Ambajipeta Marriage Band: ‘అంబాజీపేట..’లో ‘రంగస్థలం’ ఛాయలు: నిర్మాత ధీరజ్‌ సమాధానమేంటంటే?

ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒకటి. టీమ్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

Published : 05 Feb 2024 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుహాస్‌ (Suhas) హీరోగా దర్శకుడు దుష్యంత్‌ తెరకెక్కించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band). శివాని నాగారం (Shivani Nagaram) హీరోయిన్‌. శరణ్య కీలకపాత్ర పోషించారు. ఫిబ్రవరి 2న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈసందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ ధీరజ్‌లు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ సంగతులివీ..

* ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో శరణ్య హీరో. ఆమె క్యారెక్టర్‌కు అంత ప్రాధాన్యమివ్వడానికి కారణమేంటి?

సుహాస్‌: ‘నిన్నుకోరి’ దర్శకుడు శివ నిర్వాణ నాకు ఫోన్‌ చేసి ఈ విషయంపైనే ప్రత్యేకంగా మాట్లాడారు. ‘నువ్వు నీ పాత్రకు కాకుండా మిగిలిన పాత్రలకూ స్కోప్‌ ఉండాలని చూస్తావు. అదే నీలో నాకు నచ్చే అంశం. చాలామంది హీరోలు తమ క్యారెక్టర్‌కే నిడివి ఎక్కువ ఉండాలని చూస్తుంటారు’ అని అన్నారు. కథ బాగుండి, సినిమా హిట్‌ అయితే చివరకు హీరోకే పేరొస్తుంది కదా (నవ్వుతూ..).

* వరుసగా మూడో విజయం అందుకున్నారు. నటన పరంగా ప్రశంసలు పొందారు. మీ ఫీలింగ్‌ ఏంటి?

సుహాస్‌: నేను హీరో కావాలనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి రాలేదు. అనుకోకుండా ఇదంతా జరిగింది. ఈ విజయాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

* మీ పాత్ర స్ట్రాంగ్‌గా ఉంది. దాని కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

శివాని: పాత్రలో లీనమయ్యేందుకు రోజూ స్క్రిప్టును చదివేదాన్ని. వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నా.

* రెండు వర్గాల నేపథ్యంలో అల్లుకున్న ఈ కథలో ఒక వర్గాన్నే తెరపై చూపించడానికి కారణమేంటి?

దుష్యంత్‌: ఇలాంటి కథలన్నింటిలో అప్పర్‌ క్యాస్ట్‌, లోయర్‌ క్యాస్ట్‌ ఉంటాయి. వాటి పేర్లు మెన్షన్‌ చేయకుండా సినిమా తీయాలని నేను ముందునుంచీ అనుకున్నా. 

రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు

* క్లైమాక్స్‌ విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిపై మీ స్పందన?

దుష్యంత్‌: చంపడంతో పగ తీరితే దానికి అర్థం ఉండదు. అందుకే పతాక సన్నివేశంలో కీలకపాత్రను కిల్‌ చేయకూడదనుకున్నా. ఈ విషయంలో కొందరికి అసంతృప్తి ఉన్నా కొందరు ప్రశంసిస్తున్నారు.

* ఈ కథలో హీరోగా సుహాస్‌కు ముందు ఇంకెవరినైనా అనుకున్నారా?

ధీరజ్‌: లేదు. సుహాసే హీరో అని ఫిక్స్‌ అయి దర్శకుడు నాకు కథ చెప్పారు.

*  ఈ కథ విన్నప్పుడు గానీ సినిమా చూసినప్పుడు గానీ ‘రంగస్థలం’ ఛాయలు ఉన్నాయని అనిపించిందా?

ధీరజ్‌: మాకేం అనిపించలేదు. ఎందుకంటే ‘రంగస్థలం’ కమర్షియల్‌ సినిమా. దానికి ఉండే క్రేజ్‌ వేరు. మేం వాణిజ్య అంశాలను దృష్టిలోపెట్టుకుని ఈ సినిమా చేయలేదు. అందుకే స్టార్‌లతో కాకుండా వర్ధమాన నటులతో రూపొందించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని