Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Feb 2024 21:11 IST

1. అమ్మవార్ల వన ప్రవేశం వేళ.. మేడారంలో చిరుజల్లులు

నాలుగు రోజులపాటు అట్టహాసంగా సాగిన మేడారం మహాజాతర తుది ఘట్టానికి చేరుకుంది. జనం వీడి సమ్మక్క-సారలమ్మ మళ్లీ వనంలోకి బయల్దేరారు. అమ్మలు వనానికి కదిలే వేళ మేడారంలో చిరుజల్లులు ఆహ్వానం పలికాయి. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు ఆలయాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతుల వివరాలు విదేశీ కంపెనీల చేతుల్లో ఎలా పెట్టారు?: రేవంత్‌రెడ్డి

‘ధరణి’ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వీటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు. ధరణి సమస్యల పరిష్కారం, కమిటీ గుర్తించిన అంశాలపై శనివారం సచివాలయంలో చర్చించారు. మార్చి మొదటి వారంలోగా 2.45 లక్షల పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చేయండి!

బస్సులు సహా అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్ట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ (MoRTH)ను అంతర్జాతీయ రహదారి సమాఖ్య (IRF) కోరింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖకు ఓ లేఖ రాసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హామీల అమలు సాధ్యాసాధ్యాలను తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంది..!: సీఈసీ

రాజకీయ పార్టీలు ఇచ్చే ఎన్నికల హామీల అమలు విషయంలో సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని భారత ప్రధాన ఎన్నికల కమిషర్‌ రాజీవ్‌కుమార్‌ (CEC Rajiv Kumar) పేర్కొన్నారు. అలాగే తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాలు చేసే హక్కు పార్టీలకు ఉందని చెప్పారు. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఈసీ మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లోకల్‌ ట్రైన్‌లో నిర్మలమ్మ... ప్రయాణికులతో సెల్ఫీలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) శనివారం ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. ఆమె ఘట్‌కోపర్ నుంచి కళ్యాణ్ వరకు ట్రైన్‌లో ప్రయాణిస్తూ, అందరితో ముచ్చటించినట్లు ఆమె కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పోస్టు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌గా చిన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం బోర్డు ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి, పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ జి.చిన్నారెడ్డి నియమితులయ్యారు. కేబినెట్‌ మంత్రి హోదాలో చిన్నారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలపూర్‌ గ్రామానికి చెందిన జిల్లెల చిన్నారెడ్డి 1955లో జన్మించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 100 మందితో వచ్చే వారమే భాజపా తొలి జాబితా!

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించకముందే.. లోక్‌సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి విడతగా 100 మందితో జాబితాను (BJP first list) వచ్చేవారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం

దేశవ్యాప్తంగా కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ వేదికగా డిజిటల్ క్లాసులు, సమావేశాలు పెరిగిపోయాయి. ఐటీ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పని చేస్తున్నారు. గేమింగ్‌పైనా యువత మోజు పెంచుకోవడంతో ల్యాప్‌టాప్‌ల విక్రయాలు గత మూడేళ్లలో దాదాపు రెట్టింపయ్యాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మంత్రివర్గంలో గీతక్క లేకపోవడం లోటు: సీఎం రేవంత్‌రెడ్డి

అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ఈశ్వరీబాయి.. ఆరోజుల్లోనే గీతారెడ్డిని డాక్టర్‌ చదవించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ సాంస్కృతికశాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రవీంధ్రభారతిలో జరిగిన ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి భారీగా తెదేపాలోకి చేరికలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున పలువురు తెదేపాలో చేరారు. వారికి పసుపు కండువా కప్పి లోకేశ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంలో ఇప్పటికే పనిచేస్తోన్న నేతలు కొత్త వారితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. మంగళగిరి అభివృద్ధి కోసం తన వెంట నడుస్తున్న నేతలకు అభినందనలు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని