దేశమే ముందు.. తర్వాతే ఏదైనా

పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ  ఐఏఎస్‌ అధికార్లకు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా తీసుకొనే నిర్ణయాల్లోనూ దేశ ఐక్యత, సమగ్రతకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు.

Published : 22 Apr 2022 06:03 IST

ఐఏఎస్‌ అధికారులకు ప్రధాని దిశానిర్దేశం

ఈనాడు, దిల్లీ: పాలనలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా, దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ  ఐఏఎస్‌ అధికార్లకు దిశానిర్దేశం చేశారు. స్థానికంగా తీసుకొనే నిర్ణయాల్లోనూ దేశ ఐక్యత, సమగ్రతకే పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన సివిల్‌ సర్వీసెస్‌ డేలో మోదీ కీలకోపన్యాసంచేశారు. ఈ సందర్భంగా అధికారులకు మూడు లక్ష్యాలను నిర్దేశించారు. ‘‘మొదటిది సాధారణ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం. రెండోది ఏ పనిచేసినా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం. మూడోది దేశ సమైక్యత, సమగ్రత విషయంలో రాజీపడకుండా ముందుకెళ్లడం’’ అని సూచించారు. దేశంలో సామాన్యుడి జీవితాన్ని సులభతరంగా మార్చేలా అధికారుల పనితీరు ఉండాలని అన్నారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ముఖచిత్రం మారుతున్న పరిస్థితుల్లో మనం ఏ పనిచేసినా దాన్ని ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొనే చేయాలి. ప్రపంచస్థాయిలో జరుగుతున్న కార్యకలాపాలను మనం విస్మరిస్తే మన ప్రాధాన్యాలను నిర్ధారించుకోవడం కష్టమవుతుంది. 2047లో జరిగే 100 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు సాదాసీదాగా జరిగిపోయే అవకాశం ఇవ్వకూడదు. వచ్చే 25 ఏళ్ల కాలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఇప్పటినుంచే స్పష్టమైన దృక్పథంతో పనిచేయాలి’’ అని మోదీ సివిల్‌ సర్వెంట్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాల్లో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన అధికారులకు అవార్డులు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని