Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Sep 2023 21:08 IST

1. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం

భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. ఆయన  ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ స్వల్ప ప్రమాదానికి గురైంది. మానకొండూరు మండలం లలితాపూర్‌ వద్ద గొర్రెల మందను చూసి ఈటల ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. వాహనం అకస్మాత్తుగా ఆగడంతో వెనుక వస్తున్న ఎస్కార్ట్‌లోని మరో వాహనం ఢీకొట్టింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి..

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, అతని సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి  రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌ వచ్చాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో 3 రోజులు ఆరెంజ్‌ హెచ్చరికలు

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనంతో తెలంగాణలో రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడే అవకాశం ఉందని వెల్లడించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నాగేంద్ర అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపే: చంద్రబాబు

పల్నాడు జిల్లా ధరణి కోటకు చెందిన దండా నాగేంద్ర అరెస్టును తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ పెద్దల దోపిడీపై ఎన్జీటీలో కేసులు వేసినందుకే.. అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనని మండిపడ్డారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అభ్యర్థుల ఎంపికలో అపోహలకు గురి కావొద్దు: ఆశావహులకు రేవంత్‌ విజ్ఞప్తి

ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ) ఎంపిక చేసిన జాబితాను.. సీల్డ్‌ కవర్‌లో స్క్రీనింగ్‌ కమిటీకి అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 3 రోజుల పాటు స్క్రీనింగ్‌ కమిటీ హైదరాబాద్‌లోనే ఉంటుందన్నారు. సోమవారం పీఈసీ సభ్యులతో వేర్వేరుగా స్క్రీనింగ్‌ కమిటీ సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటుందన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. యాదాద్రి ఎంఎంటీస్‌ భూసేకరణకు రాష్ట్రం సహకరించట్లేదు: కిషన్‌ రెడ్డి

కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్‌ కవాడిగూడలోని సీజీవో టవర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య వందే భారత్‌ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నిరాడంబరంగా వంగవీటి రాధా నిశ్చితార్థం

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్‌ మాజీ ఛైర్‌ పర్సన్‌ జక్కం అమ్మానీ, బాబ్జీ దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో రాధా నిశ్చితార్థ వేడుక ఆదివారం నరసాపురంలో జరిగింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వచ్చే ఎన్నికల్లో సింగరేణిలో గులాబీ జెండా ఎగరాలి: కవిత

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో గులాబీ జెండా ఎగరాలని భారాస ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు. ఆ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కోరారు. సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి కేసీఆర్ తప్పించారని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మట్టిలో కప్పిఉంచిన 106 బంగారం బిస్కెట్లు స్వాధీనం

పశ్చిమబెంగాల్‌లో భారీగా బంగారం పట్టుబడింది. భారత్‌ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో సరిహద్దు భద్రతా దళం(BSF), డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అమెరికాలో అరుదైన ‘ఫైర్నాడో’..!

అసలే కార్చిచ్చు.. ఆపై సుడి గాలితో కలిసి భగభగలాడే అగ్నిగోళం వలే ఆ ప్రాంతాన్ని చుట్టేస్తే.. ఇలాంటి దృశ్యమే అమెరికా(USA)లోని లూసియానాలో ఆవిష్కృతమైంది. ఇక్కడ సబినే పారిష్‌ అనే ప్రదేశంలో కార్చిచ్చుతో టోర్నడో కలిసి.. అత్యంత అరుదుగా కనిపించే ఫైర్నాడోగా మారింది. అంతే వేగంగా చుట్టుపక్కల ప్రాంతాలకు కదులుతూ చూపరులను వణికించేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని