సంక్రాంతికి మేరీ క్రిస్మస్‌

‘మేరీ క్రిస్మస్‌’...కత్రినా కైఫ్‌, విజయ్‌ సేతుపతి జంటగా నటిస్తున్న క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది.

Updated : 17 Nov 2023 01:18 IST

‘మేరీ క్రిస్మస్‌’...కత్రినా కైఫ్‌, విజయ్‌ సేతుపతి జంటగా నటిస్తున్న క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది డిసెంబరు 8న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొత్త విడుదల తేదీని పంచకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా ఫొటోను పోస్ట్‌ చేసింది. ‘ప్రతి చిత్ర దర్శకనిర్మాతలలాగే ఈ సినిమాను ఎంతో ప్రేమతో రూపొందించాము. ఈ ఏడాది చివరి రెండు నెలలు చిత్రాల విడుదల కోలహలంతో నిండిపోయాయి. ఈ సీజన్‌లో విడుదలైన సినిమాల అనుభూతిని, ఆనందాన్ని ఆస్వాదించడానికి మా సినిమా విడుదల తేదీని పొడిగిస్తున్నాము. మా చిత్రాన్ని  2024 జనవరి 12న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాము’ అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సినిమా హిందీ, తమిళ భాషల్లో సంక్రాంతి సందర్భంగా అభిమానులను అలరించనుందన్నమాట.


సుమంత్‌ చిత్రం... మహేంద్రగిరి వారాహి

సుమంత్‌ కథానాయకుడిగా జాగర్లపూడి సంతోష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మీనాక్షి కథానాయిక. కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మాతలు. ఈ సినిమాకి ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరుని ఖరారు చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి.


వీడు.. నిన్ను రాణిని చేసేస్తాడు!

‘రాజు యాదవ్‌’గా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు గెటప్‌ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి సంయుక్తంగా నిర్మించారు. అంకిత ఖరత్‌ కథానాయిక. ఈ సినిమా తొలి గీతాన్ని దర్శకుడు బాబీ ఇటీవల విడుదల చేశారు. ‘‘రాజు యాదవ్‌ నేడు నీ రాస్తాలోకొచ్చాడు.. రాజు యాదవ్‌ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు’’ అంటూ హుషారుగా సాగుతున్న ఈ పాటకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరాలు సమకూర్చారు. చంద్రబోస్‌ సాహిత్యమందించగా.. రామ్‌ మిరియాల ఆలపించారు.     ‘‘ప్రేమ, వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో నిండిన చిత్రమిది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కూర్పు: బి.నాగేశ్వర రెడ్డి, ఛాయాగ్రహణం: సాయిరామ్‌ ఉదయ్‌.


కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే చిత్రమిది

‘‘ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఒక వ్యక్తి కాదు.. శక్తి. తెలంగాణ కోసం ఉద్యమాలే ఊపిరిగా బతికారు. పేద ప్రజలకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి. అలాంటి కాళోజీ కథతో సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. ఆ ప్రయత్నాన్ని ‘ప్రజాకవి కాళోజీ’ రూపంలో తెరపైకి తీసుకొచ్చి ప్రభాకర్‌ జైనీ దంపతులు వారి జన్మ ధన్యం చేసుకున్నార’’న్నారు నటుడు, దర్శక నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి. ఆయన హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ‘ప్రజాకవి కాళోజీ’ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మూల విరాట్‌ టైటిల్‌ పాత్రలో ప్రభాకర్‌ జైనీ తెరకెక్కించిన చిత్రమిది. విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్‌ జైనీ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా దృష్టిలో ఒక అసాధ్యమైన టాస్క్‌. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని దీన్ని విజయవంతంగా పూర్తి చేశాం. కాళోజీ ఔన్నత్యాన్ని పెంచే విధంగా.. ప్రతి తెలుగు వాడు గర్వించే విధంగా సినిమా ఉంటుంది. దీంట్లో సమాజం కోసం ప్రాణాలర్పించే ఒక యువ జంటను చూపించాం. పునరుజ్జీవం పొందుతున్న.. సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న సమాజాన్ని చూపించాం. ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణు ఊడుగుల, వీఎన్‌ ఆదిత్య, నరసింహప్ప, మామిడి హరికృష్ణ, వేముల శ్రీనివాస్‌, అమృత లత తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని