Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 17 Apr 2024 20:59 IST

1. జగన్‌.. గులకరాయి డ్రామాను ప్రజలు నమ్మరు: చంద్రబాబు

గొడ్డలి పోటు, కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్‌.. ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పెడన ‘ప్రజాగళం’సభలో మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని మళ్లీ ఇప్పడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నాపై, పవన్‌పై దాడి జరిగితే రాయి కనిపించింది. కానీ, జగన్‌పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. మద్యం నిషేధిస్తానని.. జగన్‌ సారా వ్యాపారిగా మారారు: పవన్‌

మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ మద్యం ద్వారా రూ.40వేల కోట్లు సంపాదించి.. ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రచారానికి తెర.. లోక్‌సభ ‘తొలి’ పోరుకు సర్వం సిద్ధం!

దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. తొలి దశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారానికి నేటితో తెర పడింది. రాజకీయ పార్టీల ప్రచారంతో మార్మోగిన మైకులు.. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మూగబోయాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న మొదటి విడత పోలింగ్‌ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పీవీ, మన్మోహన్‌లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు..!

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌లపై మోదీ సర్కార్‌ ప్రశంసల జల్లు కురిపించింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో పీవీ నరసింహారావుతో పాటు అప్పట్లో ఆర్థిక మంత్రిగా పని చేసిన మన్మోహన్‌లు కీలక భూమిక పోషించారని కొనియాడింది. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అభిప్రాయం వ్యక్తంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్‌

అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్‌. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్ మరోసారి స్పందించారు. భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు చేపడతామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పీఎఫ్‌లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్‌డ్రా

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించినదే అయినా.. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది. తాజాగా ఇందులో ఈపీఎఫ్‌వో కీలక మార్పు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసుకునే ఆటో క్లెయిమ్‌ పరిమితిని ఈపీఎఫ్‌ఓ రెట్టింపు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. యూపీఐ లావాదేవీలు.. ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యానికి NPCI చెక్‌..!

దేశీయంగా యూపీఐ (UPI) చెల్లింపుల వ్యవస్థలో ఫోన్‌పే, గూగుల్‌ పే ఆధిపత్యం కొనసాగుతోంది. వీటి గుత్తాధిపత్యంపై ఆందోళన వ్యక్తమవుతోన్న ఈక్రమంలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) రంగంలోకి దిగింది. వీటి ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లతో త్వరలో భేటీ కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అలియాభట్‌ అరుదైన ఘనతను దక్కించుకున్నారు. టైమ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘100 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ పీపుల్‌ ఆఫ్‌ 2024’ (ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు) జాబితాలో చోటు దక్కించుకున్నారు. గతేడాది ఈ జాబితాలో సినీ పరిశ్రమ నుంచి రాజమౌళి, షారుక్‌ఖాన్‌లు మాత్రమే చోటుదక్కించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఖైదీలకు స్మార్ట్‌ కార్డులు

జైల్లో ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు స్మార్ట్‌ కార్డులను జారీ చేసింది. ఛత్రపతి శంభాంజీనగర్‌లోని సెంట్రల్‌ జైలులో దాదాపు 650 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లు ఓ జైలు అధికారి పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్‌ సీఈఓ భావోద్వేగ పోస్ట్‌

ఉద్యోగాలు చేస్తున్న దంపతులకు ఎదురయ్యే కష్టం గురించి బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్‌ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్‌ ఓ భావోద్వేగమైన పోస్ట్‌ చేశారు. ‘‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు నా మదిలో మెదిలిన ప్రశ్న ఇది. నేను మంచి తల్లిని కాదా? ఆ సమయంలో చాలా ఏడ్చా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా’’అని సుదీర్ఘ పోస్టు పెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని