
అమెరికాలో మళ్లీ కొత్త హెచ్ 1బీ నిబంధనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నేడు మరో కొత్త హెచ్ 1బీ విధానానికి తెరతీసింది. ఈ కొత్త విధానం అమెరికన్లకు మరింత మేలు చేస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త వీసా నియమావళి ప్రకారం ఇకపై అమెరికన్ సంస్థల్లో సంవత్సరానికి అత్యధికంగా 85,000 మంది నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులను మాత్రమే నియమించుకొనే వీలు కలుగుతుంది. కొత్త వీసా విధానం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించనప్పటికీ.. ఇది మరింత కఠినంగా ఉండనుందని, దీని వల్ల హెచ్ 1బీ వీసా పరిధిలోకి వచ్చే ‘ప్రత్యేక నైపుణ్యాల’పై కోత పడనుందని తెలుస్తోంది. కొవిడ్-19 ప్రభావం స్థానికులపై పడకుండా నిరోధించేందుకే అమెరికా ఈ కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని కథనాలు వెలువడుతున్నాయి.
హెచ్ 1బీ తదితర వీసాల జారీని ఈ సంవత్సరాంతం వరకు ఆపివేస్తూ గతంలో ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను.. నిలిపివేస్తూ ఆ దేశ న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా కొత్త నిబంధనల ప్రభావం విదేశీ ఉద్యోగులు, సాంకేతిక సంస్థలపై పడనుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రా తదితర ఐటీ సంస్థలు తమ హెచ్ 1బీ వీసాల సంఖ్యను గత మూడేళ్లుగా తగ్గిస్తూ వస్తున్నాయి. కాగా, ఈ కొత్త నిబంధనల వల్ల ఏటా వచ్చే హెచ్ 1బీ వీసా దరఖాస్తుల సంఖ్యలో మూడో వంతు తగ్గవచ్చని డీహెచ్ఎస్ అధికారులు భావిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.