Pawan Kalyan: మద్యం నిషేధిస్తానని.. జగన్‌ సారా వ్యాపారిగా మారారు: పవన్‌

మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

Published : 17 Apr 2024 19:01 IST

పెడన: మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ మద్యం ద్వారా రూ.40వేల కోట్లు సంపాదించి.. ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.

‘‘భీమవరం నుంచి మారానని జగన్‌ చాలా బాధపడుతున్నారు. వైకాపా అభ్యర్థులను ఎందుకు మార్చారో జగన్‌ చెప్పాలి. విద్యుత్‌ ఛార్జీలు ఐదేళ్లలో పదిసార్లు పెంచారు. పెడనలో ఏ పని జరగాలన్నా ఇక్కడి  ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలి. మట్టి మాఫియాపై ఫిర్యాదు చేశాడని ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. పట్టాదార్‌ పాస్‌బుక్‌ కావాలంటే రూ.10వేలు అడిగే ఎమ్మెల్యేలు ఉన్నంత కాలం యువతకు ఉపాధి అవకాశాలు రావు. మత్స్యకారుల పొట్టకొట్టే 217 జీవోను వైకాపా ప్రభుత్వం తెచ్చింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని కూడా దారి మళ్లించారు. మున్సిపల్‌ కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధి హామీలో ఎక్కువ అక్రమాలు జరిగింది ఏపీలోనే అని కేంద్ర మంత్రి చెప్పారు. కృష్ణా నదిలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరపడం వల్ల ఈ జిల్లాలో 71 మంది చనిపోయారు. ఓటమి కళ్లకు కనిపిస్తుండటంతో.. జగన్‌లో రోజు రోజుకు ఫ్రస్టేషన్ పెరుగుతోంది. అందుకే భీమవరంలో నాపై విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ప్రకృతి వనరులను దోచేసిన వైకాపా నేతలకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని