ఇల్లు చల్లచల్లగా...

వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు.. భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లచల్లగా ఉండేలా చూసుకోవచ్చు.

Published : 24 Feb 2024 01:39 IST

వేసవి నుంచి ఉపశమనానికి ఎన్నో మార్గాలు

ఈనాడు, హైదరాబాద్‌ : వేసవిలో బయట నుంచి ఇంటికి వస్తే హాయిగా చల్లగా ఉండాలి.. రాత్రిపూట ఉక్కపోత లేకుండా ప్రశాంతంగా నిద్రపట్టాలి.. ఏసీ వేసుకుంటే సరిపోతుంది అంటారా? నిజమే కానీ అందరి ఇళ్లలో ఆ సౌకర్యం ఉండదు.. భరించే స్థోమత చాలామందికి లేదు. ఇలాంటి వారు తక్కువ ఖర్చుతో వేసవిలో ఇంటిని చల్లచల్లగా ఉండేలా చూసుకోవచ్చు. అందుకు మార్కెట్లో రకరకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. మీకు అనువైనది, మీ బడ్జెట్‌లో దొరికేదాన్ని ఎంచుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇంటిని కూల్‌రూఫ్‌గా మార్చేందుకు ఇదే సరైన సమయం.  

కూల్‌ పెయింట్‌తో..

నగరంలో అత్యధిక శాతం ఇళ్లు కాంక్రీట్‌ స్లాబ్‌లే. ఇవి కాకుండా సిమెంట్‌, ఇతర రేకుల ఇళ్లు ఉన్నాయి. ఈ తరహా పైకప్పులు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీంతో ఆయా ఇళ్ల లోపల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీనికి పరిష్కారంగా పైకప్పులపై తెల్లని పెయింట్‌ను వేసుకోవడం ద్వారా చాలావరకు ఉపశమనం కల్గుతుంది. ఇంటిపై పడిన సూర్యకిరణాలు తెలుగు రంగు కారణంగా పరావర్తనం చెంది వాతావరణంలో కలిసిపోతాయి. తద్వారా ఇంట్లోకి వచ్చే వేడి తగ్గుతుంది.

 • ఇందుకోసం పైకప్పుపై సున్నం మొదలు మార్కెట్లో దొరికే కూల్‌ రూఫ్‌ పెయింట్స్‌ వరకు వినియోగించవచ్చు. బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.
 • ఇవి థర్మల్‌ ఇన్సులేటింగ్‌ రూఫ్‌ కోటింగ్‌ల మాదిరి పనిచేసి ఇంట్లో వేడిని తగ్గించి... సౌకర్యంగా ఉండేలా చేస్తాయి.
 • భవనంపైన 20 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇంటి లోపల 2.1 నుంచి 4.3 డిగ్రీల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
 • ముందుగా స్లాబ్‌ను శుభ్రం చేసి పెయింట్‌ వేసుకోవాలి. వాటర్‌ ఫ్రూపింగ్‌ చేయించుకుంటే మరీ మంచిది.
 • గతంలో అయితే వర్షం పడితే చాలా పెయింట్స్‌ పోయేవి. ఇప్పుడు ఒకసారి వేస్తే కొన్ని సంవత్సరాలు మన్నికగా ఉంటున్నాయి. మార్కెట్లో వాతావరణానికి హాని చేయని హరిత ఉత్పత్తులు లభిస్తున్నాయి. వీటిని ఎంచుకోవచ్చు.

షీట్స్‌  వచ్చాయ్‌...  

నగరంలోని బస్తీల్లో రేకుల ఇళ్లలో ఎక్కువ మంది జీవిస్తుంటారు. వీరు తక్కువ ఖర్చుతో పైకప్పుపై ప్లాస్టిక్‌ షీట్స్‌ను పరిస్తే చాలు. గాలులకు ఎగిరిపోకుండా చూసుకోవాలి.

 • జీహెచ్‌ఎంసీ, ఆస్కి ప్రయోగాత్మకంగా బంజారాహిల్స్‌లోని దేవరకొండ బస్తీలో కొన్ని ఇళ్లపై ప్లాస్టిక్‌ షీట్స్‌ను పరిచి వేడి తగ్గించడం ద్వారా బస్తీవాసుల్లో అవగాహన కల్పించాయి. ఆరేడు డిగ్రీల వరకు లోపల వేడి తగ్గినట్లు గుర్తించారు.
 • బయట ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న వినైల్‌ కటౌట్లను జీహెచ్‌ఎంసీ తొలగిస్తుంటుంది. వీటిని సైతం ఆయా ఇళ్లపై పర్చుకోవచ్చు.
 • స్లాబ్‌లపైన పీవీసీ మెంబ్రెన్‌ రూఫ్స్‌నూ ఇటీవల వినియోగిస్తున్నారు. షీట్స్‌ మాదిరి ఉండే వీటిని పైకప్పుపై పరుస్తారు. ఫలితంగా సూర్యుడి నుంచి వచ్చే వేడి పూర్తిగా స్లాబ్‌ గ్రహించకుండా చేస్తాయి. ఇంటి లోపల చల్లగా ఉంటుంది.

సౌరపలకలతో...

ఇంటిపై సౌర విద్యుత్తు పలకల ఏర్పాటుతో అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.

 • మూడు కిలోవాట్లకు సబ్సిడీ పోను రూ.1.10 లక్షలు ఖర్చువుతుంది. నెలకు 360 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. ఇంటికి అవసరమైన విద్యుత్తును వాడుకుని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయవచ్చు. డిస్కం నుంచి యూనిట్‌కు రూ.5 లపైన తిరిగి పొందవచ్చు.
 • ఐదు కిలోవాట్ల ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే వేసవిలో ఏసీ ఖర్చులనూ రాబట్టుకోవచ్చు.

రూఫ్‌గార్డెన్‌తో...

 • ఇంటిపైన కుండీల్లో మొక్కలను పెంచడం ద్వారానూ వేసవిలో చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.
 • రకరకాల పూలు, అలంకరణ మొక్కలను పెంచుకోవచ్చు. అంతకంటే ముందు లీకేజీలు లేకుండా వాటర్‌ఫ్రూపింగ్‌ చేయిస్తే మంచిది.
 • పూల కుండీలను నేరుగా స్లాబుపై కాకుండా ఎత్తైన ఫ్లాట్‌ఫామ్స్‌ నిర్మించుకుని వాటిపై పెంచుకుంటే లీకేజీల బెడద ఉండదు.
 • ఇంటి చుట్టూ కూడా మొక్కలు, నీడ నిచ్చే చెట్లు ఉంటే చల్లగా ఉంటుంది. అందుకోసం ఇంటి బయట, లోపల పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

విద్యుత్తు బిల్లులు ఆదా...

 • ఇంట్లో కూలర్‌, ఏసీ వాడుతున్నప్పటికీ కూల్‌ రూఫ్స్‌తో కరెంట్‌ బిల్లును తగ్గించుకోవచ్చు. 15 నుంచి 20 శాతం బిల్లు ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 • ఏసీ ఉన్నప్పటికీ చాలామంది ఇళ్లలో పడక గదికే పరిమితం. ఇల్లు మొత్తం చల్లగా ఉండాలంటే కూల్‌రూఫ్‌తోనే సాధ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు