Published : 22 May 2022 16:31 IST

Google Chat: గూగుల్‌ చాట్‌లోనూ ‘వార్నింగ్‌ బెల్స్’‌.. యూజర్ల భద్రతకు పెద్దపీట!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ యూజర్ల వ్యక్తిగత భద్రతకు పెద్ద పీట వేస్తోంది. సైబర్‌ దాడులు, హ్యాకర్‌ల నుంచి రక్షణ కల్పించడానికి తన ప్లాట్‌ఫామ్‌ల్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా తన చాట్‌ అప్లికేషన్‌లో మాల్‌వేర్‌ దాడులకు సంబంధించి హెచ్చరిక నోటిఫికేషన్లను ప్రదర్శించనున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. ఈ వార్నింగ్‌ బ్యానర్‌లు ఇప్పటికే జీమెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌ సేవల్లో అందుబాటులో ఉండగా.. గూగుల్‌ చాట్‌లోనూ ఇకపై ప్రదర్శించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఒకటి, రెండు వారాల్లో ఇది అందుబాటులోకి రానుంది.

అచ్చంగా గూగుల్‌ డ్రైవ్‌ మాదిరే..!

ముందుగా గూగుల్‌ డ్రైవ్‌ విషయానికొస్తే ఈ ఫీచర్‌ డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసి ఉంటుంది. యాప్‌లో డేంజర్‌ లేదా అనుమానాస్పద డాక్యుమెంట్‌‌, ఫొటోను ఓపెన్‌ చేయగానే.. గూగుల్‌ వేగంగా స్కాన్‌ చేసి వెంటనే వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ఈ మేరకు స్క్రీన్‌ పైభాగంలో పసుపు హెచ్చరిక బ్యానర్‌ను చూపుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని ఆ బ్యానర్‌పై సందేశం పంపుతుంది. అచ్చంగా గూగుల్‌ చాట్‌లోనూ ఇదే విధంగా ఈ ఫీచర్‌ పనిచేయనుంది. 

అపరిచిత వ్యక్తుల నుంచి సందేశాలు, మాల్‌వేర్ సంబంధిత లింక్‌లు రాగానే సంబంధిత గూగుల్‌ చాట్‌పై.. ‘This invite is suspicious’ అంటూ ఎరుపు రంగు హెచ్చరిక బ్యానర్‌ను చూపుతుంది. ఈ మేరకు సంబంధింత చాట్‌ను మీరు వెంటనే బ్లాక్‌ చేసుకోవచ్చు. తద్వారా యూజర్ల డేటా హ్యాకర్ల బారిన పడకుండా ఉంటుంది. గూగుల్‌ వర్క్‌స్పేస్‌, వ్యక్తిగత గూగుల్‌ ఖాతాలు కలిగిన వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. కాగా, గూగుల్‌ హ్యాంగవుట్స్‌ (Hangouts)ను నిలిపివేసిన తర్వాత వాటి సేవలను గూగుల్‌ చాట్‌లో భర్తీ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు డెవలపర్‌ కాన్ఫరెన్స్‌-2022 సందర్భంగా కంపెనీ తన ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు చెందిన రెండవ బీటాను కూడా విడుదల చేసింది. ఇది గోప్యత, భద్రతకు సంబంధించిన అప్‌డేట్లతో పాటు కొత్త ఫీచర్లు అందిస్తుంది. ఆండ్రాయిడ్‌ 13లో నోటిఫికేషన్లు పంపే ముందు యాప్‌లు తప్పనిసరిగా యూజర్లు అనుమతి పొందాలి.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts