Parliament: సోనియాజీ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది..? ప్రధాని మోదీ వాకబు

మణిపుర్‌ అంశంపై లోక్‌సభలో చర్చించాలని ప్రధాని మోదీకి సోనియా (Sonia Gandhi) విజ్ఞప్తి చేసినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి వెల్లడించారు.

Published : 20 Jul 2023 14:25 IST

దిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు (Parliament Session) మొదలైన రోజే.. ఉభయసభలు అట్టుడికి పోయాయి. అన్ని వ్యవహారాలను పక్కనబెట్టి మణిపుర్‌ అంశంపైనే (Manipur Violence) చర్చించాలని ఉభయ సభల్లోని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రెండు సభలూ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడ్డాయి. అయితే, సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీని ప్రధాని మోదీ (Narendra Modi) పలుకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణిపుర్‌ అంశంపై చర్చించాలని మోదీకి సోనియా (Sonia Gandhi) విజ్ఞప్తి చేసినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి వెల్లడించారు. సమావేశాల తొలిరోజు లోక్‌సభ సభ్యులను ప్రధాని మోదీ కలిసిన సందర్భంగా ఈ సంభాషణ జరిగినట్లు ఆయన చెప్పారు.

లోక్‌సభ సమావేశాల తొలిరోజు వివిధ పార్టీల సభ్యులు పలుకరించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు వివిధ పార్టీలకు చెందిన సభ్యులను మోదీ పలుకరించారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల వద్దకు ప్రధాని మోదీ వచ్చారు. కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీని పలుకరించారు. ఇటీవల సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడాన్ని ప్రస్తావించిన మోదీ.. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో.. మణిపుర్‌ అంశంపై చర్చించాలని ప్రధాని మోదీని ఆమె కోరినట్లు కాంగ్రెస్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ ఛౌదురి వెల్లడించారు.

మణిపుర్‌లో నగ్నంగా ఇద్దరు మహిళల ఊరేగింపు

మరోవైపు మణిపుర్‌ (Manipur Video)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రధాని మోదీ.. ఆ దారుణానికి పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదలమని స్పష్టం చేశారు. ఆ ఘటన 140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందన్న ఆయన.. కుమార్తెలకు జరిగిన అన్యాయాన్ని ఎన్నటికీ క్షమించలేమన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు కూడా స్పందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని