Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ

ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్‌ సెట్‌ అవుతాయన్నారు.

Updated : 13 Mar 2024 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యవసాయ కుటుంబంలో పుట్టి.. అమ్మానాన్నలకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో చదువును మధ్యలోనే ఆపి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శివాజీ (Sivaji). ఎడిటర్‌, యాంకర్‌, నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టి అనతికాలంలోనే హీరోగా మారారు. అనుకోనివిధంగా దాదాపు పదేళ్లు యాక్టింగ్‌కు దూరంగా ఉన్న ఆయన ఇటీవల ‘#90’s మిడిల్‌క్లాస్‌ బయోపిక్‌’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లు చేస్తోన్న శివాజీ తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘మాయదారి మైసమ్మో మైసమ్మా’.. (ఎంట్రీ సాంగ్‌ను ఉద్దేశించి) ఎన్ని రోజులు షూట్‌ చేశారు?

శివాజీ: ‘కాలేజ్‌’లో పాట ఇది. ఒక్క రోజులోనే షూట్‌ చేశాం. ఇప్పుడు ఎలా అయితే పబ్బుల్లో ‘జై బాలయ్య’ అనే స్లోగన్‌ వినిపిస్తుందో 2001-05 మధ్యలో ఎక్కడ చూసినా మా పాటే వినిపించేది. తెలంగాణలో ఇప్పటికీ బోనాల సమయంలో దీనిని ప్లే చేస్తుంటారు.

ఇప్పటివరకూ ఎన్ని సినిమాల్లో నటించావు?

శివాజీ: హీరోగా దాదాపు 70, సహాయనటుడిగా 26 చిత్రాలు చేశా. ఈ ఏడాదితో వంద సినిమాలవుతాయి.

చెప్పుల్లేకుండా స్కూల్‌కు వెళ్లిన శివాజీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏ స్థాయిలో ఉన్నాడు?

శివాజీ: అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితి ఎంతో మారింది. ఇప్పుడు నేను మంచి స్థాయిలో ఉన్నా. ఎనిమిదో తరగతి వరకూ నాకు చెప్పుల్లేవు. తొమ్మిదో తరగతి కోసం నరసరావుపేట వెళ్లాల్సిన సమయంలో ఏడ్చి చెప్పులు కొనిపించుకున్నా.

చిరంజీవి నీకు డబ్బులిచ్చారా?

శివాజీ: ‘మాస్టర్‌’ నా తొలి సినిమా. దానికంటే ముందు కొన్ని రోజులు యాంకరింగ్‌ చేశా. ‘మాస్టర్‌’ షూట్‌ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను నేను ఎప్పటికీ మర్చిపోను. అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూట్‌ జరుగుతున్నప్పుడు ఖరీదైన కారు నా ముందు ఆగింది. అందులోనుంచి చిరంజీవి దిగారు. నన్ను చూసి.. ‘‘హాయ్‌ శివాజీ.. నీ తెలుగు చాలా చక్కగా ఉంటుంది. నీ ప్రోగ్రామ్‌ నేను ఫాలో అవుతుంటా’’ అని చెప్పారు. ఆయన నాతో మాట్లాడిన మొదటి మాటలవే. నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి.. నన్ను పలకరించడంతో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. శ్రీశైలంలో సాంగ్‌ షూట్‌ పూర్తి చేసుకుని వస్తున్నప్పుడు ఆర్థికంగా నేను ఇబ్బందిపడుతున్నానని వేణుమాధవ్‌ తెలుసుకున్నాడు. ఇంటి అద్దె చెల్లించడానికి కూడా నా వద్ద డబ్బుల్లేవని చిరంజీవికి చెప్పాడు. వెంటనే ఆయన రూ.10 వేలు ఇచ్చారు. ఆ డబ్బులు దాదాపు ఆరు నెలలు ఉపయోగపడ్డాయి.

యాక్టింగ్‌కు దూరంగా ఉన్న నీకు 90’sలో అవకాశం ఎలా వచ్చింది?

శివాజీ: మళ్లీ యాక్టింగ్‌ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. రెండేళ్ల క్రితం మా రెండో అబ్బాయి రిక్కీ.. ‘‘నాన్నా.. మాకోసం నువ్వు మళ్లీ యాక్టింగ్‌ చేయొచ్చు కదా’’ అని అడిగాడు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురుచూశా. దాదాపు 100 సినిమాలు చేసిన తర్వాత ఆఫర్స్‌ ఇవ్వమని అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. తెలిసిన వాళ్లని అడిగినా ఎలాంటి స్పందన రాలేదు. కరోనా తర్వాత 2021లో రెండు తమిళ చిత్రాలు కొన్నా. తెలుగులో వాటిని చేద్దాం అనుకున్నా. రూ.40 లక్షలు ఖర్చు పెట్టా. మరో వేవ్‌ వస్తుందన్నారు. దాంతో దాన్ని పక్కన పెట్టేశా. అలాంటి సమయంలో ఓసారి ఈటీవీ సీఈవో బాపినీడుగారిని కలిశా. నా పరిస్థితి గురించి వివరించా. అక్కడినుంచి బయలుదేరుతున్న సమయంలో.. ‘‘శివాజీ.. నువ్వు మంచి ఆర్టిస్ట్‌వి. మళ్లీ యాక్ట్‌ చెయ్‌’’ అన్నారు. ‘‘మీరు ఏదైనా చెప్పండి సర్‌. తప్పకుండా చేస్తా. యాక్టింగ్‌ చేయకూడదని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అలా జరిగిపోయింది’’ అన్నా. అలా, 90’s సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా జనవరి 5న విడుదలైన ఈ సిరీస్‌ అంతటా ఘన విజయాన్ని అందుకుంది. ఆ ఒక్క సిరీస్‌కు ఐదు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఐఎండీబీ 9.6 రేటింగ్‌ ఇచ్చింది. ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌ అందుకున్న చిత్రాలక్కూడా 9.2 మాత్రమే ఇచ్చింది ఆ సైట్‌. సిరీస్‌ విడుదలయ్యాక రెండు రాష్ట్రాల సీఎంవోల నుంచి నాకు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నీకు కూతురు ఉందని టాక్‌ ఏంటి?

శివాజీ: నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు అలబామా యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేస్తున్నాడు. చిన్నోడికి కూడా అమెరికాలో పేరు పొందిన బిజినెస్‌ స్కూల్‌లో సీట్‌ వచ్చింది. త్వరలోనే వాడు అక్కడికి వెళ్తాడు. నాకు కూతురు ఉందని గతంలో ప్రచారం ఎందుకు జరిగిందో తెలియదు. నటుడు సమీర్‌ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడంట. ఆయన తెలియక చెప్పి ఉండొచ్చు.

వేణుమాధవ్‌ను బాగా మిస్‌ అవుతున్నాం?

శివాజీ: వేణుమాధవ్ అన్న మరణం విచారకరం. నా పెళ్లి రిసెప్షన్‌లో ఆర్కెస్ట్రా పెట్టాడు. ఆయన అంటే నాకెంతో ఇష్టం. ఇండస్ట్రీలో కాకుండా జీవితంలో నాకు బెస్ట్ ఫ్రెండ్స్‌ అంటే నా అసిస్టెంట్స్‌. గంగాధర్‌, విజయ్‌, చంద్ర. గంగాధర్‌ కొవిడ్‌ సమయంలో చనిపోయాడు. విజయ్‌.. బెట్టింగ్స్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి.

ఆలీ: ఈతరం యువతకు మేము చెప్పేది ఒక్కటే.. మీరు సంపాదించకపోయినా ఫర్వాలేదు కానీ ఇటువంటి పనులు చేసి చనిపోతే మీ తల్లిదండ్రులు నరకం అనుభవిస్తారు. దయచేసి ఇలాంటివి చేయవద్దు.

మీ సొంతూరు ఏమిటి?

శివాజీ: నరసరావుపేట సమీపంలోని గొరిజవోలు అనే గ్రామం మాది. నాన్న వ్యవసాయం చేసేవారు. నాకొక తమ్ముడు. ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. వాడికి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. ‘‘మనం ఆర్టిస్టులం. మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి, డబ్బు ఉన్నప్పుడే సొంతూరులో మనకంటూ భూమి, ఇల్లు ఉండేలా చూసుకో’’ అని అప్పట్లో (ఆలీని ఉద్దేశించి) నువ్వు చెప్పిన మాటలు నేను పాటించా. ఇల్లు కట్టా. 30 ఎకరాల పొలం కొన్నా.

ఊరు నుంచి హైదరాబాద్‌ రావడానికి కారణం ఏమిటి?

శివాజీ: ఆర్థికంగా మాకు ఏమీ లేదని తెలిసేసరికి డిగ్రీ పూర్తి చేశా. మా నాన్న కష్టపడి ఎంఏలో జాయిన్‌ చేశారు. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు అయ్యేసరికి.. మా ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉందని అర్థమైంది. ఏదైనా పనిచేయాలి. వాళ్లకు అండగా నిలవాలనుకున్నా. హైదరాబాద్‌కు వచ్చా.

వివాహం గురించి చెప్పలేదు?

శివాజీ: నా భార్య పేరు శ్వేత. వాళ్ల నాన్న డాక్టర్‌. బంధువుల పెళ్లిలో మొదటిసారి ఆమెను చూశా. వెంటనే వాళ్ల నాన్నను కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పా. కుటుంబసభ్యుల అంగీకారంతో మా పెళ్లి జరిగింది. మాకు వివాహం జరిగి 23 ఏళ్లు అయ్యింది. పెళ్లికి ముందు ఇచ్చిన బహుమతులను ఇప్పటికీ భద్రంగానే దాచుకుంది. చాలా మంచి వ్యక్తి. తాజ్‌మహల్‌, ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఏర్పాటుచేసే తులిప్‌ పూల ప్రదర్శన చూపిస్తానని మాటిచ్చా. కానీ ఇప్పటివరకూ నెరవేర్చలేదు.

చిన్నప్పుడు మీ నాన్న బాగా కొట్టారా?

శివాజీ: చిన్నప్పుడు మా ఇంట్లో ట్రాక్టర్‌ బెల్టులు ఉండేవి. నేను లెక్కలు సరిగ్గా రాయకపోతే ఆ బెల్టులతో నాన్న కొట్టేవారు. ఆయన ఉద్దేశం నేను చదవాలనే. ఇప్పటికీ ఆయన నా కల్లోకి వస్తుంటారు. నా పెళ్లి రోజు ఆయన నన్ను పట్టుకుని బాగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎందుకు ఏడ్చారో అప్పుడు అర్థం కాలేదు. నాకంటూ ఒక కుటుంబం వస్తోంది నేను వేరవుతున్నానని భావోద్వేగానికి గురయ్యారనిపిస్తుంది.

కారుతోనే ఊర్లోకి అడుగుపెడతానని శపథం చేశారంట? 

శివాజీ: ఉట్టి చేతులతో తిరిగి ఊర్లోకి రాకూడదని హైదరాబాద్‌ బయలుదేరే ముందు అనుకున్నా. ఎంత కష్టమైనా సరే కారు కొనుక్కుని తిరిగి వస్తానని నాన్నకు చెప్పా. రేయింబవళ్లు పనిచేశా. మారుతి 800 కొని మూడేళ్ల తర్వాత ఊరు వెళ్లా. అప్పటివరకూ నేను ఏం చేస్తున్నానో ఎక్కడ ఉన్నానో ఎవరికీ తెలియదు.

నువ్వు డబ్బింగ్‌ కూడా చెప్పావా?

శివాజీ: నితిన్‌, ఉదయ్‌ కిరణ్‌, తారకరత్న, ప్రభుదేవా, దుల్కర్‌ సల్మాన్‌కు చెప్పా. షారుక్‌ ఖాన్‌కు డబ్బింగ్‌ చెప్పమని అడిగారు. నా వాయిస్‌ ఆయనకు బాగోదని, అందుకే చెప్పలేనని చెప్పా. నితిన్‌ ‘దిల్‌’ చిత్రానికి డబ్బింగ్‌లో నంది అవార్డు వచ్చింది.

నిన్ను ఎవరూ గుర్తుపట్టకూడదని మీసాలు తీసేసి తిరిగావా?

శివాజీ: అలాంటిదేమీ లేదు. చాలా సినిమాల కోసం మీసాలు తీసేవాడిని. ఒక విషయంలో గొడవ జరిగితే టీవీ ఛానెల్‌ వాళ్లు నాపై కేసు పెట్టారు. కోర్టుకు వెళ్లాం. తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఈలోపు కొంతమంది అత్యుత్సాహం కనబరిచి నాపై ఎల్‌వోసీ ఓపెన్‌ చేశారు. మా అబ్బాయికి అమెరికాలో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లాల్సింది. మనపై ఎల్‌వోసీ ఉంటే కస్టమ్స్‌లో తెలిసిపోతుంది. అలా, కస్టమ్స్‌ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. టీవీ వాళ్లకూ విషయం తెలిసింది. ‘‘వేషం మార్చి దుబాయ్‌లో దొరికిపోయిన శివాజీ’’ అని స్క్రోలింగ్‌ వేశారు. అప్పుడు వాళ్లు కనిపించి ఉంటే తప్పకుండా కొట్టేవాడిని ఇప్పుడు ఆ ఆవేశం లేదు. విచారణ అనంతరం హైకోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఏ కేసుకు ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నించింది. నాపై ఉన్న ఎల్‌వోసీ ఎత్తివేశారు.

96 సినిమాలు చేసిన శివాజీ ఉన్నట్టుండి స్క్రీన్‌కు ఎందుకు దూరమయ్యారు?

శివాజీ: ఇండస్ట్రీకి దూరమవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘బూచమ్మ బూచోడు’ నా లాస్ట్‌ మూవీ. విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నన్ను బాగా డిస్టర్బ్‌ చేసింది. రాజకీయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టా. సినిమాలకు కాస్త దూరమయ్యా. పాలిటిక్స్‌ గురించి మాట్లాడటం మొదలుపెట్టాక సినిమాలు మానేసి రాజకీయ రంగంలోకి వెళ్తానని ఇండస్ట్రీ కూడా భావించింది. 90’s రిలీజ్‌ అయ్యాక సినిమా అవకాశాలు వస్తున్నాయి.

శివాజీ ఆ పార్టీ వ్యక్తి.. ఈ పార్టీ వ్యక్తి అని చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. అధికారంలో ఉండే పార్టీకి నేను ప్రతిపక్షంగా ఉంటా. ప్రజల తరఫున మాట్లాడుతుంటా. నిజం చెప్పాలంటే.. మనం రాజకీయాలకు పనికిరాం. ఎందుకంటే, ఇప్పుడున్న రోజుల్లో పాలిటిక్స్‌ ఒక బిజినెస్‌లా మారింది. ఏదైనా పార్టీలో సీటు కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. గెలిచిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రజల నుంచి పొందాలని చూస్తుంటారు. నా దృష్టిలో.. ఎన్‌.టి.రామారావులా అందరి వల్ల కాదు. సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ముందుకు అడుగువేశారు కాబట్టే ఆయన రాణించగలిగారు. ఇప్పటి రోజుల్లో మనలాంటి వాళ్లు అడుగుపెడితే ఉన్నది మొత్తం పోగా.. తిరిగి సంపాదించుకోవడం చేతకాక.. ఏమీ చేయలేని వాళ్లలా మిగులుతాం. ఆ ఉద్దేశంతోనే ఏ రాజకీయ పార్టీ జోలికీ వెళ్లలేదు.

నిర్మాతగా డబ్బు పోగొట్టుకున్నారని టాక్‌ ఉంది నిజమేనా?

శివాజీ: రూ.25 లక్షలు పోయాయి. నాకు అప్పు అంటే భయం. అందుకే నాకు సంబంధించిన ఒక స్థలం అమ్మేశా. దానివల్ల రూ.ఐదారు కోట్లు దెబ్బపడింది.

90’s సిరీస్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌ అనుకోవచ్చా?

శివాజీ: తప్పకుండా. ఇప్పుడు నేను వరుసగా సినిమాలు చేస్తున్నా. వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాజ్‌ తరుణ్‌ చిత్రంలో విలన్‌గా కనిపించనున్నా.

శివాజీ: ఎన్నికల్లో నువ్వు నిలబడుతున్నావా?

ఆలీ: ఇంకేంటి విశేషాలు. అంతా బాగానే ఉన్నారు కదా (నవ్వులు).

శివాజీ: నేనైతే ఒప్పుకోను. నువ్వు అస్సలు ఎన్నికల్లో నిలబడవద్దు. బాహ్య ప్రపంచంలో నీకు అనుభవం ఎక్కువ. పాలిటిక్స్‌ పరంగా గ్రౌండ్‌ లెవల్‌లో నాకు అవగాహన ఎక్కువ ఉంది. పదేళ్లు సినిమా వదిలేసి దీనిపై అవగాహన తెచ్చుకున్నా. రాజకీయాల్లో నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు తిరిగి లాక్కొనే సత్తా నీకుండాలి. తీసుకోవడం కూడా ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే ప్రకృతి వనరులు దోచుకోవాలి. ఇసుక, మట్టి, రకరకాల పథకాల్లో వచ్చే డబ్బు జనాలకు వెళ్లకుండా చేయాలి. అది నీవల్ల కాదు. పెట్టడం మాత్రమే నీకు తెలుసు. తీసుకోవడం తెలియదు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం పనిచేయ్‌. దయచేసి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకు. అది నా రిక్వెస్ట్‌. నేను నీ మంచి కోరుకునేవాడిని కాబట్టే ఇది చెబుతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని