Imran Khan: ఇమ్రాన్‌పై ఉగ్రవాదం కేసు.. పార్టీపై నిషేధానికి పావులు?

ఇస్లామాబాద్‌ కోర్టు ప్రాంగణం వెలుపల విధ్వంసానికి కారణమైనందుకుగానూ పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పార్టీ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆయన పార్టీ ‘పీటీఐ’పై నిషేధం విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు పాక్‌ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.

Updated : 19 Mar 2023 19:10 IST

ఇస్లామాబాద్‌: ఓ అవినీతి కేసులో విచారణకుగానూ పాకిస్థాన్‌(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) ఇస్లామాబాద్‌కు చేరుకున్న వేళ.. కోర్టు ప్రాంగణం వెలుపల ఆయన మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్(PTI) పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 25 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో.. జ్యుడిషియల్ కాంప్లెక్స్ వెలుపల విధ్వంసం, భద్రతా సిబ్బందిపై దాడి, అలజడి సృష్టించడం వంటి చర్యలకు కారణమైనందుకుగానూ ఇమ్రాన్‌తోపాటు పది మందికిపైగా పీటీఐ నేతలపై పోలీసులు ఉగ్రవాద కేసు(Terrorism Case) నమోదు చేశారు. తోషఖానా కేసులో విచారణకుగానూ ఇమ్రాన్‌ శనివారం లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్‌(Islamabad)కు వచ్చిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నడుమ కేసు విచారణ మార్చి 30కి వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్‌ శనివారం ఇస్లామాబాద్‌కు బయల్దేరగా.. అటు వేల సంఖ్యలో పోలీసులు లాహోర్‌లోని ఆయన నివాసంలోకి ప్రవేశించారు. పదుల సంఖ్యలో ఇమ్రాన్‌ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఆయుధాలు, పెట్రోల్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్ పార్టీ ‘పీటీఐ’ను నిషేధిత సంస్థగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించేందుకుగానూ న్యాయ నిపుణులను సంప్రదించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు పాక్ మంత్రి రాణా సనావుల్లా తెలిపారు. స్థానిక వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘జమాన్‌ పార్కులో ఉగ్రవాదులు దాక్కున్నారు. ఇమ్రాన్ నివాసంలో ఆయుధాలు, పెట్రోల్ బాంబులు మొదలైనవి పట్టుబడ్డాయి. ఉగ్రవాద సంస్థగా ‘పీటీఐ’పై కేసు నమోదు చేయడానికి ఇవే సాక్ష్యాలు’ అని సనావుల్లా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని