Ambajipeta Marriage Band Review: రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు

Ambajipeta Marriage Band Review; సుహాస్‌ కీలక పాత్రలో దుష్యంత్‌ దర్శకత్వంలో తెలుగు కామెడీ డ్రామా అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఎలా ఉందంటే?

Updated : 02 Feb 2024 14:29 IST

Ambajipeta Marriage Band Review| చిత్రం: అంబాజీ పేట మ్యారేజి బ్యాండు; నటీనటులు: సుహాస్‌, శివానీ నగారం, గోపరాజు రమణ, స్వర్ణకాంత్‌, నితిన్‌ ప్రసన్న, వినయ్‌ మాధవ్‌, జదీప్‌ ప్రతాప్‌, శరణ్య ప్రదీప్‌; సంగీతం: శేఖర్‌ చంద్ర; సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌; ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌; నిర్మాత: ధీరజ్‌ మొగిలినేని, బన్నీవాస్‌, వెంకటేశ్‌ మహా (సమర్పణ); రచన, దర్శకత్వం: దుష్యంత్‌; విడుదల: 02-02-2024

చిన్న పాత్ర‌ల‌తో మొద‌లుపెట్టి  క‌థానాయ‌కుడిగా ఎదిగిన న‌టుడు సుహాస్‌. ‘క‌ల‌ర్‌ఫొటో’, ‘రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌’ చిత్రాలు మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి.  క‌థ‌ల ఎంపిక‌లో  ప్ర‌త్యేక పంథా  కూడా క‌నిపించింది. ఇటీవ‌ల ఆయ‌న క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన మ‌రో చిత్రమే... ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ 2 పిక్చర్స్ నిర్మాణంలో భాగ‌స్వామి కావడం...  ప్ర‌చార చిత్రాలు కూడా ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాకి మంచి ప్ర‌చారమే ల‌భించింది. (Ambajipeta Marriage Band Review) మ‌రి చిత్రం ఎలా ఉంది?ఈ బ్యాండు సంగతి ఏంటి?

క‌థేంటంటే: అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో ఓ స‌భ్యుడు  మ‌ల్లి (సుహాస్‌). చిర‌త‌పూడిలో త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తుంటాడు. అక్క ప‌ద్మ (శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌) ఆ ఊరి స్కూల్లో టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటుంది. ఊరి మోతుబ‌రి వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) వ‌ల్లే ప‌ద్మ‌కి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌నే ఓ పుకారు మొద‌ల‌వుతుంది. ఇంత‌లో వెంక‌ట్‌బాబు చెల్లెలు ల‌క్ష్మి (శివాని నాగారం), మ‌ల్లి ప్రేమ‌లో ప‌డ‌తారు. వెంక‌ట్‌బాబు త‌మ్ముడికీ, మ‌ల్లికీ మ‌ధ్య ఊళ్లో గొడ‌వ, ఆ త‌ర్వాత స్కూల్ విష‌యంలో ప‌ద్మ‌కీ, వెంక‌ట్‌బాబుకీ మ‌ధ్య వైరం మొద‌ల‌వుతుంది. అవి చిలికి చిలికి గాలివాన‌లా మార‌తాయి. ఇంత‌లో మ‌ల్లి, ల‌క్ష్మిల మ‌ధ్య ప్రేమ సంగ‌తి కూడా బ‌య‌ట ప‌డుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై  ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ఓ రోజు వెంక‌ట్‌బాబు... రాత్రివేళ‌లో ప‌ద్మని స్కూల్‌కి పిలిపించి అవ‌మానిస్తాడు. ఆ త‌ర్వాత ఏం జరిగింది?మ‌ల్లి, ల‌క్ష్మిల ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపు తీసుకుంద‌నే విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స‌మాజంలోని అంత‌రాలు, ప‌రువు, ప్రేమ నేప‌థ్యంలో సాగే సినిమాలు ఈ మ‌ధ్య త‌ర‌చూ రూపొందుతున్నాయి. త‌మిళంలో అయితే వీటి ప్ర‌భావం చాలా గ‌ట్టిగా  ఉంది. తెలుగు ద‌ర్శ‌కులూ ఈ మ‌ధ్య మ‌న మూలాల్లోకి వెళ్లి అలాంటి క‌థ‌ల్ని తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. విజ‌యాల్నీ అందుకుంటున్నారు. ఆ త‌ర‌హా  మరో  ప్ర‌య‌త్న‌మే ఇది. (Ambajipeta Marriage Band Review) ఓ అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య ప్రేమే ఈ క‌థ‌కి ముఖ్య‌మైతే ఇదొక సాధార‌ణ‌మై ప్ర‌య‌త్న‌మే అయ్యుండేది. కానీ ద‌ర్శ‌కుడు తెలివిగా ప్రేమ‌క‌థ‌ని మించి, ఆత్మాభిమానం అనే అంశాన్నీ బ‌లంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అది ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిలిపింది.

మ‌ల్లి, ల‌క్ష్మిల ప్రేమ‌క‌థ‌తో మొద‌ల‌య్యే క‌థ ప్రారంభ‌మైన కొద్దిసేపటికే ఆ ఊరు చిర‌త‌పూడి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లి అందులో ఓ పాత్ర‌లా మారుస్తుంది. స‌హ‌జ‌మైన స‌న్నివేశాలు, పాత్ర‌ల తీరుతెన్నులు, సంభాష‌ణ‌లు అంత‌గా ప్ర‌భావం చూపిస్తాయి. ప్రేమ‌క‌థ‌లో కొత్త‌ద‌న‌మేమీ లేదు కానీ... 2007 నాటి వాతావ‌ర‌ణం, అప్పుడ‌ప్పుడే సెల్‌ఫోన్లు వ‌స్తున్న ఆ కాలం నాటి ప్రేమ‌లేఖ‌ల నేపథ్యంతో సినిమా  స‌ర‌దా సర‌దాగా సాగుతుంది. మ‌రోవైపు  కులాల  మ‌ధ్య అంత‌రాల్ని,  ఆర్థిక అస‌మాన‌త‌ల్నీ స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ క‌థ‌తో కనెక్ట్  చేశాడు ద‌ర్శ‌కుడు. విరామం ముందు నుంచి క‌థ మరో మ‌లుపు తీసుకుంటుంది. అప్పటిదాకా ప్రేమ‌క‌థే కీల‌కం కాగా, ఆ తర్వాత నుంచి ఆత్మాభిమానం అంశం ప్ర‌ధానంగా మారుతుంది.

ద్వితీయార్ధం మ‌ల్లి, అత‌ని కుటుంబం చేసే పోరాటం చుట్టూనే సాగుతుంది. క‌థ ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతున్నా, బ‌ల‌మైన స‌న్నివేశాల‌తోనూ, డ్రామాతోనూ ప్ర‌భావం చూపించాడు ద‌ర్శ‌కుడు. పోలీస్ స్టేష‌న్‌లో సాగే స‌న్నివేశాలు... ప్రేమ ప్రాణాల‌ మీదకు తేకూడ‌దు అంటూ మ‌ల్లి, ల‌క్ష్మి తీసుకునే నిర్ణ‌యం, ఆ నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు నాట‌కీయంగా, ఎక్కువ స్వేచ్ఛ‌ని తీసుకుని మ‌లిచిన‌ట్టు అనిపించినా  సినిమా మాత్రం ప్రేక్ష‌కుల‌పై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే  చూపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: పాత్ర‌లే త‌ప్ప న‌టులు క‌నిపించ‌ర‌నే  విష‌యాన్ని రుజువు  చేస్తుందీ చిత్రం. న‌టులు ఆయా పాత్ర‌ల్లో  అలా ఒదిగిపోయారు. మ‌ల్లి పాత్ర‌కి సుహాస్ స‌రైన ఎంపిక అనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో అబ్బాస్ కటింగ్‌తో క‌నిపిస్తూ న‌వ్వించిన అతడు, ద్వితీయార్ధంలో గుండుతో క‌నిపిస్తూ ఎంతో స‌హ‌జంగా న‌టించాడు. భావోద్వేగ ప్ర‌ధాన‌మైన స‌న్నివేశాల్లో అతడి న‌ట‌న మ‌న‌సుల్ని హ‌త్తుకుంటుంది. శివానీ నాగారం... ల‌క్ష్మి పాత్రకి పూర్తిగా న్యాయం చేసింది.  శ‌ర‌ణ్య ప్ర‌దీప్ ఈ సినిమాకి మ‌రో హీరో. ఆమె పాత్ర‌ని డిజైన్ చేసిన తీరు, అందులో ఆమె న‌టించిన విధానం సినిమాకే హైలైట్‌. అన్న‌ద‌మ్ములుగా నటించిన నితిన్‌, విన‌య మ‌హాదేవ్, హీరోకి స్నేహితుడిగా క‌నిపించే జ‌గ‌దీష్ బండారి పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి.

సాంకేతిక విభాగాల‌న్నీ మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. శేఖ‌ర్ చంద్ర పాట‌లు, నేప‌థ్య సంగీతం, వాజిద్ బేగ్ త‌న కెమెరాతో చిర‌త‌పూడి ఆవిష్క‌రించిన తీరు సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. ఎడిటింగ్‌, బ‌ల‌మైన ర‌చ‌న సినిమా గ‌మ‌నాన్నే మార్చేశాయి. ద‌ర్శ‌కుడు దుష్యంత్ వాణిజ్యాంశాల కోస‌మ‌ని క‌థ నుంచి ప‌క్క‌కు వెళ్ల‌కుండా నిజాయ‌తీగా క‌థ‌ని చెప్పే  ప్ర‌య‌త్నం చేయ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. ‘ఆడ‌దాని వెంట ప‌డ‌టం కాదు, వెన‌క ఉండ‌టం మ‌గ‌తనం’,  ‘ఓ ప్రాణం  భూమ్మీద‌కి రావ‌డానికి కూడా ప‌ది నెల‌లు ప‌డుతుంది, అలాంటిది నిన్న  ఉన్న మ‌నిషిని ఈ రోజు లేకుండా చేశావంటూ’ సాగే సంభాష‌ణ‌లు మ‌న‌సుల్ని తాకుతాయి. చాలా విష‌యాల్ని హార్డ్ హిట్టింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు.  మేకింగ్ ప‌రంగానూ ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + క‌థ, నేప‌థ్యం
  • భావోద్వేగాలు
  • సుహాస్‌, శ‌ర‌ణ్య న‌ట‌న
  • బ‌ల‌హీనత‌లు
  •  - ప్రేమ స‌న్నివేశాలు
  • చివ‌రిగా: అంబాజీపేట మ్యారేజీబ్యాండు...  మ‌న‌సుల్ని గెలిచే సౌండు..
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని