Hi Nanna: ‘హాయ్ నాన్న’లో సర్‌ప్రైజ్‌ పాత్రలున్నాయి: డైరెక్టర్ శౌర్యువ్

నాని హీరోగా శౌర్యువ్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంలో భాగంగా శౌర్యువ్‌ విలేకర్లతో ముచ్చటించారు.

Published : 02 Dec 2023 17:42 IST

నాని (Nani) హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక నటించగా.. శ్రుతి హాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. ఇప్పటికే నాని వరుస ఇంటర్వ్యూలతో సినిమా విశేషాలు షేర్‌ చేస్తుండగా.. తాజాగా దర్శకుడు శౌర్యువ్‌ (Shouryuv) విలేకర్లతో ముచ్చటించి మరికొన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అవేంటంటే..

మీ నేపథ్యం గురించి చెప్పండి ? ‘హాయ్ నాన్న’ జర్నీ ఎలా మొదలైంది? 

శౌర్యువ్‌: మాది వైజాగ్. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇంట్లో వాళ్ళు మెడిసిన్ చేయమని చెప్పారు. అయితే సినిమాలపై ఇష్టంతో పరిశ్రమలోకి వచ్చాను. మొదట కొన్ని చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశాను. నాలుగేళ్ల క్రితమే ‘హాయ్ నాన్న’ కథ రాసుకున్నాను. ఈ కథ నానికి చెప్పిన వెంటనే ఓకే అన్నారు. ఆరు నెలల ప్రీ ప్రొడక్షన్స్‌ వర్క్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభించాం. 

‘హాయ్ నాన్న’కు ప్రధాన బలం ఏమిటి?
శౌర్యువ్‌: ఎమోషన్. తండ్రి కూతురు మధ్య అనుబంధం. అలానే మృణాల్ పాత్ర సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్‌ కారణంగానే నాని అంగీకరించాడని భావిస్తున్నా. మృణాల్‌ ఇటీవల మాట్లాడుతూ ‘హాయ్ నాన్న’ అందరికీ నచ్చుతుందని చెప్పారు. లేదంటే పేరు మార్చుకుంటా అన్నారు. సినిమాపై ఎంతో నమ్మకంతోనే ఆ మాట చెప్పారు.

ట్రైలర్‌ చూస్తుంటే నాగార్జున ‘సంతోషం’ గుర్తొస్తుందని అంటున్నారు?ఆ ఛాయలు ఉంటాయా? 
శౌర్యువ్‌: లేదు. ‘సంతోషం’ కంటే ముందు ‘కుచ్‌కుచ్‌ హోతాహై’ ఉంది. సింగిల్ ఫాదర్‌ ప్రేమలో పడ్డాడని అనగానే ఆ సినిమాలన్నీ గుర్తొస్తాయి. కానీ, ‘హాయ్‌ నాన్న’ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజూ మన జీవితంలో ఎదురయ్యే అంశాలు ఇందులో కనిపిస్తాయి.

మొదటి సినిమానే ఇలాంటి విభిన్నమైన కథను తెరకెక్కించడానికి కారణం?
శౌర్యువ్‌: దర్శకత్వం చేసే అవకాశం త్వరగా వస్తుందని యాక్షన్ కథలు కూడా రాశాను. కానీ, ప్రేమకథ అయితేనే ప్రేక్షకులకు గుర్తుంటుంది. ఈ సినిమా భావోద్వేగాలతో కూడిని ప్రేమకథ. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. ట్రైలర్‌లోనే సినిమా కథ అంతా తెలిసేలా ప్లాన్ చేశా. ఎందుకంటే ప్రేక్షకుడికి మనం ఏం చూపనున్నామనేది తెలియాలి. అందుకే ట్రైలర్‌ను అలా కట్‌ చేశాం. 

‘హాయ్‌ నాన్న’ అనుకున్న దానికంటే ముందే విడుదల చేస్తున్నారెందుకు?
శౌర్యువ్‌: నాకు ఎంత సమయం ఉన్నా సరిపోదు(నవ్వుతూ). మొదట డిసెంబర్‌ 21న విడుదల చేయాలని అనుకున్నాం. ఇప్పుడు 7తేదీకి మార్చాం. అందరం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం. నాని చాలా సలహాలిచ్చారు. హైదరాబాద్‌, గోవా, ముంబయి, కునూర్‌..తదితర ప్రాంతాల్లో 97 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం.  

‘వాళ్లను నేను ఎంతో మిస్‌ అవుతున్నా’ : షారుక్ ఖాన్‌

ఇప్పుడు యాక్షన్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రేమకథను రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తోంది?
శౌర్యువ్‌: ఇందులో డబుల్‌ మీనింగ్ డైలాగులు లేవు. హింసలేదు. ఇది చాలా భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథా చిత్రం. ఎమోషన్స్‌ తగ్గిపోతున్న సమయంలో ‘హాయ్‌ నాన్న’ లాంటి సినిమాలు రావాలి. ఈ కథ యూనివర్సల్‌. అందుకే పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల వారికి నచ్చుతుంది.

సింగిల్ పేరెంట్‌ ఫాదర్‌పై మీ అభిప్రాయం ఏమిటి?
శౌర్యువ్‌: సాధారణంగా పిల్లల బాధ్యతలు తల్లిదండ్రులు ఇద్దరూ చూసుకుంటారు. కానీ, సింగిల్ పెరెంట్‌ అయితే పూర్తి బాధ్యత ఒకరే చూసుకోవాలి. ఇందులో నాని పాత్ర అలానే ఉంటుంది. ఎక్కడ ఉన్నా సమయానికి కూతురు దగ్గర ఉంటాడు. కథ అంతా ఇలానే సాగుతుంది. అలాగే ఈ సినిమాకు సంగీతం మరింత బలాన్నిచ్చింది. ఇక ‘ఓడియమ్మ..’ పాట విక్రమ్‌ వాళ్ల అబ్బాయితో పాడించాం. అతడు నాకు మంచి స్నేహితుడు.

మృణాల్ ఠాకూర్‌ను ఎవరు ఎంపిక చేశారు?
శౌర్యువ్‌: ఈ సినిమాలో మృణాల్‌ను నేనే ఎంపిక చేశా. ఆమె నటించిన ‘తుపాన్’ చూశా. అందులో ఆమె నటన చాలా నచ్చింది. ‘హాయ్ నాన్న’లో ఏడ్చే సన్నివేశాలు చాలా ఉంటాయి. మృణాల్‌ అలాంటి సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటిస్తారు. అందుకే ఆమెను ఎంపిక చేశా. ఇక బేబీ కియారా చాలా ప్రతిభావంతురాలు. ఎలాంటి సన్నివేశంలోనైనా సులువుగా నటించగలదు. స్క్రిప్ట్‌ పేపర్‌ ఇవ్వగానే ఎంత పెద్ద డైలాగునైనా చెప్పేస్తుంది. మేమంతా ఆశ్చర్యపోయాం.

శ్రుతి హాసన్ పాత్ర గురించి చెప్పండి?
శౌర్యువ్‌: ఇందులో శ్రుతి హాసన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే చెప్పగలను. ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌ పాత్రలు కూడా ఉన్నాయి. ఇక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సపోర్ట్‌ చేశారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నాకు సొంత బ్యానర్‌లా అనిపించింది.

‘హాయ్ నాన్న’ మీకు సవాలుగా అనిపించిన విషయం ఏమిటి? 
శౌర్యువ్‌: ఇలాంటి కథను తెరకెక్కించడమే ఓ సవాలు. ఇది చాలా సున్నితమైన కథ. 

దర్శకుడు కావడానికి మీకు స్ఫూర్తి ఎవరు?
శౌర్యువ్‌: రాజమౌళి గారు. ఆయన సినిమాలు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నా. కొత్తగా వచ్చే ప్రతి దర్శకుడికి ఆయనే స్ఫూర్తి. ప్రస్తుతం కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత వాటి గురించి చెబుతాను.

ఇక తాజాగా ‘హాయ్ నాన్న’  సెన్సార్‌ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు క్లీన్‌ యూ (U) సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు చిత్రబృందం తెలిపింది. దీని రన్‌టైమ్‌ 155 నిమిషాలు (2.35 గంటలు) ఉంది. అలాగే ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు రెండు మార్పులు సూచించింది. కొన్ని అభ్యంతర పదాలు ఉన్న సన్నివేశాల్లో మ్యూట్‌ను వాడాలని సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని