Nani: విజయ్‌ దేవరకొండ, రష్మిక ఫొటో వివాదం.. స్పందించిన నాని

‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఓ ఘటనపై నాని (nani) స్పందించారు.  

Updated : 03 Dec 2023 13:12 IST

హైదరాబాద్‌: ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక (Rashmika) ఫొటోలు ప్రదర్శించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈవెంట్‌ నిర్వాహకులతోపాటు చిత్రబృందాన్నీ నెటిజన్లు తప్పుబట్టారు. ఈ వివాదంపై నటుడు నాని (Hi Nanna) తాజాగా స్పందించారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన ఆయా విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

అది దురదృష్టకరం..!

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు విజయ్‌ దేవరకొండ, నటి రష్మికకు సంబంధించిన ఫొటోలను స్క్రీన్‌పై వేయడం నిజంగానే దురదృష్టకరం. ఆ ఫొటో చూసి మేము కూడా షాకయ్యాం. అలాంటి ఈవెంట్స్‌ కోసం ఎంతోమంది వర్క్ చేస్తుంటారు. ఇక (విజయ్‌ దేవరకొండ, రష్మికను ఉద్దేశించి) మేమంతా స్నేహితులమే. సినిమా ప్రమోషన్స్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని వాళ్లకు కూడా తెలుసు. ఆ చర్య వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే నాతోపాటు ‘హాయ్‌ నాన్న’ టీమ్‌ నుంచి క్షమాపణలు చెబుతున్నాం.

హీరోయిన్‌ రాకపోవడం.. యూఎస్‌ టూర్‌..!

మృణాల్‌ ఠాకూర్‌ ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటున్నారనడంలో వాస్తవం లేదు. ప్రమోషన్స్‌, వరుస షూట్స్‌తో ఆమె ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొన్నిరోజులు ప్రమోషన్స్‌కు దూరంగా ఉన్నారు. ఇకపై ప్రతి ఈవెంట్‌లో ఆమె పాల్గొంటారు. నా గత చిత్రాలను యూఎస్‌ ఆడియన్స్‌ బాగా ఆదరించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పి.. సర్‌ప్రైజ్‌ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నా. ఈ క్రమంలోనే ‘హాయ్‌ నాన్న’ను అక్కడ ప్రమోట్‌ చేస్తున్నా.

ఆ సినిమాలు అందుకే వదులుకున్నా..!

ప్రస్తుతం కెరీర్‌ పరంగా నేను నా సినిమాలపైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నా. భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటున్నా. వేరే హీరోల చిత్రాల్లో నటించే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు. ఈ క్రమంలోనే పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు కూడా వదులుకున్నా. అలాగే, రీమేక్స్‌లో నటించడం నాకు పెద్దగా నచ్చదు. ఇప్పటివరకూ రెండు రీమేక్‌ చిత్రాల్లో నటించా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తున్నారు.

ఇది రీమేక్‌ కాదు..!

‘హాయ్‌ నాన్న’ అనేది రీమేక్‌ కాదు. ఇదొక ఒరిజినల్‌ కథ. ఫ్యామిలీ ఆడియన్స్‌ తప్పకుండా ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారు. నేను ఓటీటీలోకి అడుగుపెట్టాలనుకుంటే ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ వంటి ప్రాజెక్ట్‌తో రావాలనుకుంటున్నా. అలాగే, ‘యానిమల్‌’ లాంటి స్టోరీ నా వద్దకు వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా’’ అని నాని చెప్పారు.

పాట పాడి.. డ్యాన్స్‌ చేసిన నాని

‘హాయ్‌ నాన్న’ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘కమ్మని ఈ ప్రేమలేఖనే.. ’ పాటను నాని పాడి అలరించారు. మృణాల్‌ ఠాకూర్‌తో కలిసి ‘ఓడియమ్మా’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని