Venkatesh: అది తెలిసుంటే.. అందరికీ చెప్పేవాణ్ని

‘‘సంక్రాంతి పండగ సందర్భంగా నా సినిమాలు చాలానే వచ్చాయి. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. ఇది మరో సంక్రాంతి. ఈసారి నాలుగు సినిమాలు వస్తున్నాయి. అన్నీ బాగా ఆడతాయి’’ అన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌. ‘సైంధవ్‌’తో మరోసారి ఆయన సంక్రాంతి బరిలో నిలిచారు. వెంకీ కెరీర్‌లో ఇదొక మైలురాయిలాంటి 75వ చిత్రం.

Updated : 12 Jan 2024 05:04 IST

‘‘సంక్రాంతి పండగ సందర్భంగా నా సినిమాలు చాలానే వచ్చాయి. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. ఇది మరో సంక్రాంతి. ఈసారి నాలుగు సినిమాలు వస్తున్నాయి. అన్నీ బాగా ఆడతాయి’’ అన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌. ‘సైంధవ్‌’తో మరోసారి ఆయన సంక్రాంతి బరిలో నిలిచారు. వెంకీ కెరీర్‌లో ఇదొక మైలురాయిలాంటి 75వ చిత్రం. సంక్రాంతి పండగని పురస్కరించుకుని ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వెంకటేశ్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ‘ఒక్కసారి నవ్వండి... అది మీపై ఎంతో ప్రభావం చూపిస్తుంది’ అంటూ ఎప్పట్లాగే అందరినీ నవ్విస్తూ ఆయన చెప్పిన విషయాలివీ...

‘సైంధవ్‌’ మీకు 75వ సినిమా. ఈ విషయానికి మీరు ఏ మేరకు ప్రాధాన్యం ఇచ్చారు?  

బయట నుంచి చూసేవాళ్లకే ఆ లెక్కలు తప్ప, నేనెప్పుడూ సినిమాల్ని అలా చూడను. సంఖ్య అనేది నాకు మాత్రమే ప్రత్యేకం కాదు కదా. ప్రతి ఒక్కరి కెరీర్‌లోనూ అది సాధారణమే. అందుకే ఇది 50, ఇది 75 అని మైలురాళ్లతో ముడిపెట్టి నేనెప్పుడూ సినిమాలు చేయలేదు. 75 మాత్రమే కాదు కదా, ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అలా ప్రవాహంలా పనిచేసుకుంటూ వచ్చానంతే.

ఈసారి యాక్షన్‌ కథతో సినిమా చేయాలని ముందే అనుకున్నారా, లేక సహజంగానే ఈ సినిమాకి అలాంటి కథ కుదిరిందా?

సహజంగా కుదిరిందే. ఈ దశలో ఇలాంటి కథ చేయాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. ‘బొబ్బిలిరాజా’ చిత్రీకరణ సమయంలో గాయాలు తగిలితే, ఆ సినిమా తర్వాత నుంచి కొన్నాళ్లపాటు మహిళలకి నచ్చేలా కుటుంబ కథలు చేశా. మళ్లీ కొన్నాళ్ల తర్వాత యాక్షన్‌ కథలు చేశా. అంతే తప్ప కథలు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండవు. నమ్మకంతో పని చేయడానికి సిద్ధంగా ఉంటే, ఆ సమయంలో మంచిది ఏదో ఒకటి వస్తుంది. అది వచ్చినప్పుడు మన ప్రయత్నలోపం లేకుండా శక్తినంతా ధారబోయాలి.

శైలేశ్‌ కథ చెప్పాక... మీరెలాంటి మార్పుల్ని సూచించారు?

నేనెప్పుడూ ఓ సహాయ దర్శకుడిలా మెలుగుతా. స్క్రిప్ట్‌ పరంగా చర్చించుకుంటూ, నాకు తోచినవి చెబుతూ మెరుగులు దిద్దుకుంటూ పనిచేస్తుంటాం. అంతిమంగా దర్శకత్వం అనేది తన పని, నటించడం నా పని. ఒక్కసారి అన్నీ కుదిరాయంటే నా పనిని నేను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటా.

ఈ సినిమాకి ముందు చాలా రోజులపాటు కథలు విన్నారు. ‘సైంధవ్‌’ ఎలా సెట్‌ అయ్యింది?

అదంతా కూడా ప్రయాణంలో భాగమే. సమయం అనేది మన చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు అప్పటికప్పుడు సినిమా కుదురుతుంది, కొన్నిసార్లేమో ఏడాది ఖాళీగా కూర్చున్నా కథలేమీ రావు. అందుకే ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలనే లెక్కల్ని నేనెప్పుడూ వేసుకోలేదు. ఒక సినిమా ఎన్నో రకాలుగా సెట్‌ అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడే ఎవరో ఒకరు ఉన్నట్టుండి కథ  చెబుతానని పిలవొచ్చు. ఆ సమయంలో నాకు వినాలనే ఆసక్తి కలగొచ్చు, విన్నాక బాగుందని ఓకే చేయొచ్చు. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చిన కథ కూడా మరొకరి దగ్గరికి వెళ్లొచ్చు.  ఇవన్నీ జీవితంలో సంఘటనలు. శైలేశ్‌ ఓ కొత్త రకమైన కథతో వచ్చాడు. తను చెప్పగానే చేయాలనే ఆసక్తి కలిగింది. నిర్మాత వెంకట్‌ బోయనపల్లికి నాతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో ఉందట. అలా అన్నీ ఈ సినిమాకి కుదిరాయి.

యాక్షన్‌ ప్రధానంగా సాగే కథలు ఇదివరకు చాలా చేశారు. వాటికీ, ‘సైంధవ్‌’కీ మధ్య మీరు గమనించిన వ్యత్యాసమేమిటి?

ఇది పూర్తి భిన్నం. చంద్రప్రస్థ అనే ఓ కల్పిత నగరం చుట్టూ సాగుతుంది. ఈ నేపథ్యమే నాకు కొత్త. కథాంశం, కొత్తతరం యాక్షన్‌, కూతురి సెంటిమెంట్‌... ఇలా చాలా ఆకర్షణలు ఉంటాయి. కథా గమనం, వేగం, కథ నుంచి ఎక్కడా బయటికి రాకుండా సినిమాని నడిపించిన తీరు...ఇవన్నీ కలిసొచ్చే విషయాలు. శైలేశ్‌ కొలను బలమైన భావోద్వేగాలతో పతాక సన్నివేశాల్ని డిజైన్‌ చేశాడు. చిన్న పిల్లలతో కలిసి నటించడం నాకు మొదట్నుంచీ అలవాటే. వాళ్లు నాతో సరదాగా ఉంటారు. బేబి సారా చాలా బాగా నటించింది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ, ఆండ్రియా... ఇలా
అందరి పాత్రలూ ఆస్వాదించేలా ఉంటాయి.

కథానాయకుడిగా మీదైన శైలిలో మీరు ప్రయాణం చేస్తుంటారు. బయట నుంచి వచ్చే అభిప్రాయాల్ని మీరు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంటారు?

విస్మరించను కానీ, వాటిని ఎప్పుడు ఏ మేరకు స్వీకరించాలనేది మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది. పది మంది పది రకాల అభిప్రాయాలు చెబుతుంటారు. వాటి గురించి ఆలోచించడం కంటే, చేస్తున్న పని విషయంలో నిజాయతీగా ఉండటం ముఖ్యం. ఒక అభిప్రాయం నన్ను నిరాశ పరిచేలా, నాపై ప్రతికూల ప్రభావం చూపించేలా ఉండకూడదు కదా? ఒకప్పుడు రీమేక్‌లు చేయవద్దని సలహా ఇచ్చేవాళ్లు.  ‘పవిత్రబంధం’, ‘పెళ్ళి చేసుకుందాం’ తరహా సినిమాలు చేస్తున్నప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. ఇది ఆడదని కానీ, ఇవే ఆడతాయని కానీ ఎవ్వరం చెప్పలేం. కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఇది తప్పు, ఇది కాదు అని ఎలా చెప్పగలం?


వివాదాలకు దూరంగా ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఇదెలా సాధ్యమైంది?
నిజంగా అది తెలిసుంటే అందరికీ చెప్పేవాణ్ని (నవ్వుతూ). చిన్నప్పటి నుంచీ ఎవరికీ అసౌకర్యం కలిగించకూడదనే ఓ మనస్తత్వం నాది. స్కూల్‌, కాలేజీలో కూడా ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడూ అంతే.

మీరూ, నాని కలిసి సినిమా చేస్తారనే ఓ ప్రచారం సాగుతోంది నిజమేనా?
అన్నీ చేసేద్దాం (నవ్వుతూ).

తదుపరి మీరు చేయనున్న సినిమా వివరాలేమిటి? ‘స్వామి వివేకానంద’ బయోపిక్‌ ఎంతవరకు వచ్చింది?
రెండు మూడు కథలు ఉన్నాయి. ఇంకా వాటిపై నిర్ణయం తీసుకోలేదు. ‘స్వామి వివేకానంద’ స్క్రిప్ట్‌ ఒక స్థాయి వరకూ వచ్చింది కానీ, ముందుకు కదల్లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని