Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Feb 2024 21:00 IST

1. సచివాలయం వద్ద.. ఆ లోటు భర్తీ చేస్తాం: రేవంత్‌రెడ్డి

‘‘ఒక పక్క సచివాలయం.. మరో వైపు అమరవీరుల స్థూపం. ట్యాంక్‌ బండ్‌పై ఎంతోమంది త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఒక లోటు ఉందని గుర్తించా. అదే రాజీవ్‌ గాంధీ విగ్రహం లేకపోవడం’’ అని  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుకు బుధవారం సీఎం శంకుస్థాపన చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాజ్యసభ అవకాశం ఇస్తారని జీవితంలో ఊహించలేదు: అనిల్‌కుమార్‌

కష్టపడే వారికి కాంగ్రెస్‌లో పదవులు దక్కుతాయని చెప్పడానికి తానే నిదర్శనమని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన అనిల్‌కుమార్‌ యాదవ్‌ (AnilKumar Yadav) తెలిపారు. తనలాంటి యువకుడికి అధిష్ఠానం.. పెద్దలసభకు అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ పదవి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితమేనని పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన రెరా మాజీ కార్యదర్శి శివ బాలకృష్ణ వ్యవహారంలో బినామీలను ఏసీబీ అధికారులు విచారించారు. సత్యనారాయణ, భరత్‌ ఇద్దరూ.. ఆయనకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. విలువైన భూములు, స్థలాలు వారి పేరు మీద ఉన్నట్టు భావిస్తున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ ఉద్యోగులకు గురువారం ప్రత్యేక సెలవు..

బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక సీఎల్ మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. బంజారా ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారాస రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర

భారాస నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది. వద్దిరాజు రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభలో ఆ పార్టీకి ఉన్న బలం ప్రకారం ఒక రాజ్యసభ సీటు దక్కనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అన్నాడీఎంకేలో చేరిన సినీనటి గౌతమి

సినీనటి గౌతమి (Gautami) అన్నాడీఎంకే (AIADMK)లో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి (Palaniswami)ని కలిసి పార్టీ కండువా కప్పుకొన్నారు. దాదాపు 25 ఏళ్ల పాటు భాజపా (BJP)లో పనిచేసిన గౌతమి గతేడాది అక్టోబర్‌లో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్‌ రాజకీయం: హరీశ్‌రావు

రేవంత్ రెడ్డికి చేతకాకపోతే వైదొలగి తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్లు చెప్పిన పనులన్నీ చేసి చూపిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వారెన్ని రాజకీయాలు చేసినా, దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణ వరపద్రాయిని అని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బైక్‌పై వచ్చి.. బంగారం దుకాణంలో దోపిడీ

పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీలో భారీ చోరీకి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం చాదర్‌ఘాట్‌ ఠాణా పరిధిలోని అక్బర్‌బాగ్‌లో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యాజమానిపై కత్తి దాడి చేసి బంగారం దోచుకెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అబుధాబీలో హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని నగరం అబుధాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూఏఈకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బోచాసనవాసీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఆలయాన్ని ప్రారంభించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టియర్‌ గ్యాస్‌ డ్రోన్లకు పతంగులతో చెక్‌

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ‘దిల్లీ చలో’ (Farmers Protest) చేపట్టిన రైతులను హరియాణా శివారు ప్రాంతంలో పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై ఉంచిన కాంక్రీటు దిమ్మెలు, బారికేడ్లు, ఇనుప కంచెలను తొలగించేందుకు ప్రయత్నించిన వారిపై భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించాయి. దానికి ప్రతిగా రైతులు రాళ్ల దాడి చేయడంతో శంభు సరిహద్దుల్లోని అంబాలా వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని