు. తమ మాట వినకపోతే పరిస్థితులు ఈవిధంగానే ఉంటాయని మిగిలిన కళాశాలలకు తెలిసేలా దివ్యాంగులను సైతం దూర కేంద్రాలకు తరలించారు. పూర్తి కథనం

8. మీ వల్ల మా పరువు పోయింది!

కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఘటనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోకుండా తమనే యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.  ‘మీ వల్ల మా పరువు పోయింది. అందరితో మాట పడాల్సి వస్తోంది. ధర్నాలు, రాస్తారోకోలు అంటూ రోడ్డెక్కుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారని వారంతా వాపోయారు. పూర్తి కథనం

9. వీరు అడ్డుకోరు.. వారు ఆపరు

నిబంధనలు పట్టించుకోరు... మార్గదర్శకాలు అమలు చేయరు.... ఆదేశాలు ఖాతరు చేయరు... ఇదీ ఇసుకాసురుల దృక్పథం. అక్రమార్జనే ధ్యేయంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కృష్ణానదిలో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న విధంగా అధికారం ఉన్నప్పుడే అక్రమార్జన చేసుకోవాలన్న ధ్యేయంతో అడ్డగోలుగా సహజ వనరులను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. పూర్తి కథనం

10. ఈసారి వివేకాను చంపిందెవరో చెప్పి జగన్‌ ఓట్లు అడగాలి: దస్తగిరి వ్యాఖ్యలు

చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్‌గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసి పాపం మూటకట్టుకోదలచుకోలేదని పేర్కొన్నారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని