2 స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు

స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన మరో రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం తాజాగా కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి మంగళవారం దుబాయ్‌ వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానమొకటి (బోయింగ్‌ 737 మ్యాక్స్‌) పాకిస్థాన్‌

Published : 06 Jul 2022 03:32 IST

కరాచీకి ఓ లోహవిహంగం దారిమళ్లింపు

  ముంబయిలో ప్రాధాన్య ప్రాతిపదికన మరొకటి దించివేత

దిల్లీ, కరాచీ: స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థకు చెందిన మరో రెండు విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం తాజాగా కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి మంగళవారం దుబాయ్‌ వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానమొకటి (బోయింగ్‌ 737 మ్యాక్స్‌) పాకిస్థాన్‌ గగనతలంలో ఉండగా ఇంధన ఇండికేటర్‌ సరిగా పనిచేయలేదు. ఎడమ ట్యాంకులో ఇంధనం అసాధారణ రీతిలో వేగంగా తగ్గిపోతున్నట్లు చూపించింది. వెంటనే విమానాన్ని కరాచీకి దారి మళ్లించారు. అక్కడి విమానాశ్రయంలో పరిశీలించగా.. ట్యాంకు నుంచి ఇంధనం లీకవుతున్న ఆనవాళ్లేవీ కనిపించలేదు. ఘటనా సమయంలో విమానంలో 138 మంది ప్రయాణికులున్నారని, వారంతా సురక్షితమేనని పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) వెల్లడించింది. కరాచీ నుంచి తమ ప్రయాణికులను స్పైస్‌జెట్‌ మరో విమానంలో  దుబాయ్‌కి పంపించింది. మరో ఘటనలో- స్పైస్‌జెట్‌కు చెందిన క్యూ400 విమానం మంగళవారం గుజరాత్‌లోని కాండ్లా నుంచి ముంబయి వెళ్తుండగా.. 23 వేల అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌కు పగులు ఏర్పడింది. దీంతో పైలట్లు ముంబయి విమానాశ్రయంలో దానికి ప్రాధాన్య ప్రాతిపదికన ల్యాండింగ్‌ నిర్వహించారు. ఈ రెండింటితో కలిపితే.. గత 17 రోజుల్లో స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన ఘటనల సంఖ్య ఏడుకు చేరుకోవడం గమనార్హం.

రంధ్రంతోనే 14 గంటలు ప్రయాణించిన విమానం

పెద్ద రంధ్రం పడినా.. ఓ విమానం 14 గంటలు ప్రయాణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎమిరేట్స్‌ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్‌ ఎ380 లోహవిహంగం ఈ నెల 1న దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయలుదేరింది. విమానం టైరు పేలిందన్న అనుమానంతో పైలట్లు బ్రిస్బేన్‌లో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. సురక్షితంగా దాన్ని కిందకు దించిన తర్వాత పరిశీలించగా.. విమానం ఎడమ రెక్క వైపు కింది భాగంలో పెద్ద రంధ్రం కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని