Hyderabad: ఇంట్లోకి చొరబడి ప్రేమోన్మాది దాడి.. తమ్ముడి మృతి, అక్కకు తీవ్ర గాయాలు

ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం జరిగింది.  

Updated : 03 Sep 2023 19:48 IST

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. యువతి, ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా, అతని సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి  రామంతపూర్‌కి చెందిన శివకుమార్‌ వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సంఘవి, ఆమె తమ్ముడు చింటూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత చింటూ, శివకుమార్‌ మధ్య వాగ్వాదం జరిగింది.

ఈక్రమంలో శివకుమార్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో సంఘవి, చింటూపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. భవనంలోని మొదటి అంతస్థులో ఘర్షణ జరిగి కిటికీ అద్దాలు పగులగొట్టిన శబ్ధం రావడంతో స్థానికులు చేరుకుని దాడికి పాల్పడిన యువకుడిని ఇంట్లోనే బంధించారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సంఘవి, చింటూలను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చింటూ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఎల్బీనగర్‌ ఆర్టీసీ కాలనీలో కత్తిపోట్లు జరిగిన స్థలాన్ని డీసీపీ సాయిశ్రీ పరిశీలించారు. దాడికి పాల్పడిన నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. కత్తిపోట్లకు గురైన చింటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. బాధితురాలు సంఘవిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు. నిందితుడిని విచారిస్తే ఘటనకు గల కారణాలు తెలుస్తాయన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని