Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 19 Mar 2023 21:03 IST

1. Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రతినిధులమంటూ ఐక్యరాజ్య సమితిలో కొందరు చేసిన ప్రసంగం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాము కైలాస దేశానికి చెందిన వ్యక్తులమని.. అమెరికాతోపాటు అనేక నగరాలతో పలు ఒప్పందాలు చేసుకున్నామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ ప్రకటనలపై అంతర్జాతీయంగా విమర్శలు రావడంతోపాటు ‘కైలాస’ పేరుతో ఓ దేశం కూడా ఉందా..? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. Akhilesh Yadav: కాంగ్రెస్‌ పనైపోయింది.. భాజపాకు అదే పరిస్థితి తప్పదు..!

విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేపిస్తూ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం  అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మరోసారి ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు జరిగినట్లుగానే భాజపా కూడా రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇక కులగణనను ప్రస్తావించిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంమన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. TS Millet man: ‘తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌’ పీవీ సతీశ్‌ ఇక లేరు

హైదరాబాద్‌: డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(DDS) వ్యవస్థాపకులు,  అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’(Millet man)గా పిలుచుకునే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత మూడు వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. పాత పంటల పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు కృషిచేసి చిరుధాన్యాల సూరీడుగా సతీశ్‌ మంచి గుర్తింపు పొందారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. Pawan Kalyan: అధికారం తలకెక్కిన వైకాపా నేతలకు పట్టభద్రులు కనువిప్పు కలిగించారు: పవన్‌

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తేటతెల్లం చేశాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకు మార్గదర్శకులు పట్టభద్రులు అన్న పవన్‌.. ఈ ఫలితాలు వైకాపా ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. Akhil Akkineni: నాకు లవ్‌ అంటే అదే.. పెళ్లి రూమర్స్‌పై అఖిల్‌ క్లారిటీ

ప్రతన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై యువ హీరో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) స్పందించారు. ఓ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ.. అవన్నీ రూమర్స్‌ అని, తాను ఇప్పుడు పెళ్లి చేసుకోవడంలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి సింగిల్‌ అని చెప్పారు. ‘మీ ఉద్దేశంలో లవ్‌ అంటే ఏంటి?’ అనే ప్రశ్న ఎదురవగా ‘స్పోర్ట్స్‌’ అని అఖిల్‌ సమాధానమిచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. IND vs AUS: అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది: రోహిత్ శర్మ

విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs AUS) భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో (ODI Series) 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్‌లో తడబాటుకు గురైన టీమ్ఇండియా (Team India).. బౌలింగ్‌లోనూ ఆసీస్‌ బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమైంది. మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్ మాట్లాడారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. Adani Group: అదానీ గ్రూప్‌ కీలక నిర్ణయం..ముంద్రా పెట్రోకెమ్‌ ప్రాజెక్టు పనులు నిలిపివేత!

హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్‌ (Adani Group)ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రంగాల్లో కొత్త ప్రాజెక్టులేమీ చేపట్టబోమని ప్రకటించిన ఈ గ్రూప్‌.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌లోని ముంద్రాలో చేపట్టిన రూ.34,900 కోట్ల విలువ చేసే పెట్రో కెమికల్‌ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. Imran Khan: ఇమ్రాన్‌పై ఉగ్రవాదం కేసు.. పార్టీపై నిషేధానికి పావులు?

ఓ అవినీతి కేసులో విచారణకుగానూ పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇస్లామాబాద్‌కు చేరుకున్న వేళ.. కోర్టు ప్రాంగణం వెలుపల ఆయన మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్(PTI) పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 25 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు పది మందికిపైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు(Terrorism Case) నమోదు చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. Sajjala: ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోంది: సజ్జల

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని వైకాపా అభిప్రాయపడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని, ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోందని సజ్జల అన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా వైకాపా తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. Kishanreddy: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణలో మార్పు తెస్తాం: కిషన్‌రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విజన్‌తో తయారీ సంస్థలను నెలకొల్పుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 5ఎఫ్‌ విజన్‌తో తెలంగాణలో టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు కానుందన్నారు. ఈ పథకం కింద రూ.4,445 కోట్లు కేటాయించారని చెప్పారు. ఒక్కో టెక్స్‌టైల్‌ పార్కుకు కనీసం వెయ్యి ఎకరాల స్థలం అవసరమవుతుందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్టు భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని