Hanuman: 20 స్క్రిప్ట్‌లు.. ఆరుగురు సూపర్‌ హీరోలు.. ప్రతి సంక్రాంతికి ఒక మూవీ: ప్రశాంత్‌వర్మ!

Hanuman: హనుమాన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ప్రశాంత్‌ వర్మ తన తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.

Published : 14 Jan 2024 17:09 IST

హైదరాబాద్‌: ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సూపర్‌ హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తామని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెలిపారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘హను-మాన్‌’ (Hanuman). తేజ సజ్జా కథానాయకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసి, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ‘హను-మాన్‌’ విశేషాలతో పాటు, తన తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి ఆసక్తికర విషయాలను ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

హను-మాన్‌ ఒక భాగం మాత్రమే!

‘‘హను-మాన్‌’ చుట్టూ చాలా ఉపకథలు ఉంటాయి. ‘నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అని ఈ మూవీలో సముద్రఖని పాత్ర చెబుతుంది. మరి హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి? అనేది తర్వాత పార్ట్‌లో చూస్తారు. ‘హనుమాన్‌’ కేవలం ఒక భాగం మాత్రమే. దీనికి సీక్వెల్స్‌, ప్రీక్వెల్స్‌ చేయాలనే ఆలోచన కూడా ఉంది. షూటింగ్‌ మొదలు పెట్టినప్పుడు సముద్రఖని పోషించిన విభీషణుడి పాత్ర లేదు. దీన్నొక ఫ్రాంఛైజీలా తీసుకురావాలనుకున్నప్పుడు ఈ పాత్రను క్రియేట్‌ చేశాం’’

ఏది తీయాలనుకుంటామో దాన్నే తీస్తాం!

‘‘నా దగ్గర ప్రస్తుతం 12మంది రచయితలు ఉన్నారు. రైటింగ్‌ను ఒక ప్రొఫెషన్‌గా మార్చి వాళ్లతో కలిసి పనిచేస్తున్నా. నాతో ఉన్నవాళ్లు ఎవరూ ఇబ్బంది పడకూడదనే అందరికీ పక్కాగా జీతాలు ఇస్తున్నా. కొన్నేళ్ల కిందటే ఈ పని చేశా. నాకు వచ్చిన ప్రతి ఐడియాను వాళ్లతో పంచుకుంటా. వాళ్లకు వచ్చిన ఆలోచనలను చర్చించి, ది బెస్ట్‌ను సెలక్ట్‌ చేసుకుంటాం. ఈ ప్రక్రియ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. చివరిగా ఏదైతే తీయాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే తీస్తాం. ఒకవేళ షూట్‌ చేసిన తర్వాత దాని కన్నా ఉత్తమ ఆలోచన వస్తే, అది నిజంగా అవసరం అనిపిస్తేనే రీషూట్‌ చేస్తాం’’

‘జై హనుమాన్‌’ మూవీ ఇంకా పెద్దది

‘‘హనుమాన్‌’లో విలన్‌ పాత్రను ఇంకా బాగా చూపించాల్సింది. అందుకోసం చాలా సీన్స్‌ అనుకున్నాం. బడ్జెట్‌ పరిమితితో పాటు, వచ్చే పార్ట్‌ కోసం వాటిని దాచి పెట్టాం. ‘హనుమాన్‌’ స్టోరీతో పోలిస్తే,‘ జై హనుమాన్‌’ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. తేజ ఉంటాడు కానీ, పూర్తిగా కనిపించడు. కొత్త పాత్రలు తెరపైకి వస్తాయి. అవేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి. అసలు ‘జై హనుమాన్‌’ అన్నది వేరే కథ. ‘హనుమాన్‌’ ముందుగా తీసి, ఆ తర్వాత దాన్ని చేద్దామనుకున్నాం. ఈ మూవీ షూటింగ్‌ మొదలైన తర్వాత రెండు కథలను కలిపాం’’

20 స్క్రిప్ట్‌లు.. ఆరుగురు సూపర్‌ హీరోలు..

‘‘నేను దర్శకత్వం వహించే ఏ సినిమా అయినా చిత్రీకరణ పూర్తయ్యే వరకూ రిలీజ్‌ డేట్‌ ప్రకటించొద్దని నిర్మాతకు చెబుతా. ‘కల్కి’ విషయంలో జరిగిన పొరపాటు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే ముందుగానే రిలీజ్‌ డేట్‌ చెప్పేస్తే, నేను అందుకు తగినట్లు పనిచేయడం కష్టం. అలాగే, ‘హను-మాన్‌’ వచ్చే వరకూ ‘ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ గురించి ప్రకటించకూడదనుకున్నా. ఈ యూనివర్స్‌కు సంబంధించి మొత్తం 20 స్క్రిప్ట్‌లు ఉన్నాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తాం. అందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ఇంకాస్త సమయం ఉంది. నాతో పాటు కొత్త దర్శకులు కూడా పరిచయమవుతారు. ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుంది. ‘జై హనుమాన్‌’, ‘అధీర’తో పాటు సూపర్‌ విమెన్‌ కథలు కూడా వస్తాయి. ప్రస్తుతం మూడు సినిమాలను రెడీ చేస్తున్నాం. అసలు ఈ యూనివర్స్‌తో సంబంధం లేకుండా వేరే సినిమా కూడా ఒకటి చేశా. అది 90శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో నెలరోజుల్లో దాన్ని పూర్తి చేసి, ఆ వివరాలు కూడా చెబుతా’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని