Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం..

Published : 28 Jun 2022 16:55 IST

1. ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు

థియేటర్లలో విడుదలైన సినిమాలు కొన్ని రోజుల్లోనే ఓటీటీలోకి రావడంపై నిర్మాత బన్నీ వాసు (Bunny Vas) కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సినిమాలు 50 రోజుల వరకూ ఓటీటీకి ఇవ్వొద్దని నిర్మాతలు యోచిస్తున్నారని తెలిపారు. సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడం వల్ల థియేటర్‌ వ్యవస్థకే కాకుండా పెద్ద హీరోలకు తీరని నష్టమని పేర్కొన్నారు. దాంతో హీరోల క్రేజ్‌ కూడా తగ్గే అవకాశం ఉందన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు

2. తెలంగాణలో ఈనెల 30న పదో తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఈనెల 30న విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. 

3. తెలంగాణ టెట్‌ ఫలితాల విడుదలకు తేదీ ఖరారు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. టెట్‌ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తొలుత విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ నెల 27వ తేదీన టెట్‌ ఫలితాలు వెల్లడికావాల్సి ఉంది. దీనిపై ఆదివారం రాత్రివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.

4. శిందే గూటికి 14 మంది శివసేన ఎంపీలు..?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు శివసేనపై తిరుగుబావుటా ఎగురవేయడంతో పార్టీ చీలిక దిశగా సాగుతుండగా.. తాజాగా 14 మంది ఎంపీలు కూడా రెబల్స్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘హ్యాపీ బర్త్‌డే’లో హీరో నేనంటే నేనంటూ రచ్చ..!

5. త్వరలో ముంబయికి వెళతాను: ఏక్‌నాథ్‌ శిందే

త్వరలో ముంబయికి వెళతామని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల నేత ఏక్‌నాథ్‌ శిందే వెల్లడించారు. ఆయన గువహాటిలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తాను, తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ముంబయికి వెళతామని పేర్కొన్నారు. ‘‘మేము శివసేనతోనే ఉన్నాము. మా విధానం స్పష్టంగా ఉంది. మేము త్వరలోనే ముంబయి వెళుతున్నాం’’ అని శిందే పేర్కొన్నారు.

6. బాలినేని ఆవేదన ఎంతో బాధ కలిగించింది: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. బాలినేని ఆవేదన చాలా బాధ కలిగించిందని, ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు ఎవరూ ప్రవర్తించకూడదన్నారు.

7. విధుల్లో నిర్లక్ష్యం.. 38 మంది జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ల జీతాల్లో కోత

జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులపై కమిషనర్ లోకేశ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్‌ పరిధిలో నాలాల దగ్గర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన వారిపై చర్యలు తీసుకున్నారు. నగరంలో ప్రమాదకరమైన నాలాలను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పదేపదే ఆదేశించినా స్పందించకపోవడంతో ఇంజినీర్లపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు.

భాజపా నేతలపై కర్రలతో వైకాపా వర్గీయుల దాడి.. ధర్మవరంలో ఉద్రిక్తత

8. అరేబియా సముద్రంపై ఓఎన్‌జీసీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్‌, ఇద్దరు పైలట్లతో వెళ్తోన్న హెలికాప్టర్‌ ఒకటి ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఉన్న ఫ్లోటర్ల సాయంతో దిగినట్లు తెలిపింది. హెలికాప్టర్‌లో ఉన్న 9 మందిని కాపాడినట్లు ఓఎన్‌జీసీ తెలిపింది. అయితే హెలికాప్టర్‌ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్‌ అవ్వాల్సి వచ్చిందన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు. 

9. మహ్మద్‌ జుబైర్‌ అరెస్టును ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌

ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ (Fact check) వెబ్‌సైట్‌ ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబైర్‌ (Muhammad Zubair) అరెస్టును ఎడిటర్స్‌ గిల్డ్‌ (Editors Guild) ఖండించింది. ప్రజల్లో విభజన తెచ్చేందుకు తప్పుడు సమాచారాన్ని సాధనంగా వాడుకునే వారికి అడ్డుకట్ట వేస్తోన్న ఇటువంటి వారిని హెచ్చరించేలా తాజా పరిణామం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. 

10.ఉక్రెయిన్‌ నగరాలపై రష్యా మళ్లీ క్షిపణుల వర్షం!

ఉక్రెయిన్‌పై దాడుల్ని రష్యా మరింత తీవ్రతరం చేస్తోంది. తాజాగా మరోసారి క్షిపణుల వర్షం కురిపిస్తోంది. రాజధాని కీవ్‌ను ఆక్రమించేందుకు యుద్ధం తొలినాళ్లలో యత్నించి ఆ తర్వాత వెనక్కి తగ్గిన రష్యా ఇప్పుడు మళ్లీ రాజధాని సహా పలు నగరాలపై క్షిపణుల్ని గురిపెట్టి సామాన్యుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. ఆదివారం తెల్లవారు జామున కీవ్‌పై 14 క్షిపణుల్ని ప్రయోగించిన పుతిన్‌ సేనలు.. సోమవారం కూడా పోల్తోవా ప్రాంతంలోని క్రెమెన్‌చుక్‌ నగరంలో రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌పై విరుచుకుపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని