Published : 24 Apr 2021 10:37 IST

బైడెన్‌.. భారత్‌కు సాయం చేయండి!

అమెరికా అధ్యక్షుడిపై పెరుగుతున్న ఒత్తిడి

వాషింగ్టన్‌: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పాలకవర్గంపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. భారత్‌కు వీలైనంత త్వరగా సాయం అందజేయాలని శ్వేతసౌధానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ సహా ఇతర కొవిడ్‌ టీకాలు, అవసరమైన వైద్య సామగ్రి పంపాలని యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, పలువురు కీలక చట్టసభ ప్రతినిధులు, ప్రముఖ భారతీయ అమెరికన్లు బైడెన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

అమెరికాలో ఇప్పటికే భారీ స్థాయిలో టీకాలను నిల్వ చేసినట్లు యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు మేరన్‌ తెలిపారు. వీటిని ఇప్పటికిప్పుడు అమెరికాలో వినియోగించే పరిస్థితి లేదని వెల్లడించారు. అమెరికాలో ప్రతిఒక్కరికీ టీకా ఇచ్చేందుకు జూన్‌ వరకు ఆగాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు అవసరమైన టీకాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం అమెరికా టీకా తయారీ సంస్థలకు ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిల్వ ఉన్న టీకాలను భారత్‌, బ్రెజిల్‌ వంటి కరోనాతో అల్లాడుతున్న దేశాలకు పంపాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సరఫరా గొలుసుల్ని ఆయా దేశాలు వీలైనంత సులభతరం చేయాలని భారత విదేశాంగ మంత్రి కోరారు. అలాగే క్లిష్ట సమయంలో యావత్‌ ప్రపంచానికి అండగా ఉన్న భారత్‌కు అంతర్జాతీయ సహకారం కావాలని కోరారు. ఈ నేపథ్యంలోనే యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ స్పందించింది.

భారత్‌కు అవసరమైన వస్తువులు పంపడానికి, సరఫరా గొలుసులో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి అమెరికా కృషి చేస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి జాలినా పోర్టర్‌ తెలిపారు. ఈ మేరకు నిరంతరం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. భారత్‌లో కరోనా విజృంభణ ప్రపంచ సమస్య అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇప్పటికే యూఎస్‌ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ భారత్‌ విదేశాంగ మంత్రి జయశంకర్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. చట్టసభ ప్రతినిధి రషీదా తాలిబ్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా విజృంభణ ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరిక లాంటిదని తెలిపారు. మహమ్మారి వ్యాప్తి ఇంకా తొలగిపోలేదని గుర్తించాలన్నారు. వివిధ ఔషధాలు, టీకాల తయారీపై ఉన్న పేటెంట్‌ హక్కుల్ని సవరించి ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు బైడెన్ సహకరించాలని కోరారు. 

భారత్‌లో పరిస్థితిపై అమెరికాలోని ప్రముఖ పత్రిక వాషింగ్టన్‌ పోస్ట్‌ సంపాదకీయం ప్రచురించింది. భారత్‌ ఈ పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. మహమ్మారి సంక్షోభ పరిస్థితుల్లో సమయం, దూరం పరిగణనలోకి తీసుకోవద్దని.. ప్రపంచంలోని ప్రతి ప్రదేశం సమీపంలో ఉన్నట్లే భావించాలని వ్యాఖ్యానించింది. పరోక్షంగా భారత్‌కు సాయం అందించాలని కోరింది. డెమొక్రాటిక్‌ పార్టీకి ఫండ్‌రైజర్‌గా పనిచేసిన శేఖర్‌ నర్సింహ్మన్‌ మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏదో రకంగా సాయం చేయాలని అధ్యక్షుడు బైడెన్‌ను కోరారు. భారత్‌లో కరోనా వల్ల అమెరికాలో ఉన్న ప్రతి భారతీయ కుటుంబంపై ఏదో రకంగా ప్రభావం పడుతోందని గుర్తుచేశారు. వెంటనే ప్రధాని మోదీతో మాట్లాడి.. వీలైతే 10 మిలియన్‌ ఆస్ట్రాజెనెకా డోసుల్ని భారత్‌కు పంపే ఏర్పాట్లు చేయాలని బైడెన్‌కు విజ్ఞప్తి చేశారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని