Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 24 Feb 2024 17:01 IST

1. తెలుగుదేశం-జనసేన తొలి జాబితాలో 99 మంది విద్యావంతులే

తెలుగుదేశం-జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని 99 మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు కావడం విశేషం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు ఐఏఎస్ కాగా, ముగ్గురు ఎంబీబీఎస్‌ చదివిన వైద్యులు, ఇద్దరు పీహెచ్‌డీ చేసిన డాక్టరేట్లు ఉన్నారు. మిగిలిన 93 మంది అభ్యర్థుల్లో 30 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు  ఉన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ప్రమాద ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే ప్రమాద ఘటనతో ప్రముఖుల ప్రయాణాలపై చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. వీఐపీల డ్రైవర్లందరికీ ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మేడారం జాతరకు 1.35 కోట్ల మంది భక్తులు: మంత్రి సీతక్క

మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది భక్తులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని చెప్పారు. శనివారం మేడారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పొత్తు ఖరారైన రోజే వైకాపా కాడి వదిలేసింది: చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్‌ కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandra babu) అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయమని చెప్పారు. తమ పొత్తు కుదిరిన రోజే వైకాపా కాడి వదిలేసిందన్నారు. భాజపా కలిసొస్తే తగిన సమయంలో  నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసరాలు.. ముఠా అరెస్టు

బ్రాండెడ్‌ పేరిట నకిలీ నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. నలుగురిని ఈస్ట్‌ జోన్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెడ్‌లేబుల్‌, బ్రూక్‌బాండ్‌ టీ పౌడర్‌, లైజాల్‌, హార్పిక్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, ఎవరెస్ట్‌ మసాలా, పారాచూట్‌ హెయిర్‌ ఆయిల్‌ పేరుతో నకిలీవి తయారు చేస్తున్నట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్‌ తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒకే సిరీస్‌లో 600+ పరుగులు.. యశస్వి మరో రికార్డ్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ (IND vs ENG Test Match)లో వరుస డబుల్‌ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) మరో అరుదైన రికార్డ్‌ సాధించాడు. ఒకే సిరీస్‌లో 600లకు పైగా పరుగులతో అదరగొట్టి ఈ ఘనతను అందుకున్న ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ

గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ (Gmail) సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్‌ (google) స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొత్త నేర చట్టాలు.. జులై 1 నుంచి అమల్లోకి

బ్రిటిష్‌ వలస పాలన నాటి నేర న్యాయవ్యవస్థను ప్రక్షాళించేలా రూపొందించిన మూడు నేర చట్టాలు (Criminal Laws) ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య ఖరారైన సీట్ల సర్దుబాటు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ అంశంపై కాంగ్రెస్‌ (Congress), ఆప్‌ (APP)ల మధ్య చర్చలు పూర్తయ్యాయి. దిల్లీ, గుజరాత్‌, గోవా, హరియాణాలోని లోక్‌సభ స్థానాలపై సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తుపై శనివారం విలేకరుల సమావేశంలో ఇరుపార్టీలు క్లారిటీ ఇచ్చాయి. దిల్లీ, హరియాణా, గుజరాత్‌లో కలిసి పోటీ చేస్తుండగా.. గోవా, పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగనున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జనరల్ ర్యాంకింగ్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి (టీఆర్‌ఈఐ-ఆర్‌బీ) ఉద్యోగ నియామకాల్లో రీలింకిష్‌మెంట్‌ విధానం పాటించి.. అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి ‘ఎక్స్‌’ వేదికగా లేఖ రాశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని