Sajjala: ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోంది: సజ్జల

పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated : 19 Mar 2023 20:19 IST


అమరావతి: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని వైకాపా అభిప్రాయపడుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారుల తీరుపైనా అనుమానాలు ఉన్నాయని, ఒక్కోసారి వైకాపా అధికారంలో ఉందా? లేదా? అన్న ఆలోచన వస్తోందని సజ్జల అన్నారు.  ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా వైకాపా తన హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. 

అర్జెంట్‌గా అధికారం చేపట్టాలన్న తీరులో చంద్రబాబు ఉన్నారని.. ఆయనకు కలలు మాత్రమే మిగులుతాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ వైరస్‌ లాంటిదని, వ్యవస్థలో ఎక్కడైనా మేనేజ్‌ చేసే అవకాశం ఉంటుందన్న అనుమానంతో ఫిర్యాదు చేశామన్నారు. గతంలో ఏబీ వెంకటేశ్వరరావు తెదేపా ప్రభుత్వానికి ఒక సేనాధిపతిలా వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుకు సాంకేతికంగా తెదేపాకు బలం ఉందని, అయితే ఆ పార్టీ నుంచి కొందరు బయటకు వచ్చారని తెలిపారు. ఆ పార్టీ ఏదైనా ప్రలోభాలకు పాల్పడే అవకాశాలున్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని