Harihara veeramallu: లెక్కలు సరిచేసే రక్షకుడు

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్‌ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది.

Updated : 03 May 2024 09:50 IST

వన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పట్టాలెక్కిన ఈ పాన్‌ ఇండియా సినిమా కొన్నేళ్లుగా చిత్రీకరణ దశలోనే ఉంది. పవన్‌ ఓవైపు రాజకీయాలతోనూ.. మరోవైపు ఇతర సినిమాలతోనూ బిజీగా ఉండటంతో ఇది ఆలస్యమవుతూ వస్తోంది. అయితే గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దాంతో పాటు ఈ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తొలి భాగానికి ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వెర్సెస్‌ స్పిరిట్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దాదాపు నిమిషంన్నరకు పైగా నిడివితో ఉన్న ఈ టీజర్‌లో వీరమల్లు ప్రపంచాన్ని పరిచయం చేశారు. ‘‘ప్రతివాణ్నీ వాడిపైవాడు దోచుకుంటాడు. మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబుని దిల్లీలో ఉండే మొఘల్‌ చక్రవర్తి. మనపైనున్న ఈ దొంగలందర్నీ దోచుకోవడానికి ఆ భగవంతుడు కచ్చితంగా ఒకడ్ని పంపిస్తాడు. వాడొచ్చి.. ఈ దొంగలు, దొరల లెక్కలన్నీ సరి చేస్తాడు’’ అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌తో వీరమల్లుగా పవన్‌ను పరిచయం చేసిన తీరు ఆసక్తిరేకెత్తించింది. ఇదొక రాబిన్‌హుడ్‌ తరహా కథాంశంతో రూపొందనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. దానికి తగ్గట్లుగానే టీజర్‌లో సన్నివేశాలు కనిపించాయి. అలాగే కోహినూర్‌ వజ్రం దీంట్లో కీలకంగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రచార చిత్రంలో పవన్‌ యాక్షన్‌ హంగామా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమాకి సంబంధించిన మిగిలిన చిత్రీకరణ, నిర్మాణానంతర పనుల్ని క్రిష్‌ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా కనిపించనుండగా.. బాబీ దేవోల్‌, నాజర్‌, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఎ.దయాకర్‌ రావు, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌, మనోజ్‌ పరమహంస.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని