ఐటీపై అనిశ్చితి మేఘాలు

ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి.

Updated : 16 Jul 2023 06:54 IST

ప్రస్తుత ఆర్థికంలో వృద్ధి మందకొడిగానే

వాయిదా పడుతున్న వేతన పెంపులు
మొదటి త్రైమాసికంలో మెప్పించిన ఆర్డర్లు

ముంబయి: ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి ఐటీ కంపెనీల్లో ఇప్పటివరకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో ఆర్థిక ఫలితాలను ప్రకటించాయి. ఇందులో టీసీఎస్‌ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించితే, మిగిలినవి మోస్తరు గణాంకాలనే వెల్లడించాయి. మరో దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ సహా మరిన్ని కంపెనీలు త్వరలో ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతా వృద్ధిలో మందగమనం కొనసాగొచ్చని, ఖాతాదారులు తమ ప్రాజెక్టుల వ్యయాలపై ఆచితూచి వ్యవహరించడం లేదా వాయిదా వేయడం కొనసాగొచ్చని ఫలితాల వెల్లడి సందర్భంగా ఐటీ కంపెనీల నిర్వాహకులే ప్రకటించారు. అయితే కంపెనీలు భారీ ఆర్డర్లను జూన్‌ త్రైమాసికంలో పొందడం, అమెరికాలో ద్రవ్యోల్బణం దిగివస్తున్నందున, ఐటీ వ్యయాలను ఖాతాదారులు పెంచుతారనే భావనతో శుక్రవారం ఐటీ షేర్లు బాగా లాభపడ్డాయి. డిజిటలీకరణ ద్వారా ఖర్చులు తగ్గించుకోవడానికి కార్పొరేట్లు చూస్తుండటం వల్లే, మన ఐటీ కంపెనీలకు ఆర్డర్లు వృద్ధి చెందినట్లు అంచనా వేస్తున్నారు.

రూ.1.06 లక్షల కోట్ల ఆర్డర్లు

ఏప్రిల్‌-జూన్‌లో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, విప్రో మొత్తంగా 13 బి.డాలర్ల(దాదాపు రూ.1.06 లక్షల కోట్లు) విలువైన ఆర్డర్లు దక్కించుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇవి 14% అధికం. ఈ కారణంగానే రెండు రోజుల్లో నిఫ్టీ ఐటీ సూచీ 6 శాతానికి పైగా పరుగులు తీసింది. 2020 సెప్టెంబరు తర్వాత ఈ సూచీకి అతిపెద్ద లాభం ఇదే కావడం విశేషం. అంతమాత్రాన ఐటీ కంపెనీల కష్టకాలం పూర్తిగా ముగిసినట్లు కాదని నిపుణులు చెబుతున్నారు.

సవాళ్లు ఇవే

భవిష్యత్‌ అంచనాలపై ఐటీ కంపెనీల యాజమాన్యాలు, బ్రోకరేజీ సంస్థలు సానుకూల వ్యాఖ్యలు ఏమీ చేయలేదు. అయితే సమీపకాలంలో పరిస్థితులు మెరుగుపడొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. గెలుచుకున్న ఆర్డర్లను, ఆదాయంగా మలచడంలో ఆలస్యమవుతోందని తెలిపాయి. మెరుగైన ఆర్డరు పుస్తకం ఉన్నప్పటికీ.. ఆదాయ వృద్ధి గణనీయంగా లేదని టీసీఎస్‌ ఎండీ, సీఈఓ కృతివాసన్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌-జూన్‌లో టీసీఎస్‌ దాదాపు 10 బి.డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. త్రైమాసికానికి 7-9 బి.డాలర్ల అంచనాలతో పోలిస్తే ఇవి అధికమే. ప్రతికూల పరిస్థితుల్లోనూ కంపెనీలు ఈ స్థాయి ఆర్డర్లు గెలుచుకోవడం సానుకూల పరిణామమనే చెప్పుకోవచ్చు.

ద్వితీయార్థంపై ఆందోళన

2023-24 ద్వితీయార్థంలో గిరాకీ పుంజుకోవడంపై టీసీఎస్‌, విప్రో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వలేదు. గిరాకీపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని విప్రో తెలిపింది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మెరుగ్గా ఉంటుందని ఇప్పుడే అంచనాకు రాలేమని టీసీఎస్‌ వెల్లడించింది. ఈ ఏడాది రెండంకెల వృద్ధి సాధించడం కష్టతరమేనని స్పష్టం చేసింది. వృద్ధిపై హెచ్‌సీఎల్‌ టెక్‌ సానుకూలంగా ఉంది. ఏప్రిల్‌-జూన్‌లో ఆదాయ వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నా, 6-8% వార్షిక వృద్ధి అంచనాలను కొనసాగించింది. ఇది అంత సులభం కాదని పలు బ్రోకరేజీ సంస్థలు అంటున్నాయి.

ఉద్యోగులకు ఇబ్బందులే

స్వల్పకాలంలో ఐటీ అనిశ్చితికి సంకేతంగా నూతన నియామకాల్లో క్షీణత కనిపిస్తోంది. మొదటి త్రైమాసికంలో విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగుల సంఖ్య 11,300 తగ్గితే, టీసీఎస్‌ కేవలం 523 మంది ఉద్యోగులనే చేర్చుకుంది. ప్రతికూల పరిస్థితుల వల్ల వేతనాల పెంపును ఒక త్రైమాసికం పాటు వాయిదా వేస్తున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ వెల్లడించింది. ఇన్ఫోసిస్‌ కూడా ఇప్పటివరకు వేతనాల పెంపు చేపట్టలేదని, వాయిదా వేయొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు ఫ్రెషర్ల నియామకాలు తగ్గాయి. ఈ ఏడాది జనవరి- మార్చిలో 4,480 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నియమించుకోగా.. ఏప్రిల్‌- జూన్‌లో ఈ సంఖ్య బాగా తగ్గి 1,597కు పరిమితమైంది. 2023-24లో 40,000 మంది ఫ్రెషర్లను తీసుకుంటామని.. ఈ లక్ష్యంలో కోత పెట్టడం లేదని టీసీఎస్‌ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా ఐటీ కంపెనీలు ఆఫర్‌ లెటర్లు ఇచ్చినా.. ఉద్యోగంలోకి తీసుకోవడానికి ఆలస్యం చేస్తుండడంతో చాలా మంది ఫ్రెషర్లు ఎపుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ఫలితాలతో, ఐటీ కంపెనీలపై ఒక అంచనాకు రావొచ్చని నిపుణులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని