Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 16 Jul 2023 09:01 IST

1. భారాసలో ఆశావహుల దూకుడు

శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారాసలో ఆశావహుల దూకుడు పెరుగుతోంది. ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మంది నాయకులున్న నియోజకవర్గాల్లో విభేదాలు అధికమవుతున్నాయి. పోటాపోటీ కార్యక్రమాలతో ఎవరికి వారు సొంతవర్గాలను పెంచుకుంటున్నారు. పరస్పర ఆరోపణలతో రచ్చకెక్కుతున్నారు. ఇలాంటి వారిపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గగన్‌యాన్‌పై పెరిగిన భరోసా!

చంద్రయాన్‌-3 వ్యోమనౌకను దిగ్విజయంగా భూకక్ష్యలో ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ప్రవేశపెట్టడం.. భారత తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ కార్యక్రమానికీ ఊతమిచ్చినట్లయింది. ‘హ్యూమన్‌ రేటెడ్‌’ సామర్థ్యమున్న ఈ వాహకనౌకనే గగన్‌యాన్‌కూ వాడబోతున్నారు. అందువల్ల చంద్రయాన్‌-3 యాత్రలో ఈ రాకెట్‌ అద్భుత పనితీరు.. భరోసా నింపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఏయ్‌ చూడండి.. సైకిల్‌కు ఓటేస్తుందట!’

సైకిల్‌కు ఓటేస్తానని ఓ మహిళ చెప్పిన సమాధానం విని మంత్రి ధర్మాన ప్రసాదరావు అసహనానికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఎల్‌బీఎస్‌ కాలనీలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. గూనపాలేనికి చెందిన వై.ఆదిలక్ష్మికి ధ్రువపత్రం అందిస్తూ ఏ పార్టీకి ఓటేస్తావని అడిగారు. ‘సైకిల్‌కు వేస్తా’ అని ఆమె చెప్పడంతో మంత్రి కంగుతిన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజకీయాల్లోకి అభిషేక్‌ బచ్చన్‌?

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసిన స్థానం నుంచే ఆయన బరిలో దిగనున్నట్లుగా ప్రచారం సాగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి అభిషేక్‌ పోటీ చేయనున్నారనే ప్రచారంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నౌకాదళ రఫేల్‌ జెట్ల కొనుగోలుకు భారత్‌ నిర్ణయం

భారత నౌకాదళం కోసం రఫేల్‌ (మెరైన్‌) యుద్ధవిమానాలను ఎంచుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఏరోస్పేస్‌ దిగ్గజం దసో ఏవియేషన్‌ శనివారం పేర్కొంది. వీటిని భారత్‌లో నిశితంగా పరీక్షించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఆ జెట్‌లు పూర్తిగా భారత నౌకాదళ అవసరాలకు సరిపోతాయని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐటీపై అనిశ్చితి మేఘాలు

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో టీసీఎస్‌ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించితే, మిగిలినవి మోస్తరు గణాంకాలనే వెల్లడించాయి. మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సహా మరిన్ని కంపెనీలు త్వరలో ఫలితాలు వెల్లడించనున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కేటీఆర్‌కు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

అంతర్జాతీయ ఐటీ ఆవిష్కరణల సంస్థ(ఐటీఐఎఫ్‌) సెప్టెంబర్‌ 13న జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ప్రపంచ వాణిజ్య, ఆవిష్కరణల విధానంపై నిర్వహించే వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు ఐటీఐఎఫ్‌ ఉపాధ్యక్షుడు స్టీఫెన్‌ ఎజెల్‌ శనివారం ఆయనకు లేఖ రాశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దక్షిణమధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల రద్దు.. మళ్లింపు

భద్రతా పనుల దృష్ట్యా విజయవాడ డివిజన్‌ పరిధిలో ఈ నెల 16 నుంచి 23 వరకు పలు రైళ్లను రద్దుచేయడంతో పాటు కొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో శనివారం ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. దక్షిణ అట్లాంటాకు 65 కిలోమీటర్ల దూంలోని హాంప్టన్‌ సబ్‌డివిజన్‌ అయిన హెన్రీ కౌంటీలో ఈ ఘటన జరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. బెలారస్‌లోకి వాగ్నర్‌ ముఠా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అధికారాన్ని సవాల్‌ చేస్తూ.. గత నెలలో తిరుగుబాటు చేసిన వాగ్నర్‌ ముఠా శనివారం బెలారస్‌లోకి చేరుకుంది. దాదాపు 60 వాహనాలతో ఆ గ్రూప్‌ సైనికులు బెలారస్‌వైపు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా సైన్యంతో కలిసి పోరాటం చేసిన ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ ముఠా...అనూహ్యంగా గత నెల తిరుగుబాటు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని