Akhilesh Yadav: కాంగ్రెస్‌ పనైపోయింది.. భాజపా పరిస్థితి అదే..!

కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న భారతీయ జనతా పార్టీ (BJP)కి  కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) అన్నారు.

Updated : 19 Mar 2023 20:20 IST

కోల్‌కతా: విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం  అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) మరోసారి ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్‌కు జరిగినట్లుగానే భాజపా కూడా రాజకీయంగా తుడిచిపెట్టుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఇక కులగణనను ప్రస్తావించిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంమన్నారు.

‘గతంలో కాంగ్రెస్‌ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసేంది. ప్రస్తుతం భాజపా కూడా అదేపని చేస్తోంది. కాంగ్రెస్‌ పని అయిపోయింది. భాజపాకూ అదే గతి పడుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా కుల గణన చేపట్టాలి. ఎంతో మంది నాయకులు ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. యూపీఏ-2 హయాంలో కులగణన చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, చివరకు వెన్నుపోటు పొడిచింది. కాంగ్రెస్‌ మాదిరిగానే భాజపా కూడా వాటిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని కోల్‌కతాలో జరిగిన విలేకరుల సమావేశంలో అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

ఇక ఎన్నికలకు ముందు విపక్ష కూటమి కోసం ప్రతిపాదించిన ఫార్ములా ఏంటని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. దాన్ని ఇప్పుడే బహిర్గతం చేయమని అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కేవలం భాజపాను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు విపక్షాల ఐక్యతపై జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తోన్న సమయంలో భాజపాతో పాటు కాంగ్రెస్‌కూ తాము దూరంగా ఉంటామని అఖిలేశ్‌ ఇటీవలే స్పష్టం చేశారు. తృణమూల్‌ నేత మమతా బెనర్జీతో చర్చలు జరిపిన ఆయన.. భాజాపాను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. రానున్న కొద్ది రోజుల్లో ప్రతిపక్ష కూటమి ఒక రూపు సంతరించుకోనుందన్న అఖిలేశ్‌.. 2024 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషించనున్నాయని ఇటీవల అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని