ఉమ్మడి పౌర స్మృతిపై ప్రైవేటు సభ్యుడి బిల్లు

భాజపా కీలక అజెండాల్లో ఒకటైన ఉమ్మడి పౌరస్మృతి అంశం.. ప్రైవేటు సభ్యుడి బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు వచ్చింది.

Published : 10 Dec 2022 05:24 IST

రాజ్యసభలో ప్రవేశపెట్టిన భాజపా ఎంపీ

విపక్షాల నిరసన

దిల్లీ: భాజపా కీలక అజెండాల్లో ఒకటైన ఉమ్మడి పౌరస్మృతి అంశం.. ప్రైవేటు సభ్యుడి బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు వచ్చింది. ఆ పార్టీ ఎంపీ కిరోడి లాల్‌ మీనా శుక్రవారం విపక్షాల నిరసనల మధ్యే దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించి, దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఒక జాతీయ పరిశీలన కమిటీని ఏర్పాటు చేయాలని ఈ బిల్లు సూచిస్తోంది. దీన్ని ప్రవేశపెట్టడానికి మీనా ఉపక్రమించగానే.. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎండీఎంకే, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎన్‌సీపీలు వ్యతిరేకించాయి. దీని వల్ల దేశంలో ఉన్న ‘భిన్నత్వంలో ఏకత్వ’ సూత్రం దెబ్బతింటుందని, లౌకిక భావనలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నాయి. ప్రజాజీవనంతో ముడిపడ్డ ఒక బిల్లును విస్తృత స్థాయిలో సంప్రదింపులు లేకుండా సభలో ఎలా ప్రవేశపెడతారని ప్రశ్నించాయి. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అనవసరం, అవాంఛనీయమని లా కమిషన్‌ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిపాయి. బిల్లును వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్‌ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకున్నారు. ‘‘రాజ్యాంగ ప్రకారం.. ఒక అంశాన్ని లేవనెత్తే హక్కు సభ్యుడికి ఉంది. దీనిపై సభలో చర్చ జరగనివ్వండి. ఈ దశలో ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించడం, బిల్లును విమర్శించడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశంపై రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఓటింగ్‌ నిర్వహించారు. 63 మంది అనుకూలంగా ఓటు వేయగా.. మరో 23 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు.

జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌పై..  

జాతీయ జ్యుడీషియల్‌ కమిషన్‌ ద్వారా దేశంలో జడ్జీల నియామకాన్ని నియంత్రించాలంటూ సీపీఎం సభ్యుడు బికాస్‌ రంజన్‌ రాజ్యసభలో ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సభ్యుడు రాజీవ్‌ చద్దా వ్యతిరేకించారు. సుప్రీం, హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, జడ్జీల నియామకం కోసం పేర్లను సిఫార్సు చేయడానికి అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించాలని బిల్లు సూచిస్తోంది. న్యాయమూర్తుల బదిలీ ప్రక్రియనూ నియంత్రించాలని పేర్కొంది. న్యాయ ప్రమాణాలను నిర్దేశించాలని, జడ్జీల్లో జావాబుదారితనాన్ని తీసుకురావాలని సూచించింది. న్యాయమూర్తులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, దర్యాప్తు చేయడానికి విశ్వసనీయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయితే జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) అంశం ఇప్పటివరకూ మూడుసార్లు సుప్రీంకోర్టు ముందుకొచ్చిందని రాజీవ్‌ చద్దా తెలిపారు. ప్రతిసారీ సర్వోన్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసిందన్నారు. ప్రస్తుత కొలీజియం వ్యవస్థ బాగానే పనిచేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు జరపడం ద్వారా దాన్ని మెరుగుపరచుకోవచ్చని సూచించారు. జడ్జీల నియామకంలో కేంద్రం జోక్యానికి ఆస్కారం ఉండకూడదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని