Shah Rukh Khan: ‘వాళ్లను నేను ఎంతో మిస్‌ అవుతున్నా’ : షారుక్ ఖాన్‌

తన తదుపరి చిత్రం ‘డంకీ’ (Dunki) ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తాజాగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు.

Updated : 02 Dec 2023 16:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షారుక్‌ ఖాన్‌ (Shahrukh Khan) ప్రధాన పాత్రలో రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన చిత్రం ‘డంకీ’ (DUNKI). అక్రమ వలసల నేపథ్యంలో సాగే కథతో కామెడీ డ్రామాగా ఇది సిద్ధమైంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 21న ‘డంకీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే షారుక్‌ ఖాన్‌ తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా #ASKSRK నిర్వహించారు. అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివే..!

‘డంకీ’ ఓకే చేయడానికి ఆ కథలో మీకు నచ్చిన అంశం ఏమిటి?

షారుక్‌: చాలా అంశాలు ఉన్నాయి. రాజు, అభిజత్‌ ఈ కథను నా దృష్టికి తీసుకువచ్చారు. కథ వినగానే కొత్తగా అనిపించింది. (అక్రమ వలసలకు సంబంధించిన టెక్నిక్‌) ‘డంకీ’ గురించి తెలుసుకుని ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉన్నా.

కథ, ఎమోషన్స్‌.. ఏ విషయం కోసం ప్రేక్షకులు ఈ సినిమా చూడాలి?

షారుక్‌: ఈ సినిమా ఎంతో సరదాగా, ఎన్నో భావోద్వేగాలతో ఉంటుంది. రాజ్‌కుమార్‌ హిరాణీ బ్రాండ్‌ సినిమా ఇది.

ఈ స్థాయిలో ఉండి కూడా మీరింతలా ఒదిగి ఉండటానికి కారణం ఏమిటి?

షారుక్‌: ఈ భూమ్మీదనే జన్మించాం.. ఈ భూమిలోనే మరణిస్తాం. కాబట్టి మనం ఎప్పుడూ భూమ్మీదనే నిలబడాలి. అదే విధంగా కష్టపడాలి.

పఠాన్‌ 11సార్లు, జవాన్‌ 13సార్లు చూశా. మరి ‘డంకీ’ని ఎన్నిసార్లు చూడమంటారు?

షారుక్‌: కడుపుబ్బా నవ్వుకోవాలనిపించినప్పుడల్లా సినిమా చూడు.

మానసికంగా బలహీనతకు గురయ్యే విషయం ఏమిటి?

షారుక్‌: నా కుటుంబం విషయంలో నేను ఎంతో ఎమోషనల్‌గా ఉంటా.

‘డంకీ’ నుంచి విడుదలైన ‘నికలే యే కబీ హమ్‌ ఘర్‌ సే’ పాట నా కుటుంబాన్ని గుర్తు చేసింది. మీకు కూడా అలాగే అనిపించిందా?

షారుక్‌: అవును. ఆ పాట విన్నప్పుడు నా తల్లిదండ్రులు గుర్తుకువచ్చారు. దిల్లీ రోజులు.. నా చిన్నతనం.. స్నేహితులు.. ఎంతో భావోద్వేగంగా అనిపించింది. తల్లిదండ్రులను ఎంతగానో మిస్‌ అవుతున్నా.

మీ దృష్టిలో సక్సెస్‌ అంటే ఏమిటి?

షారుక్‌: ప్రతి క్షణాన్ని మెచ్చుకుంటూ.. జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్‌ చేయడమే సక్సెస్ అంటే. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడమే సక్సెస్‌.

114 రోజుల్లోనే ‘సలార్’ను పూర్తిచేశాం.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ప్రశాంత్ నీల్‌

ఫ్యామిలీతో కలిసి చూడటానికి డంకీ సినిమా సరైన వినోదాన్ని అందిస్తుందా?

షారుక్‌: మెండైన వినోదం అందిస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత.. ‘ఇలాంటి చిత్రాలు ఎందుకని ఎక్కువగా రావడం లేదు’ అని కుటుంబసభ్యులు తప్పక అడుగుతారు.

‘డంకీ’లో వేరే హీరోయిన్‌ను కాకుండా తాప్సీని మాత్రమే తీసుకోవడానికి కారణం ఏమిటి?

షారుక్‌: తాప్సీ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఒక నటుడిగా ఆమెతో కలిసి వర్క్ చేయడాన్ని ఎంతగానో ఎంజాయ్‌ చేశా. మేమిద్దరం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం.

గత ఎనిమిదేళ్ల నుంచి నేను కెనడాలో ఉంటున్నా. ‘డంకీ’లోని ఓ పాట విన్నాక.. ఇకపై ఇక్కడ ఉండాలని లేదు. స్వదేశానికి వచ్చేయాలని ఉంది..!

షారుక్‌: భారతదేశం.. ఎంతో గొప్పది. కానీ నిర్ణయాలు తీసుకునేముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. జీవనోపాధి కోసం మనం వేరే ప్రాంతాల్లో పనిచేయాల్సిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు వస్తాయి.

మీ గురించి కాదు కానీ రాజ్‌కుమార్‌ హిరాణీ సినిమా కావడంతో ‘డంకీ’ పట్ల నేను ఆసక్తిగా ఉన్నా?

షారుక్‌: ఇది సరైన కారణం. రాజు సినిమాలో భాగమైనందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. సినిమా ఏదైనా సరే అది పూర్తిగా దర్శకుడి ప్రాజెక్ట్‌. హీరో అనేవాడు కేవలం వస్తాడు, నటిస్తాడు, వెళ్తాడు అంతే.

రోలర్‌ స్కేటింగ్‌తో సుహనాఖాన్‌ మీ స్పాట్‌లైట్‌ మొత్తాన్ని తన వైపునకు మరల్చుకున్నారు. మీరెప్పుడు రోలర్‌ స్కేటింగ్‌ చేస్తారు?

షారుక్‌: అలాంటిది నేను ఎప్పటికీ చేయను. గతంలో నేను ప్రయత్నించా. కాకపోతే కిందపడిపోయా. స్కేటింగ్‌ను సుహనాకే వదిలేశా. అందులో ఆమె ప్రావీణ్యురాలు.

‘డంకీ’ చూసిన తర్వాత ఎలాంటి అనుభూతితో ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటకు వస్తారు?

షారుక్‌: చిరునవ్వులు చిందిస్తూ.. కుటుంబంపై ప్రేమ, దేశభక్తితో బయటకు వస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని