సైనాపై సిద్ధార్థ్‌ అభ్యంతరకర ట్వీట్‌

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ చేసిన ఓ ట్వీట్‌పై సోమవారం తీవ్ర వివాదం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌కు, ఆయనపై

Updated : 11 Jan 2022 05:25 IST

మహిళా కమిషన్‌ ఆగ్రహం

 ట్విటర్‌ ఖాతా బ్లాక్‌, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోరుతూ లేఖలు

దిల్లీ: బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ చేసిన ఓ ట్వీట్‌పై సోమవారం తీవ్ర వివాదం చెలరేగింది. జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌కు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ లేఖలు రాసింది. ఇటీవల ప్రధాని పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రత వైఫల్యం ఘటనను ప్రస్తావిస్తూ సైనా ఈ నెల 5న ట్వీట్‌ చేశారు. ‘‘ఒక దేశ ప్రధానికే భద్రత లేకపోతే, ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. దీన్ని ఈనెల 6న సిద్ధార్థ్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడడానికి కొందరు రక్షకులున్నారు’’ అని వ్యంగ్యం ధ్వనించేలా ట్వీట్‌ చేశారు. సిద్ధార్థ్‌ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మొదలైన విమర్శలు సోమవారం తీవ్రస్థాయికి చేరాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు ట్విటర్‌లో ఎన్‌సీడబ్ల్యూను కోరారు. ఈ వ్యవహారాన్ని ఎన్‌సీడబ్ల్యూ సుమోటోగా స్వీకరించింది.

నా ఉద్దేశం అదికాదు: సిద్ధార్థ్‌

తన ట్వీట్‌ వివాదాస్పదం కావడంతో సిద్ధార్థ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘కాక్‌ అండ్‌ బుల్‌’ అనే పదబంధాన్ని అనుసరించి నేను ఆ పదాన్ని వాడాను. దాన్ని వేరేలాగా అన్వయించుకోవడం సరికాదు. నా వ్యాఖ్యల్లో ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం లేదు’’ అని ట్వీట్‌ చేశారు.

నటుడిగా అతడు ఇష్టమే.. కానీ: సైనా

సిద్ధార్థ్‌ ట్వీట్‌ వ్యవహారంపై సైనా స్పందిస్తూ.. ‘‘సిద్ధార్థ్‌ వ్యాఖ్యల అర్థం ఏంటో నాకు తెలియదు. నటుడిగా నేను అతణ్ని అభిమానిస్తాను. మంచి పదాలతో అతడు భావాలను వెల్లడించాల్సింది’’ అని ఈటీవీ భారత్‌తో పేర్కొన్నారు. ఆమె భర్త కశ్యప్‌ కూడా సిద్ధార్థ్‌ వ్యాఖ్యలను ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని