Ira Khan-Nupur: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆమిర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా

బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు నుపుర్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.   

Updated : 04 Jan 2024 06:35 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan)- సినీ నిర్మాత రీనా దత్తల (Reena Dutta) కుమార్తె ఐరా ఖాన్‌ (Ira Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడు, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖరేను (Nupur Shikhare) ఆమె వివాహమాడారు. ముంబయిలోని ఓ హోటల్‌ ఈ వివాహ వేడుకకు వేదికైంది. రిజిస్టర్‌ మ్యారేజీతో ఐరా-నుపుర్‌ జంట ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆమిర్‌ఖాన్‌, తన మాజీ భార్యలు రీనా దత్త, కిరణ్‌ రావు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ - నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. వివాహం అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్‌ జరిగింది. ఐరా - నుపుర్‌ వివాహనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఆమిర్‌ ఖాన్‌- రీనా దత్త కూతురుగా ఐరా ఖాన్‌ సినీ ప్రియులకు సుపరిచితమే. ‘మెంటల్‌ హెల్త్‌ సపోర్ట్‌ ఆర్గనైజేషన్‌’ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన ఐరా.. తరచూ మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. గత కొన్నేళ్లుగా ఆమిర్‌ ఖాన్‌కు నుపుర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నారు. దీంతో ఐరా సైతం నుపుర్‌ వద్ద ఫిట్‌నెస్‌ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

ఇక ఐరాతో వివాహనికి ముందు నుపుర్‌ తన నివాసం నుంచి జాగింగ్‌ చేస్తూ హోటల్‌కు చేరుకున్నారు. జాగింగ్‌ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నారు. ఇక ఈ నెల 8న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. జనవరి 13న ముంబయిలో వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని