Rahul Gandhi: రాహుల్‌కు పెళ్లి చేద్దామా..? సోనియా గాంధీ ఏం చెప్పారంటే?

హరియాణా మహిళలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన పూర్తి వీడియోను రాహుల్ తాజాగా షేర్‌ చేశారు. ఇందులో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి పెళ్లి చేద్దామా? అని ఓ మహిళ సోనియాను అడిగారు. 

Published : 29 Jul 2023 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పెళ్లి ప్రస్తావన మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన హరియాణా మహిళా రైతులు.. సోనియా గాంధీ (Sonia Gandhi)తో మాట్లాడుతూ రాహుల్‌ వివాహం గురించి అడిగారు. మరి దానికి ఆమె ఏం సమాధానం చెప్పారో తెలుసా..?

జులై ఆరంభంలో రాహుల్‌గాంధీ హరియాణాలో పర్యటించిన సమయంలో.. సోనీపత్‌ జిల్లా మదీనా గ్రామ మహిళా రైతులు దిల్లీకి రావాలని ఉందని చెప్పారు. దాంతో ఆయన వారిని సోనియా నివాసానికి ఆహ్వానించగా.. ఇటీవల ఆ మహిళలంతా దిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్‌ తాజాగా షేర్‌ చేశారు. హరియాణా నుంచి వచ్చిన ఆ మహిళలు ముందుగా దిల్లీలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసానికి చేరుకున్నారు.

మోదీ, రాహుల్‌కు బార్బీ మేకోవర్‌.. అంతా AI మాయ!

వీరిని గాంధీ కుటుంబం సాదరంగా ఆహ్వానించింది. వారికి ప్రత్యేక ఆతిథ్యం ఏర్పాటు చేయడమే గాక.. సోనియా, ప్రియాంక (Priyanka Gandhi), రాహుల్‌ గాంధీ కూడా మహిళలతో కలిసి భోజనం చేశారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ సోనియా గాంధీ చెవిలో.. ‘రాహుల్‌కు పెళ్లి చేద్దామా?’ అని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ.. ‘మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి’ అని అనడంతో రాహుల్‌ నవ్వుతూ ‘అవుతుంది.. అవుతుంది’ అని చెప్పారు.

సోనియా భావోద్వేగం..

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణం గురించి మహిళలు సోనియాను అడగ్గా ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అమ్మ చాలా కుంగుబాటుకు లోనయ్యారని, కొన్ని రోజుల పాటు అన్నం, నీళ్లు ముట్టలేదని ప్రియాంక చెబుతుండగా సోనియా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత తేరుకుని మహిళలతో సరదగా ముచ్చటించారు. అనంతరం మహిళా రైతులతో కలిసి సోనియా, ప్రియాంక నృత్యం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని