Brahmanandam: నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం!

నవ్వులు పంచే నటులు చాలా మందే. ఆ నవ్వుకి సైతం గిలిగింతలు పెట్టగల సమర్థుడు... బ్రహ్మానందం. తనదైన ముఖ కవళిక ఒక్కటి చాలు... ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడానికి! ఒక్క పంచ్‌ చాలు... సన్నివేశం పండడానికి!

Updated : 05 Jan 2024 14:13 IST

నవ్వులు పంచే నటులు చాలా మందే. ఆ నవ్వుకి సైతం గిలిగింతలు పెట్టగల సమర్థుడు... బ్రహ్మానందం. తనదైన ముఖ కవళిక ఒక్కటి చాలు... ప్రేక్షకుడు కడుపుబ్బా నవ్వుకోవడానికి! ఒక్క పంచ్‌ చాలు... సన్నివేశం పండడానికి! అధ్యాపక జీవితం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయనలో నటుడే కాదు... మంచి చిత్రకారుడు, సాహిత్యాభిమానీ ఉన్నారు. నాస్తికత్వం... ఆస్తికత్వం మేళవింపుతో జీవితాన్ని చూసే అలవాటున్న బ్రహ్మానందం ఆ కోణంలోనే తన ఆత్మకథని రాశారు. ‘నేను... మీ బ్రహ్మానందమ్‌’ అంటూ! ఈ సందర్భంగా బ్రహ్మానందంతో ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా ముచ్చటించింది.

‘‘తరాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఉన్నప్పటి తరమే గొప్పదనుకుంటూ బతుకుతున్న మానవాళి ఎక్కువ. అది కాదు కావల్సింది, కాలం కొద్దీ మనం మారుతూ ఉండాలి. నూతనత్వాన్ని అంగీకరించాలి. నువ్వు ఆ పని చేయకపోయినా కాలం ఆగదు, మార్పు ఆగదు. ప్రపంచం అరచేతుల్లోకి వచ్చాక కూడా... ఈ మార్పులు కాదు, కూడదు అనుకోకూడదు. వాటితోపాటు మనం ప్రయాణం చేయాలి’’.


‘‘నేను చాలా గొప్పవాణ్ని, భయంకరమైన ప్రతిభ ఉంది కాబట్టే నేను ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నానని అనుకోవడం అజ్ఞానం. వందల, వేల మంది నటులు ఒక చోట కలిసున్నప్పుడు ఒకొక్కరిపై ఒక్కోసారి సినిమా ఫోకస్‌ లైట్‌ పడుతుంటుంది. ఆ లైట్‌ పడిన కాసేపు నా అంతటివాడు మరొకడు లేడనిపించేలా తళుక్‌ తళుక్‌మని మెరిసిపోతుంటాడు. అప్పుడు చాలా మంది నేను నిజంగా గొప్పవాణ్ని అని భ్రమలో పడి బతుకుతుంటారు. నాపై కూడా ఫోకస్‌ లైట్‌ పడింది. అయితే ఆ లైట్‌ నాపై వేసి అతను టీ తాగడానికి వెళ్లాడేమో, కాసేపు ఎక్కువ సమయం ఉండిపోయింది. అంతే తప్ప నాకు ముందు కానీ, నా తర్వాత కానీ ప్రతిభావంతులు లేరని కాదు అర్థం. బ్రహ్మానందం అంటే ఖరీదైన వ్యవహారం, ఆయన పారితోషికం ఎక్కువ అనే అభిప్రాయాలతో కొత్తతరం ఉంది. నాకు ఇంత పేరు రావడానికి కారణమయ్యారు దర్శకులు. ఈ నా జీవితం వాళ్లకీ ఉపయోగపడాలి కదా. అందుకే కొత్తతరం దర్శకులకు   అందుబాటులో ఉంటూ సినిమాలు చేస్తున్నా’’.


ఆత్మకథకి ‘నేను...’ అనే పేరు పెట్టడానికి కారణం?
ఇది నేను, నా జీవితం అని తెలియడంతోపాటు... అందులో తాత్వికత కూడా స్పురించాలన్న ఆలోచనతో పెట్టిన పేరే అది. నేనెవరిని అని తెలుసుకోవడం గురించే కదా రమణ మహర్షి చెప్పింది. నాదైన జీవితం నుంచి వచ్చింది కూడా కావడంతో నా ఆత్మకథకి ‘నేను...మీ బ్రహ్మానందమ్‌’ అని పేరు పెట్టా.  


ఆత్మకథ రాయడానికి సరైన సమయం ఇదే అనిపించిందా? లేక ఇతరత్రా కారణాలేమైనా మిమ్మల్ని ప్రేరేపించాయా?  
నేను సెల్ఫ్‌ ఎడిటింగ్‌ ఉన్న మనిషిని. నా గురించి నేను గొప్పగా ఆలోచించుకోవడం కంటే... నన్ను నేను పొగుడుకోవడంకంటే విమర్శించుకోవడమే  ఎక్కువ. వచ్చి పది సినిమాలు చేయగానే ఆత్మకథ మొదలు పెట్టామనుకోండి. ఇతనికి ఏం ఆత్మ ఉందని, దానికి ఏం కథ ఉందని అప్పుడే మొదలుపెట్టాడని అనుకుంటారు. నటుడిగా ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నప్పుడే నా ప్రయాణంలోని అనుభవాల్ని చెప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ఇది రాయడం మొదలుపెట్టాకే రెండేళ్లు సమయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై రాయడం కాదు కదా, ఇంచుమించు 70 ఏళ్లు వెనక్కి వెళ్లి రాయల్సి వచ్చింది.


ఆత్మకథలనగానే జీవితంలోని ఎత్తు పల్లాలు... వివాదాలు, సంచలనాలు గుర్తొస్తుంటాయి. మీరూ వాటిని స్పృశించారా?
నా ఆత్మకథ వైవిధ్యంగా ఉండాలనేది నా కోరిక. ఏదో ఒక సంచలన విషయాన్నో లేదంటే వివాదాన్నో స్పృశించి... దాంతో పుస్తకానికి ఓ భావోద్వేగాన్ని ఆపాదించి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో రాసింది కాదు. దేవుడి దయవల్ల అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నాను. నా ఈ జీవితం నుంచి తర్వాత తరం ఏం తెలుసుకుంటుంది? వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందనే కోణంలోనే ఆలోచించి రాశా. నేనే గొప్పవాణ్ని అని కొంతమంది అనుకుంటారు. అదేమీ కాదు, అంతా ఆ దేవుడి దయ అని మరికొంతమంది అనుకుంటారు. మరి ఇందులో నా కోణం ఏది? నా కష్టం.. దానికి భగవంతుడి సాయం తోడైతేనే పరిపూర్ణమైన ప్రతిఫలం అని నమ్ముతాను. ఇలాంటి ఆలోచనలతోపాటు... మరెన్నో విషయాలు ఇందులో ఉంటాయి.


మీలోని తాత్విక ఆలోచనల ప్రభావమే ఈ పుస్తకంపై ఎక్కువ ఉన్నట్టుంది?  
తాత్వికత,  వేదాంతం అని రకరకాల అభిప్రాయాలు వస్తుంటాయి.  నా దృష్టిలో వేదాంతం అనేది, నిజం అనేది వేర్వేరు కాదు. ‘అతను రాత్రి 1 గంట వరకూ మాతోనే కూర్చున్నాడు. సరదాగా మాట్లాడుకున్నాం. ఉన్నట్టుండి ఇంటికి పయనమయ్యాడు. వద్దురా ఈ సమయంలో అన్నా వినలేదు. ప్రమాదం జరిగింది, పోయాడు’ అంటాం. ఇక్కడ అతను రాత్రి 1 గంట వరకూ ఉండటం నిజం, సరదాగా మాట్లాడటం నిజం. ప్రమాదంలో చనిపోవడమూ నిజమే. చివర్లో ఆ ఘటనకి వేదాంతం అద్ది ‘అతని కర్మ అలా ఉంది. అతనికి మృత్యువు అలా దగ్గరైంది, లేకపోతే అప్పటిదాకా మాతో ఉండటం ఏమిటి? వద్దన్నా వినకుండా వెళ్లడమేమిటి’ అంటూ ఉంటాం. మరిక్కడ వేదాంతం ఉందా? నిజం ఉందా? రెండూ కలిసే ఉంటాయి. వేదాంతం కావల్సినవాళ్లు దాన్ని తీసుకుంటారు. నిజం తీసుకోవల్సినవాడు నిజాన్ని తీసుకుంటాడు. నాస్తికుడిగా ఉండాలనుకున్నప్పుడు అలాగే ఉంటాడు. తాను ఆస్తికత్వాన్ని నమ్ముతాననుకుంటే అలానే మాట్లాడతాడు. అందరూ మనుషులే అనే భావనే ఈ పుస్తకంలో ఉంటుంది. అదెక్కువ, ఇది తక్కువ అని కాకుండా నా జీవితంలో ఏది ఉంటే అది రాశా. అందుకే నా పుస్తకంలో అన్నీ ఉండవు, అంతా ఉంటుందని చెబుతున్నా.


ఈ పుస్తకం రాస్తున్నప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన అంశాలేమిటి?
ధనవంతుడు ఎవడో... పేదవాడు ఎవడో తెలియని వయసు ఒకటి ఉంటుంది. అదే... బాల్యం. పక్కనోడికి ఉన్నాయి, నాకు లేవు... తను మంచి డ్రెస్‌ వేసుకున్నాడు, నాకు లేదనే తారతమ్యాల గురించి పూర్తిగా స్పృహ లేని దశ ఒకటి ఉంటుంది. నా జీవితంలో అదొక అందమైన అధ్యాయం. దాన్ని నేను చాలా ఇష్టపడతాను. ఆ ఘట్టాన్ని మరోసారి గుర్తు చేసుకున్నప్పుడు... అది అక్షరబద్ధమైనప్పుడు తెలియని అనుభూతి కలిగింది.


మీ జీవితం ఆధారంగా మరికొన్ని పుస్తకాలు కూడా వస్తున్నాయని తెలిసింది? ఆ వివరాలు చెబుతారా?
బ్రహ్మానందం ఫొటో బయోగ్రఫీ అని ఒక పుస్తకం వస్తుంది. సంజయ్‌ కిశోర్‌ రాస్తున్నారు. అందులో నేను వేసిన బొమ్మలు, చిత్రలేఖనం అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుంది. నా సినిమా జీవితానికి సంబంధించిన విశ్లేషణని ఓ పుస్తకంగా రాస్తున్నారు శ్రీకాంత్‌ కుమార్‌. ఏ ఏ సినిమాల్లో ఎలా నటించాననే విషయాలు అందులో ఉంటాయి. ఇక వివాదాలు అంటున్నారు కదా, పేర్లు ఉచ్ఛరించకుండా అది కూడా అందరికీ ఉపయోగపడేలా అందమైన రీతిలో ఓ పుస్తకం రాద్దామనే ఆలోచన ఉంది. అందులో చిన్నప్పుడు పడిన అవమానాలు మొదలుకొని నాపైన అభిమానం, పొగడ్తలు, తెగడ్తలు అన్నీ ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని