TTD: తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. ఆన్‌లైన్‌లో టికెట్లు: తితిదే

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అవకాశం కల్పించింది.

Updated : 16 Aug 2023 18:37 IST

తిరుమల: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆగ‌స్టు 18న ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనున్నట్లు తితిదే వెల్లడించింది. పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25న (శుక్రవారం) వ‌ర‌ల‌క్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించేందుకు తితిదే భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలోని ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

వరలక్ష్మీ వ్రతంలో నేరుగా పాల్గొనాలని కోరుకునే భక్తులకు ఆగస్టు 18న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. ఆగస్టు 24న ఉదయం 9 గంటలకు ఆల‌యం వ‌ద్ద ఉన్న కుంకుమార్చన కౌంటర్‌లో కరెంట్‌ బుకింగ్‌ ద్వారా మరో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000 చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చని తితిదే అధికారులు తెలిపారు.

శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 18న ఉద‌యం 9 గంట‌ల‌కు తితిదే ఆన్‌లైన్‌లో టికెట్లను విడుద‌ల చేయ‌నుంది. వ‌ర్చువ‌ల్ టికెట్లు పొందిన భ‌క్తులకు ఆగ‌స్టు 26వ తేదీ నుంచి 90 రోజుల్లోపు అమ్మవారి దర్శనానికి అనుమ‌తిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా  ఈనెల 25న  అమ్మవారికి అభిషేకం, వ‌స్త్రాలంక‌ర‌ణ సేవ‌, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌ సేవ‌, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను రద్దు చేసినట్లు తితిదే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని