లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధికోసమే కాళేశ్వరంపై కాంగ్రెస్‌ రాజకీయం: హరీశ్‌రావు

పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

Updated : 14 Feb 2024 20:53 IST

హైదరాబాద్‌: రేవంత్ రెడ్డికి చేతకాకపోతే వైదొలగి తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే.. వాళ్లు చెప్పిన పనులన్నీ చేసి చూపిస్తానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వారెన్ని రాజకీయాలు చేసినా, దుష్ప్రచారం చేసినా కాళేశ్వరం తెలంగాణ వరపద్రాయిని అని చెప్పారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే.. మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వాస్తవాలు చెబుతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపించాలని అసెంబ్లీలో తానే స్వయంగా కోరానని చెప్పారు. భారాసపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఆపొద్దన్నారు.

‘‘నిండిన కాల్వలు, పొంగిన వాగులు, పండిన పంటలకు నిదర్శనం కాళేశ్వరం. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే అని దుష్ప్రచారం చేస్తున్నారు. నిర్మాణంలో లోపాలు ఉంటే  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయిన ఘటనలున్నాయి. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి తప్పితే.. ఇలాంటి వ్యాఖ్యలు తగదు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ‘మల్లన్న సాగర్’ చూపించాం కదా.. దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?

తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి

కాళేశ్వరం ఆయకట్టు 98 వేల ఎకరాలని అసత్యాలు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు రాని ప్రాంతాలకు ఇప్పుడు నీళ్లు వస్తున్న విషయం ప్రజలకి తెలుసు. ఎగువ మానేరు డ్యామ్‌ మండు వేసవిలో కూడా మత్తడి దూకుతోందంటే దానికి కారణం కాళేశ్వరమే. ఏ విచారణ అయినా చేయండి.. తప్పు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. భూతద్దంలో చూపించి మాపై బురద చల్లేందుకే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 20 లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది’’ అని హరీశ్‌రావు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని